Tuesday 14 July 2015

అభివృద్ధికి కుల గణన గొళ్లెం!

అభివృద్ధికి కుల గణన గొళ్లెం!
కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో బీసీ రిజర్వేషన్ల అమలును సవాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీసీల కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు 1993లో ఆదేశించింది. అయినప్పటికీ కుల గణన కార్యక్రమం అనేకసార్లు వాయిదాపడి చివరికి 2011లో ‘సామాజిక, ఆర్థిక కులగణన’ చేపట్టడం జరిగింది. వాటి వివరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పేదరికం వివరాలను గ్రామీణ, పట్టణ పేదరికం, వృత్తుల్లోని ఆర్థిక వ్యత్యాసాలు మాత్రమే శాతాల్లో ప్రకటించారు. కులాలవారీగా వివరాలను ప్రకటించలేదు. అసలు 2011 సాధారణ జనాభా లెక్కలు పూర్తి అయిన తరువాత అదనంగా ‘సామాజిక, ఆర్థిక కుల గణన’ ప్రత్యేకంగా చేపట్టిన జనాభా లెక్కలివి. అంత ప్రాధాన్యం గల సామాజిక వర్గాల, కులాల ముఖ్యంగా బీసీ కులాల వారీగా లెక్కలు తీసినప్పటికీ ప్రకటించకపోవడం ఆందోళనకరమైన విషయం.

ప్రపంచ ప్రఖ్యాత అర్ధ శాస్త్రవేత్త సి.కె. ప్రహ్లాద ‘ఫార్ట్యూన్‌ ఎట్‌ ది బాటమ్‌ ఆఫ్‌ పిరమిడ్‌’ అనే గ్రంథంలో విశ్లేషించిన ఒక ముఖ్యాంశం ఇక్కడ గుర్తు చేసుకోవడం అవసరం. ఆయన ఏమన్నారంటే ‘గత 200 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాగిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పారిశ్రామిక అభివృద్ధి, ఆధునిక విద్య మొదలైనవన్నీ ప్రపంచంలోని మూడింట ఒక వంతు జనాభా మాత్రమే ప్రయోజనం పొందుతున్నది. అనగా 600 కోట్ల ప్రపంచ జనాభాలో 200 కోట్ల జనాభా మాత్రమే దీనిని అనుభవిస్తున్నారు. ఈ ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి ప్రమాణాలు, మార్కెటింగ్‌ వ్యవస్థ సాంకేతిక విద్య, విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు ఇదే పద్ధతిలో సాగితే నిరంతరం మూడింట రెండు వంతులు ఇలాగే పేదరికంలోకి నెట్టి వేయబడి అందరికీ ఫలాలు అందవు. అందువలన వీటన్నింటిలో సమూలంగా మార్పుచేసుకోవడం అవసరం. మూడింట రెండు వంతుల జనాభా ఈ సాంకేతిక అభివృద్ధి, విజ్ఞానం, విద్య అందుకోవడానికి నూతనంగా మౌళికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనిషికి నైపుణ్యాలు కల్పించి ఉపాధి కల్పించడం ద్వారానే మిగతా మూడింట రెండు వంతుల జనాభా అభివృద్ధిలోకి రావడం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.
 
కులాలవారీగా తీసిన ఆ లెక్కలు ప్రకటించినప్పుడే రిజర్వేషన్‌లలో, బడ్జెట్‌లలో, ప్రణాళికలలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం సాధ్యమవుతుంది. అందుకోసమనే సుప్రీంకోర్టు బీసీ కులాల లెక్కలు తీయాలని ఆదేశించింది. తద్వారా కులాలవారీ లెక్కలను జిల్లాల వారీగా, రాషా్ట్రలవారీగా విడివిడిగా ప్రకటించాలి. వాటన్నిటినీ కలిపి జాతీయస్థాయిలో జనాభా శాతాన్ని నిర్ధారించాలి. అప్పుడే అన్ని రంగాలలో బీసీల జనాభా అనుసరించి అభివృద్ధి పథకాలు, విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగంలో రిజర్వేషన్‌లు ఏ మేరకు ఉండాలి అనే అంశంపై ఒక శాసీ్త్రయ ప్రాతిపదిక ఏర్పడుతుంది. అందువల్ల కులాలవారీ లెక్కలు వెంటనే ప్రకటించడం అవసరం. ఇప్పటికే ఈ వివరాలు ప్రకటించడానికి 4 ఏళ్ళు గడిచిపోయాయి. మన సమాజంలోని అన్నివర్గాల ప్రజలు వాస్తవ స్థితిగతులు శాసీ్త్రయంగా గణించడానికి ఎనిమిదన్నర దశాబ్దాల తర్వాత గానీ వీలు కాలేదు. ఆయ సామాజిక వర్గాలను పేదరికం నుంచి ఎదిగించడానికి ఇంత ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందోనని ప్రశ్నిస్తే మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల వద్ద సమాధానం మాత్రం దొరకదు. -చిచ్ఢినశి9ా)

కేంద్రంలో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం 1979లో నియమించిన మండల్‌ కమిషన్‌ 1980లో దేశంలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేల్చింది. 1993నాటికి ఇంద్ర సహానీ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం (ప్రసిద్ధ మండల్‌ కేసు) కేసు తీర్పులో కులాలు వారీగా జనాభా గణను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే 2011 నాటికి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణనను చేపట్టింది. అయితే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ గణాంక వివరాలను బయటపెట్టేందుకు సిద్ధపడటంలేదు. ఈ గణన వలన దేశంలోని ప్రజల వాస్తవ జీవన ప్రమాణాలను బహిర్గతం చేస్తుంది. అయితే అన్ని వివరాలు వెలవరించిన కేంద్ర ప్రభుత్వం కుల గణనను మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ నేపథ్యం కుల గణన కోసం ఎదురు చూస్తున్న బీసీ కులాలు ప్రభుత్వ చిత్తశద్ధిని శంకిస్తున్నాయి. తరతరాలుగా విద్యావంతులుగా, సంపన్నులుగా ఎదుగుతూ వస్తున్న వారి వారసులతో శతాబ్దాల తరబడి అణగారిపోయిన కులాల నుంచి వచ్చిన తొలి తరం, మలి తరం యువత ఎదగ డం అసాధ్యం. ఈ నేపథ్యంగానైనా రిజర్వేషన్‌లు అయినా కల్పించాలి. లేదా నైపుణ్యాలు అయినా పెంచే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి. అలాగే పేదరికం నుంచి నివృత్తి కలిగించి మధ్యతరగతి జీవన ప్రమాణాలకు ఎదిగే విధంగా బడ్జెట్‌లను కేటాయించడం అవసరం. సామాజిక న్యాయాన్ని సాధించాలని సుప్రీంకోర్టు కోరాల్సిన అవసరం ఉంది. ఇలా అనేక ప్రయోజనాల రీత్యా దేశ అభివృద్ధి రీత్యా కులాల వారీగా బీసీల జనాభా లెక్కలను త్వరగా ప్రకటించాలని రాజకీయపార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
 
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ క్రమంలో రిజర్వేషన్‌ల ప్రాధాన్యం తగ్గుతున్నది. ఉన్న ఉద్యోగాలనే ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు గత 20 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనాభా 5 కోట్ల నుంచి 8 కోట్లకు చేరుకున్నది. ఆ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థలలో వివిధ ఉద్యోగుల సంఖ్య పెరగాలి. కానీ ఒకప్పుడు ఉద్యోగాలు 14 లక్షలు ఉంటే, ప్రస్తుతం తెలంగాణ, ఆంఽధ్రప్రదేశ్‌ రాషా్ట్రలు కలిపి కూడా ఎనిమిది లక్షల ఉద్యోగాలయినా లేవు. అందువలన ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పన పెరగాల్సిన అవసరం ఉంది. జనాభా నిష్పత్తి అనుసరించి రిజర్వేషన్‌లు పెరిగితే మరికొన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రైవేట్‌ రంగంలో కూడా ఏదో ఒక స్థాయిలో డైవర్సిటీ - భిన్నత్వంలో - ఏకత్వం అనే సామాజిక దృష్టితో ఆయా సామాజిక వర్గాలకు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజర్వేషన్‌లు కల్పించడం అవసరం.
 
కులాలవారీగా లెక్కలు తీయకుండా గంపగుత్తగా శాంపిల్‌ నమూనాలతో పథకాలు అమల్లోకి తెస్తే కలిగే ప్రయోజనం తక్కువ. ఇప్పటివరకు జరుగుతున్న తంతు అలాంటిదే. కుటుంబాల వారీగా, కులాలవారీగా, జిల్లాల వారీగా, రాషా్ట్రల వారీగా, వెనుకబడిన తరగతుల వివరాలను నిర్దిష్టంగా లెక్కలు తీసి ప్రకటించడం అవసరం. అయితే ఈ 2011 సామాజిక ఆర్ధిక కులగణనలో ఈ విధంగా వివరాలు సేకరించినట్లయితే వివరాలు వెలువరించాలి. కులగణనలో కులం ‘గోప్యం’గా ఉంచడం వలన ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమీలేదు. కులాలవారీ గణన వెల్లడించినట్లయితే ఆ సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఉన్న గందరగోళాన్ని నివారించవచ్చు. దామాషా మేరకు శాతాన్ని మరింతగా పెంపు చేసుకునే వీలుకలుగుతుంది. ఆ వర్గాలకు మరింత ప్రయోజనాలు చేకూర్చే అవకాశం లభిస్తుంది.
 
సామాజిక వాస్తవ జీవన చిత్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, దగా పడుతున్న సామాజిక వర్గాల లె క్కలను కులాలవారీగా, సాంఘిక, ఆర్థిక కొలమానాల ప్రాతిపదికగా గణించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ప్రక్రియ పూర్తయి వివరాలు చేతిలో అందుబాటులో ఉన్నప్పటికీ వెల్లడించక పోవడం చాలా పొరపాటు. ఈ వివరాలు ప్రధానంగా కులాల వారీ గణన బీసీలకు బాగా లాభించే అంశం. ఈ వర్గాలను విద్య ఉద్యోగ, సాంఘిక రంగాలలో మరింతగా అభివృద్ధి పథంలోకి శాసీ్త్రయంగా ఎదిగించడానికి వీలు కలుగుతుంది. అం దువల్ల కులాలవారీగా తీసిన జనాభాలెక్కలను జిల్లాల వారీగా, రాషా్ట్రల వారీగా వివరించి జాతీయస్థాయిలో బీసీకులాల జనాభాను స్పష్టం చేయడం ఇప్పటికైనా, ఎప్పటికైనా అవసరం.
 
- డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
పూర్వ సభ్యులు - బీసీ కమిషన్‌