Wednesday, 29 April 2015

మరో ‘ఫెర్గ్యుసన్‌’!

మరో ‘ఫెర్గ్యుసన్‌’!
అంతర్జాతీయ సమాజానికి అమెరికా అసలు రంగుని అగ్నికీలల వెలుగుల్లో విస్పష్టంగా చూపించిన ఫెర్గ్యుసన్‌ నగరం మాదిరిగానే ఇప్పుడు అక్కడ మరో నగరం తగలబడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి మాటలతో మిగతా ప్రపంచాన్ని మాయచేస్తున్న అగ్రరాజ్య జాత్యాహంకారాన్ని రుజువు చేసే అమానవీయమైన ఘటన అక్కడ మరొకటి జరిగింది. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ నగరంలో ఫ్రెడ్డీ గ్రే అనే నల్లజాతి యువకుడు పోలీసు కస్టడీలో మరణించాడు. అతడి మెడ ఎముక మూడుచోట్ల విరిగిపోయింది. వెన్నెముక అనేక చోట్ల చీలిపోయింది. ఆరంభంలో నిరసన ప్రదర్శనలు ప్రశాంతంగానే కొనసాగినా, అంత్యక్రియల నాడు అగ్గి రాజుకుంది. ఆగ్రహంతోనూ, అవమానంతోనూ దహించుకుపోతున్న వందలాదిమంది నల్లజాతివారు వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. రెండువందల వాహనాలు తగలబడ్డాయి. భవనాలు దగ్ధమైనాయి. ఇరవైమంది పోలీసులకు గాయాలయ్యాయి. రక్షకదళాలను ఎన్నింటిని రప్పించినా, కర్ఫ్యూ ఎంతకాలం కొనసాగించినా పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడం అంత సులభం కాదు.
పోలీసుల కథనం ప్రకారం ఫ్రెడ్డీ గ్రే జేబులో బటన్‌ నైఫ్‌ ఉంది, అతడు పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అతడితో పాటు ఉన్నవారు అది ఎంతమాత్రం నిజం కాదంటున్నారు. వీధిలో నడుస్తూ వెడుతున్నప్పుడు గ్రే పొరపాటున దూరం నుంచి తమను గమనిస్తున్న పోలీసుల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. కొంతసేపటి తరువాత, మిగతా మిత్రులు విడిపోయాక ఆరుగురు పోలీసులు అతడిని వెంబడించారు. అతడు కొంతదూరం పరిగెత్తి దొరికిపోయాడు. పోలీసులు అతడిని ఐదునిముషాల పాటు లాఠీలతో కుళ్ళబొడిచారు. సంకెళ్ళు వేసి రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చిన్నప్పుడు వారించబోయిన అతడి స్నేహితురాలిని కూడా జైల్లో పడేస్తామంటూ బెదిరించారు. అప్పటికే గాయాల బాధ తాళలేక తీవ్రంగా మూలుగుతున్న ఫ్రెడ్డీని పోలీసులు ఎత్తి వ్యానులో పడేశారు. నల్లవారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాడటానికి తెల్ల పోలీసులు ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాన్‌ అది. అందులో కొంత భాగం ఇనుపకంచెతో బోనులాగా ఉంటుంది. కూర్చోవడమూ, సేఫ్టీబెల్టు పెట్టుకోవడం వంటి మర్యాదలు అందులో దక్కవు. వ్యాను ప్రయాణిస్తున్నంత సేపూ ఆమూలనుంచి ఈ మూలకు దొర్లవలసిందే, ఎగిరెగిరిపడుతుండవలసిందే. వ్యాన్‌ని అత్యంత నిర్లక్ష్యంగా, సాధ్యమైనన్ని కుదుపులతో, కిందామీదా పడేస్తూ అమితవేగంగా గమ్యస్థానానికి చేర్చడం కూడా పోలీసులు అమలు చేసే ప్రాథమిక శిక్షలో భాగమే. చేతులు వెనక్కు విరగ్గట్టి సంకెళ్ళు వేసివున్న వ్యక్తి దారిలో ఎంతటి హింస ఎదుర్కొంటాడో ఊహించుకోవచ్చు. పదేళ్ళక్రితం పోలీసుల చేతులో ముందుగా లాఠీదెబ్బలు తినకుండా, కేవలం వ్యానులో ప్రయాణించిన కారణంగా జాన్సన్‌ అనే కుర్రాడి వెన్నెముక వక్కలైపోయింది. ఇప్పుడు, పోలీసు దెబ్బలకు తోడు ఎంతో పేరుప్రఖ్యాతులున్న ఈ ‘రఫ్‌రైడ్‌’ శిక్ష కూడా వెంటనే అమలు జరగడంతో ఫ్రెడ్డీ మెడ ఎముక మూడు ముక్కలైపోయింది. వేరువేరు చోట్ల వెన్నెముక చీలిపోయింది. వారం రోజులు కోమాలో ఉన్న అతడు మొన్న ఆదివారం మరణించాడు.
గత ఏడాది నవంబరులో ఫెర్గ్యుసన్‌ తగులబడిన తరువాత, బాల్టిమోర్‌లో ఇప్పుడు జరిగినంత విధ్వంసం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. తెల్లజాతి పోలీసులు ఆఫ్రికన్‌ అమెరికన్లను చంపేయడం కొత్తదేమీ కాకున్నా, ఫ్రెడ్డీతో పోలీసులు వ్యవహరించిన తీరు నల్లజాతి వారికి అత్యంత అమానవీయంగా, అవమానకరంగా తోచింది. ఇందుకు కారకులైన ఆరుగురు పోలీసులను సస్పెండు చేసినప్పటికీ, పోలీసు అధికారుల్లోనూ, బాల్టిమోర్‌ నాయకుల్లోనూ కించిత్తు బాధకానీ, జాలికానీ లేదనడానికి ఈ వ్యవహారం మొత్తంలో వారు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రదర్శకుల సంఖ్యకంటే అనేక రెట్లు పోలీసులను, సైనికులను మోహరించి వారిని పరోక్షంగా రెచ్చగొట్టడంతో పాటు, ప్రదర్శనకారులు కట్టుతప్పిన మరుక్షణం నుంచి వారిని దోపిడీదారులుగా, విద్రోహశక్తులుగా అభివర్ణించడంలో ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. వారిని నియంత్రించే పేరిట అమలు జరిగిన దుశ్చర్యలు ఎవరికీ పట్టలేదు. అమెరికన్‌ మీడియా కూడా జరిగిన ఘోరానికి ఒక పార్శాన్ని మాత్రమే ప్రపంచంముందు ఆవిష్కరించడానికి తీవ్ర కృషిచేసింది.
అమెరికన్‌ సమాజం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంతతికి చెందిన వ్యక్తిని అధ్యక్షపీఠం మీద కూర్చోబెట్టామంటూ ప్రపంచం ముందు గొప్పలు పోతున్న ఆ దేశం, నల్లజాతివారి ప్రాణాలకు ఎప్పటికీ హామీ ఇవ్వలేదు. ఒబామా రెండో పర్యాయం అధ్యక్షపదవీ కాలం కూడా ముగింపునకు వస్తున్నా, నల్లజాతివారు న్యాయం కావాలంటూ వీధినపడక తప్పడం లేదు. అమెరికాని ఏలుతున్న రెండు పక్షాల్లో ఏది అధికారంలో కూర్చున్నా, వీరి జీవితాల్లో ఇసుమంతైనా మార్పు రాదు. నల్లవారిని దొంగలుగా చూడడం, శాంతి విద్రోహశక్తులుగా భావించడంలో తేడా ఉండదు. ఆ సమాజంలో అంతర్లీనంగా ఉన్న జాత్యాహంకారం అంతంకాదు. నల్లవారికి న్యాయం చేసే వ్యవస్థలు రానంతకాలం, సమాజం నుంచి కాస్తంత ప్రేమ, సమానత్వం, కాసిన్ని హక్కులు, అవకాశాలూ దక్కాలన్న ఆకాంక్ష వారిలో చావనంతకాలం ఇలా నగరాలు తగలబడుతూనే ఉంటాయి.

No comments:

Post a Comment