|
నిజాం నవాబుపై 1947 డిసెంబరులో హత్యాయత్నం జరిగింది. ముగ్గురు ఉద్యమకారులు నవాబు కారుపై బాంబులు విసిరారు. వీరికి బాంబులు సరఫరా చేసింది అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. పూనా నుంచి వాటిని పంపారు. బాపూజీ విగ్రహాన్ని టాంక్‌బండ్ మీద పెడతామంటున్నారు. సంతోషమే. మరి, అంతగొప్ప నవాబు గారిని చంపడానికి సహకరించిన బాపూజీ తప్పుచేశారని ఇప్పుడు అంటారా? లేక విగ్రహాన్ని పెట్టడం ఆపేస్తారా?
ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాలా గొప్పవ్యక్తని, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని, బ్రహ్మాండమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా దవాఖానా, హైకోర్టు వగైరాలు కట్టించాడనీ, ఇంకా ఏమేమో చేశాడని మన (తెలంగాణ) ముఖ్యమంత్రిగారు మాట్లాడారు. కాదు ఆకాశానికెత్తారు. పదహారు జిల్లాలున్న హైదరాబాద్ రాష్ట్రం (తెలంగాణ-8, మహారాష్ట్ర-4, కర్ణాటక-4). అంత పెద్ద రాష్ట్రంలో ఒక పెద్ద హైకోర్టు, రెండు ఆసుపత్రులు, ఒక యూనివర్సిటీ పెద్ద స్థాయిలో కట్టించడం గొప్పేనా? బ్రిటిష్‌వారు మాత్రం దేశాన్ని అభివృద్ధి చేయలేదా? అయినా వారిని పంపించేశాముగా!
ఈ మధ్య మహ్మద్ అన్వరుల్లా పారూఖీ వర్థంతి సందర్భంగా ‘నిజాం మా బాదుషా’ అంటూ గొప్పగా పొగుడుతూ, గోదావరిపై ఆనకట్ట కట్టించినందుకు ఆంధ్రావాళ్ళు అర్థర్ కాటన్‌ను పొగుడుచున్నప్పుడు తాను నవాబును మెచ్చుకోవడంలో తప్పేముందన్నారు. కాటన్ చేసిన గొప్పపనిని ప్రజలు మర్చిపోలేరు. ఆయనను నవాబుతో పోల్చడంలో విజ్ఞతలేదు. నిజాం పాలనలో అన్ని పాఠశాలలు ఉర్దూ మాధ్యమంలోనే ఉండేవి. ఉదయాన్నే చేసే ప్రార్థనలో నైజాం రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచాలని, నవాబు ఆరోగ్యంగా ఉండాలని పాడేవాళ్ళం. కాదు, పాడించేవారు (తాబరే ఖాలికె ఆలం ఏ రియాసత్ రఖే.....). ఇది ప్రార్థనలో మొదటివాక్యం. నేను పక్కా తెలంగాణ వాణ్ణి. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వస్తే, నిజాం ఆజాద్ హైదరాబాద్ ప్రకటించి సర్వ స్వతంత్ర రాష్ట్రంగా వ్యవహరించాడు. అప్పుడు అన్ని రాజకీయపార్టీలు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలెట్టాయి. ‘ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్’ విద్యార్థులందర్నీ క్విట్ స్కూల్స్ అని పిలుపునిచ్చింది. సీహెచ్. రాజేశ్వరరావుగారు (మాజీ ఎమ్మెల్యే) ఆ సంఘానికి జనరల్ సెక్రటరీ అప్పుడు. ఆ రోజునుంచి హైదరాబాద్ స్టేట్ మొత్తంలో స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. నేను అప్పుడు ఖమ్మం జిల్లా (1953వరకు వరంగల్ జిల్లా) మధిర తాలూకా విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఉద్యమంలో ప్రముఖపాత్ర నిర్వహించాను. రెండు మూడు రోజులు జైల్లో పెట్టారు. అప్పుడక్కడున్న సబ్-ఇనస్పెక్టర్ (అమీన్ సాబ్) హిందువు. ఎందుకో మరి, ఈ కుర్రాణ్ణి వదిలేయమన్నాడు. అలా బయటపడ్డాను. బలవంతంగా అందర్నీ ఉర్దూ మీడియంలోనే చదివించారు. నేను బీఏ వరకూ ఉర్దూ మీడియంలోనే చదివాను. ఇంగ్లిష్‌లో ఉన్న స్టాండర్డ్ బుక్స్ అన్నీ ఉర్దూలోకి ట్రాన్స్‌లేట్ చేయించారనుకోండి. లెక్చరర్లు ఎక్కువమంది ముస్లిములే. వేరే రాష్ట్రాల నుండి ఇంగ్లిష్ బోధనకు మంచివారిని తెచ్చారు.
ఆనాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవో ఇప్పటికి బ్రతికివున్న వారికి తెలుసు. నైజాం పోలీసులు, రజాకార్లు గ్రామాలపై దాడులు చేసేవారు. లాఠీలతో కొట్టేవారు. అత్యాచారాలు చేసేవారు. ఎదిరించినవారిని చంపేవారు. మధిరదగ్గరలో ఉన్న గ్రామాలనూ కాలబెట్టారు. అల్లీనగరం అనే గ్రామంలోని పెద్దమేడ కాలకపోతే పెట్రోలు పోసి కాల్చడానికి ప్రయ త్నం చేసినా పూర్తిగా కాలలేదు. ఆ మేడ ఈ మధ్యవరకూ అలాగే శిథిలావస్థలో నిలబడివుండేది. 1947 ఆగస్టు తరు వాత నవాబు ప్రభుత్వం నామమాత్రమే. ఖాసింరజ్వీ నాయకత్వాన రజాకార్లు స్వైరవిహారం చేసారు. రజ్వీ చెప్పినట్టు వినవలసిందే. అంతే! పోలీస్‌యాక్షన్ మొదలవగానే రజ్వీ పాకిస్థాన్ పారిపోయాడు. చాకలి ఐలమ్మ గొప్పతనం గూర్చి ఈ మధ్య కొందరు టీఆర్‌ఎస్ నాయకులు చెప్పుచున్నారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించినందుకు ఆమెను నడిరోడ్డుపై నరికారు. ఎవరు? నైజాం పోలీసులు. ఈమె విగ్రహాన్ని టాంక్‌బండ్‌పై పెట్టాలంటున్నారు టీఆర్‌ఎస్ నాయకులు. చాలా సంతోషం. అభినందనీయం. నవాబుగారు తనను, తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు ముస్లిములైనా నిర్దాక్షిణ్యంగా నరికించేవాడు. నల్లగొండ జిల్లాలో బందగీ అనే ముస్లింను నడిరోడ్డుపై పట్టపగలు నరికారు రజాకార్లు. ఎందుకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరేగింపులో పాల్గొన్నందుకు. ముస్లిం అయి, ప్రభుత్వాన్ని ఎది రిస్తావా అని. ఇమ్రోజ్ అనే ఉర్దూ పత్రికను షోయబుల్లాఖాన్ అనే జాతీయభావాలున్న ముస్లిం నడిపేవాడు. ఉద్యమాలకు అనుకూలంగా, నవాబుకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేస్తూ రాసేవాడు. ఒకనాటి రాత్రి తన పత్రిక కార్యాలయం నుండి ఇంటికొస్తుండగా రజాకార్లు అడ్డుకున్నారు. రెండు చేతులు నరికారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. పోలీస్‌యాక్షన్ తరువాత కాచిగూడ ఏరియాలో ఒక బజారు పేరు షోయబు ల్లా మార్గ్ అనిపెట్టారు. ఇప్పుడూ ఆ బోర్డు మనంచూడవచ్చు.
నవాబుపై 1947 డిసెంబరులో హత్యాయత్నం జరిగింది. ముగ్గురు ఉద్యమకారులు నవాబు కారుపై మూడు బాంబులు ఒకటి తరువాత ఒకటి, మూడు ప్రదేశాల్లో విసిరారు. దురదృష్టవశాత్తూ నవాబుకారుకు అవి తగలలేదు. బతికి బయటపడ్డాడు. ఆ ముగ్గురు- నారాయణ పవార్, శ్రీ ఆర్య, మూడోవారి పేరు గుర్తులేదు. వీరిని అరెస్టు చేసి, ఉరిశిక్ష తీర్పు ఇచ్చారు కానీ, ఇది అమలయ్యేలోపే పోలీస్‌యాక్షన్ జరగడంతో వీరంతా విడుదలయ్యారు. వీరికి బాంబులు సరఫరా చేసింది అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీగారు. పూనానుంచి వాటిని పంపారు. బాపూజీ విగ్రహాన్ని టాంక్‌బండ్‌మీద పెడతామంటున్నారు. సంతోషమే. మరి, అంతగొప్ప నవాబుగారిని చంపడానికి సహకరించిన బాపూజీ తప్పుచేశారని అంటారా? లేక విగ్రహాన్ని పెట్టడం ఆపేస్తారేమో చూడాలి.
పటేల్ చొరవతో, జె.ఎన్.చౌదరి నాయకత్వంలో కేంద్రసైనికులు నలువైపులా దండెత్తితే, రజ్వీ పాకిస్థాన్ పారిపోయాడు. నైజాం మూడు నాలుగురోజుల్లోనే 1948 సెప్టెంబరు 17న చేతులెత్తేశారు. నైజాం రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిన రోజు అదే. రాష్ట్రం నిరంకుశం నుండి విమోచనమయింది గదా! అలాగే అన్నారు అందరూ, అన్ని పార్టీలవారూనూ. ముఖ్యంగా సీపీఐ వారు విమోచన దినోత్సవం రెగ్యులర్‌గా అదేరోజున జరిపేవారు. కాని, ఈ మధ్యన ట్రెండ్ మారింది. 17 సెప్టెంబర్‌ను ‘విలీనం’ అంటున్నారు, కమ్యూనిస్టులు కూడ! ముస్లింలను దువ్వాలని, వారి ఓట్లు రాబట్టాలని తాపత్రయం తప్ప వేరే ఏమీ లేదు. నవాబు ఒక దుర్మార్గుడు, పేదలకు శత్రువు. ముస్లిములంతా నవాబే గొప్పవాడంటారా? నవాబు హయాంలో ముస్లింలు ఎందరు సుఖపడ్డారు? కేవలం ఓట్లకోసం వారిని దువ్వినా, ఓల్డ్‌సిటీలో ఏ పార్టీ అయినా లాభపడుతున్నదా? ఒవైసీ సోదరులు తమ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి కులాన్ని వాడుకుంటున్నారంతే. 1947లో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు గార్లు రాసిన ‘మా భూమి’ నాటకం ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెచ్చింది. నైజాం దుష్పరిపాలనను ఎండగట్టింది. అందులోని పాట ‘బండెనక బండి కట్టి... నాజీల మించినోడా... గోలకొండ ఖిల్లాలో గోరికడతం కొడుకో’ అంటూ ఎంత ఉద్రేకపరిచిందో, అంత పాపులర్ అయింది. కేసీఆర్ గారు అప్పుడు పుట్టలేదు లెండి.
ఇదంతా ఇలా రాసినందుకు వీడెవడో సమైక్యవాదనుకుంటారేమో! అందుకే నా గురించి కూడా రాస్తున్నాను. 1962 నుండి స్టేట్ టీచర్స్ యూనియన్ (కేవలం తెలంగాణకే పరిమితం ఈ సంఘం 1985 వరకు)లో నాయకుడిగా పనిచేశాను. ఖమ్మంజిల్లా అధ్యక్ష పదవి నుండి రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా 1984 వరకు ముఖ్యపాత్ర వహించాను. కీ.శే. జయశంకర్ గారితో కలిసి పనిచేశాను. మాజీ అధ్యక్షులతో కలిసి తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గురించి శ్రీకృష్ణ కమిటీకి మెమోరాండం ఇచ్చినవారిలో నేనూ ముఖ్యుణ్ణి. కేసీఆర్‌గారు దశాబ్దంపైన శాంతియుతంగా ఉద్యమం నడిపారు. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. తాజ్‌మహల్‌ను షాజహాను కట్టించాడు. ప్రపంచవింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకు ఆ నవాబు ఎంతో గొప్పవాడని పొగిడితే ఎబ్బెట్టుగా ఉండదూ! ఇదీ అంతే. విమర్శ కొరకు నేనిది రాయలేదు. ఆయన నాయకత్వంలో నిజమైన బంగారు తెలంగాణ నిర్మాణం కావాలని కోరుకుంటూ....
దుగ్గినేని సత్యనారాయణరావు
రాష్ట్రపతి అవార్డు గ్రహీత
|
No comments:
Post a Comment