Wednesday, 22 April 2015

ఉజ్మా పుట్టింది... నాన్న శవమై తేలాడు

ఉజ్మా పుట్టింది... నాన్న శవమై తేలాడు

Sakshi | Updated: April 23, 2015 04:41 (IST)
ఉజ్మా పుట్టింది... నాన్న శవమై తేలాడు

తాడి  మోహన్ 

సందర్భం


హషీంపూర్ మారణకాండకు పాల్పడింది పోలీసులేనని తెలుస్తూనే ఉన్నా, సాక్ష్యాధారాలు లేక కోర్టు నిందితులను విడిచిపెట్టేసింది. నిష్కారణంగా బలైపోయిన ఆ 42 మంది భార్యాబిడ్డల ఇన్నేళ్ల దుఃఖానికి ద్రోహం తోడయింది.

ఆ రాత్రి ఉజ్మా పుట్టింది. ఆ రాత్రే ఖాకీలు ఉజ్మా నాన్నని ఇంట్లోంచి ఈడ్చుకెళ్లి ఓ ట్రక్కు లో కుక్కి  నది గట్టున కాల్చి చంపి, శవాన్ని నదిలోకి తోసే శారు. అదే రాత్రి మరో నలభై ఒక్క మందిని అలాగే కాల్చేసి నదిలోకి తోశారు. ఇప్పుడు ఉజ్మాకి ఇరవై ఎనిమిదేళ్లు. పేద తల్లి పిల్లల్ని పెంచడానికి పడే తంటాలను చూస్తూ.. ఆమె జ్ఞాపకాలకీ, రోదనకీ సాక్షిగా పెరిగింది. నాన్ననూ, అలాంటి మరో 41 మంది అమాయక నాన్నలనీ చంపిన 19 మంది పోలీసులపై సాగిన ఘోర విచారణ వెంట నడుస్తూవచ్చింది. స్వేచ్ఛా భారతంలో మూకుమ్మడిగా బందీలను కాల్చిచంపేసిన అతిపెద్ద కేసు తీర్పు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, మొన్న మార్చి 21న వచ్చిం ది. ఉత్తరప్రదేశ్ ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్ స్టెబ్యులరీ పోలీ సులే ఇంత మందినీ చంపేశారని తెలుస్తూనే ఉన్నా... సరైన సాక్ష్యాధారాలు లేక బతికున్న 16 మంది నిందితు లనూ కోర్టు విడిచిపెట్టేసింది. ఘోర హత్యాకాండకు బలైన ఆ 42 మంది భార్యాబిడ్డలు ఇంత కాలంగా భరిం చిన దుఃఖానికి నేడు ద్రోహం తోడయింది.

అది 1987. హిందువుల ప్రార్థనలకు వీలుగా అయోధ్యలోని బాబ్రీ మసీదు తాళాలను తెరవాలని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆదేశించింది. మీరట్ అల్లక ల్లోలమైంది. కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్లొచ్చాయి. మే 22 రాత్రి యాభై మంది ముస్లింలను యూపీ సాయు ధ పోలీసులు ఇళ్లల్లోంచి లాక్కెళ్లారు. అంతా కూలినాలి చేసుకునే వారు, నేత కార్మికులు, వలస వచ్చిన రోజు కూలీలే. వాళ్లందర్నీ ఘజియాబాద్‌లోని గంగా తీరాన చిమ్మచీకట్లో కాల్చి చంపేశారు. శవాలను నదిలోకి తోసే సిపోయారు. ఇక ఆపై నడిచిందంతా ఈ మారణకాం డను కప్పెట్టేసే కథే. ప్రజల ఒత్తిడితో 1988లో సీఐడీ విచారణకు ఆదేశించారు. తీరిగ్గా 1994 నాటికి వచ్చిన ఆ నివేదిక నేటికీ వెలుగు చూడలేదు! ఎట్టకేలకు 1996లో 19 మంది పోలీసులపై ఛార్జిషీట్ వేశారు. ఇందులో ఒక్క సీనియర్ అధికారీ లేడు. నిందితులపై బెయిలబుల్, నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయితే... వాళ్లు ‘కని పించుటలేదు’ ‘గల్లంతయ్యారు’ అన్నారు. చివరకు లొం గినా బెయిల్‌పై వచ్చి ఉద్యోగాల్లో చేరారు, ప్రమోషన్లూ పొందారు. వారిపై హత్యానేరం కింద విచారణ జరుగు తోందని వార్షిక రహస్య నివేదికల్లో ఒక్కముక్క రాయ కుండా రాజ్యం దగా చేసింది. హతుల కుటుంబాలు పదే పదే కేసును ఢిల్లీకి మార్చాలని కోరాయి. సుప్రీంకోర్టు 2002లో అందుకు ఒప్పుకుంది. రాష్ర్ట ప్రభుత్వం మరో నాలుగేళ్లకు గానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని నియ మించలేదు. ఆ తర్వాత అంటే హషీంపూర్ మారణకాం డ తర్వాత 19 ఏళ్లకు ఇది జరిగింది.

ఆ తర్వాత తొమ్మి దేళ్ల విచారణ సాగీ సాగీ, తీర్పువచ్చింది. నిందితులం దర్నీ వదిలిపెట్టేశారు. ఇదంతా ప్రముఖ జర్నలిస్టు, రచయిత హర్షమందర్ రాసింది. ఆయన ఇంకా ఇలా రాశాడు: ‘‘ఆ హత్యాకాండ నుంచి బతికి బయటపడ్డ వాళ్లూ, మరో 20 మంది హతుల బంధువులూ క్రమం తప్పకుండా కోర్టుకు రావడం చూసి నా గుండె చెమ ర్చింది. వాళ్లకి ఏ స్వచ్ఛందసంస్థ మద్దతూలేదు. కూలీల కుటుంబాలన్నీ డబ్బులు పోగు చేసుకుని ఇలా వస్తారు. చిన్నారి ఉజ్మా ఇలాగే ఢిల్లీ హైకోర్టు నీడనే ఎదిగి యువ తి అయింది... భారత ప్రజాస్వామ్యం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసంతో వాళ్లు కళ్లలో ఒత్తులేసుకుని 28 ఏళ్లు తిరిగారు. వాళ్లనెంత ఘోరంగా దగా చేశాం?’’

ఇది కీలవేన్మణిలో గుడిసెలకు తాళాలు పెట్టి దళి తుల్ని సజీవ దహనం చేయడం కంటే ఘోరమేం కాదు. గుజరాత్‌లో వేలమంది హత్యలూ, రేప్‌లూ, దహనాల కంటే మించిందేం కాదు. కంచికచర్ల, కారంచేడు, చుం డూరు, పదిరికుప్పం లాంటి ఎన్నో మూకుమ్మడి హత్య ల పక్కన ఇదీ మౌనంగా నిలుస్తుంది. అన్ని చోట్లా కోర్టు లిచ్చిన తీర్పులూ, జరిగిన న్యాయం దాదాపు ఒకే తీరు. కశ్మీర్‌లో సైన్యం చేసే ఎన్‌కౌంటర్లకు, ఈశాన్యంలో జరిగే రేప్‌లకు మనం బాగా అలవాటుపడ్డాం. చర్మం మొద్దు బారింది. ఇరాక్‌లో అమెరికా సైన్యం ఐదు లక్షల మం దిని చంపినా కదలం. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ వారు జనం తలలు నరుకుతూంటే సోషల్ మీడియాలో ఎగ బడి చూస్తున్నాం. హాలీవుడ్ సినిమా చూసినంత తృప్తి! యెమెన్‌లో, లిబియాలో, మాలీలో జరిగిన హత్యలూ విధ్వంసం-రోజూ చచ్చేవాళ్ల కోసం ఎక్కడేడుస్తాం?

మన  దృష్టి ఎప్పుడూ ‘‘తక్షణ కర్తవ్యాల’’ మీదే. అనుష్కా శర్మ అనే విలన్ లేకపోతే కోహ్లీ సెంచరీ కొట్టి ఉండేవాడా, కాడా? కరీనా కపూర్‌ని హోటల్‌కి తీసుకెళ్లిన మనోడు పక్క టేబుల్ వాడి ముక్కు బద్దలుగొట్టడమేం టి? ఇవీ జీవన్మరణ సమస్యలు. మన మోదీ వెయ్యి డాల ర్ల కోటేసుకుంటే ఒబామా డంగై పోయాడు. ఇక పెట్టుబ డులూ, ఉద్యోగాలూ ఖాయం. మనం చైనాని మించిపో తాం. సూపర్ పవర్ అయిపోతాం. ఇలాంటి పాజిటివ్ థింకింగ్, చక్కని ఆశావాదం ఎంత సుఖం! మన అంబా నీలు, అదానీలు లేదా అలాంటి పాతిక మంది సూపర్ రిచ్ ‘ఫార్చ్యూన్’ కవర్ టాపర్స్ అయ్యారంటే గుండె నిం డిపోవడంలేదూ? విదేశీ పెట్టుబడులూ, సెజ్‌లూ, వాల్ మార్ట్‌లతో దేశం కళకళ లాడుతుంటే కళ్లు నిండిపోవూ.

నెగెటివ్ థింకింగ్ గాళ్లూ, దేశభక్తి మాల్ న్యూట్రిష న్‌తో చచ్చేవాళ్లే హత్యలూ, రేప్‌లూ, పేదరికం అంటూ అరుస్తారు. అరవై ఏళ్లుగా అరిచి గోలపెడుతున్నారు. ఏమైందటా? అందుకే పేజ్ త్రీ, గూగుల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసుకుంటూ ఇండియన్ సూపర్ పవర్ డ్రీమ్స్‌లో తిరు గాడుతుంటే ఎగిరి పోతున్నట్టుండదూ?

(వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు) మొబైల్: 77028 41384

No comments:

Post a Comment