Saturday, 18 April 2015

ఉమ్మడి పౌరస్మృతిపై అభ్యంతరమేల? - రామచంద్ర గుహ

ఉమ్మడి పౌరస్మృతిపై అభ్యంతరమేల? - రామచంద్ర గుహ
మూడు దశాబ్దాల క్రితం షాబానో కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సుప్రసిద్ధ తీర్పును వెలువరించింది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు; ఆమెకు మనోవర్తి చెల్లించడం కూడా మానివేశాడు. అయితే ఆ ధీర మహిళ షాబానో, భర్త తనకు చేసిన అన్యాయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించింది. భర్త తనకు భరణం చెల్లించాలని ఆమె కోరింది. అంతిమంగా 1985 ఏప్రిల్‌23న భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం ఆమె అభ్యర్థన న్యాయసమ్మతమేనని తీర్పు వెలువరించింది. అంతకు ముందు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పు కూడా న్యాయసమ్మతమైనదేనని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. షాబానో అవసరాల మేరకు ఆమెకు భర్త మనోవర్తి ఇవ్వాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు అదేతీర్పులో ‘దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని రాజ్యాంగంలోని అధి కరణ 44 నిర్దేశించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయనడానికి ఎటువంటి దాఖ లాలు కన్పించడం లేదని’ కూడా వ్యాఖ్యానించింది. భిన్న భావజాలాల ప్రాతిపదికన ఉన్న వ్యక్తిపర శాసనాల స్థానంలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం దేశ సమగ్రత, సమైక్యతకు దోహదం జరుగుతుందనే విశ్వాసాన్ని దేశసర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసింది. అదే తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొన్నట్లుగా అధికరణ 44 ‘ప్రజలూ, ప్రభుత్వమూ ఆసక్తి చూపని రాజ్యాంగ ఆదర్శం’గా ఎందుకు మిగిలిపోయింది? డాక్టర్‌ అంబేద్కర్‌ తదితర రాజ్యాంగ నిర్మాతలు దేశం తప్పకుండా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించుకోగలదని ఆశించారు. సువిశాల భారతదేశం ఒకే శాసనాన్ని అనుసరించడం సాధ్యమా అని ప్రశ్నించగా ఇప్పటికే దేశప్రజలందరికీ వర్తించే ఉమ్మడి శిక్షా స్మృతి ఉంది కదా అని ఆయన పేర్కొన్నారు. మతచట్టాలను సంస్కరించకుండా వదిలివేస్తే సామాజిక వ్యవహారాల్లో మనం పురోగతిని, సామరస్యాన్ని సాధించలేమనికూడా ఆయన స్పష్టం చేశారు.
షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉమ్మడి పౌర స్మృతిపై చర్చను పునః ప్రారంభించిందనడంలో సందే హం లేదు. ఆ తీర్పు వెలువడిన కాలంలో ఆధునిక భావాలు గల రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీ కాంగ్రెస్‌కు లోక్‌సభలో దాదాపు ఐదువందల మంది సభ్యులు ఉన్నారు. మరి భారతీయ పౌరులందరికీ వర్తించేలా ప్రగతి శీల ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికి సుప్రీంకోర్టు సమకూర్చిన అవకాశాన్ని ఆయన ఎందుకు ఉపయోగించుకోలేదు? నిజానికి రాజీవ్‌ గాంధీ తొలుత షాబానో తీర్పుకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధులైన ముస్లిం ఎంపీలు పార్లమెంటులో ఆ తీర్పుపై ధ్వజమెత్తారు. అయితే రాజీవ్‌ మంత్రి మండలి సభ్యుడైన అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వారి విమర్శలను స్ఫూర్తిదాయకంగా తిప్పికొట్టారు. అయితే అరిఫ్‌ వాదనలను రాజీవ్‌ సమర్థించలేదు. అరిఫ్‌ను సమర్థిస్తే కాంగ్రెస్‌ ‘ముస్లిం ఓట్ల’ను కోల్పోతుందని ఆయన భయపడ్డారు.
ఇది జరిగిన ముప్పై ఏళ్ళ తరువాత కూడా అధికరణ 44 ఉపేక్షిత రాజ్యాంగ ఆదర్శంగానే ఉన్నది. అప్పుడప్పుడూ ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని చర్చకు పెట్టే ప్రయత్నాలు జరగక పోలేదు. కాగా అటువంటి సందర్భాలలో హిందూ మత చట్టాలలో సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతికి అనుకూలంగా ఉన్నది. ఇలా వుండగా నెహ్రూ వారసత్వాన్ని నిలబెట్టడానికి నిబద్ధమై వున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకు వచ్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది!
ఈ రోజుల్లో కాంగ్రెస్‌ నుంచి ఇంతకంటే మెరుగైన నిర్ణయాలను ఎలా ఆశించగలం? అయితే నిజంగా కలవరపెడుతున్న వాస్తవం ఏమిటంటే చాలా మంది ప్రముఖ ఉదారవాదులు, సీ్త్రవాదులు ఉమ్మడి పౌర స్మతికి అనుకూలంగా మాట్లాడడానికి, వాదించడానికి వెనుకాడుతున్నారు! ఇది ఎంతైనా విచారకరమైన విషయం అనడంలో సందేహం లేదు. చట్టం ముందు సమానత్వం అనేది మౌలిక ఉదార వాద ధర్మసూత్రం కాదూ? మహిళల పట్ల వివక్షచూపుతున్న చట్టాలను, మరీ ముఖ్యంగా మతాలు నిర్దేశిస్తున్న నియమ నిబంధనలతో కూడిన చట్టాలను రూపుమాపడం అనేది సీ్త్రవాద మౌలిక లక్ష్యాలలో అత్యంత ప్రధానమైనది కాదూ? ఉమ్మడి పౌర స్మృతికి బీజేపీ అనుకూలంగా ఉన్న కారణంగా జెండర్‌ సమానత్వానికి తోడ్పడే, దేశ ప్రజలందరికీ వర్తించే ఆ ఉమ్మడి చట్టాన్ని వ్యతిరేకించడం సబబేనా? షాబానో కేసు వివాదమనంతరం ప్రముఖ పండితురాలు, సామాజిక కార్యకర్త వసుధా ధగమ్వార్‌ ‘టువర్డ్స్‌ ది యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌’ అనే ఒక చిన్న పుస్తకాన్ని వెలువరించారు (ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించింది) ఉదారవాదులు, సీ్త్రవాదులే కాక జెండర్‌ సమానత్వంపట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న పుస్తకాన్ని చదవాలి. ఉమ్మడి పౌర స్మృతి విషయమై వివిధ వాదోప వాదాలను చాలా నిష్పాక్షికంగా చర్చించిన పుస్తకమది. దేశ పౌరులందరికీ ఒకే పౌర స్మృతి ఉండాలని చాలా సుసంగతంగా వసుధా ధగమ్వార్‌ ఆ పుస్తకంలో వాదించారు.
దేశప్రజలందరికీ ఒకేవిధమైన చట్టాలు ఉండాలనే ఆకాంక్ష, ఉమ్మడి పౌరస్మృతి ఉద్యమానికి పాక్షికంగా కారణమయిందని చెప్పవచ్చు. ఉమ్మడి చట్టంతో మాత్రమే జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని పలువురు విశ్వసిస్తున్నారు. కాగా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడంలో కాంగ్రెస్‌పాలకుల వైఫల్యానికి కారణం ‘మైనారిటీలను బుజ్జగించే ధోరణే’ అని హిందూత్వ వాదులు ఆరోపిస్తున్నారు. హిందూ మితవాదులు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ముస్లింలకు అధిక ప్రాధాన్యమిచ్చి వుంటే మరి ఆ మతస్థులలో అత్యధికులు ఇప్పటికీ కటిక పేదరికంలో ఎందుకు కునారిల్లుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ‘ముస్లిం మతస్థులను బుజ్జగిస్తున్నవారు ప్రభుత్వ నాయకులు కాదని, స్వప్రయోజనాలకు ప్రాఽధాన్యమిస్తున్న ఆ మతనాయకులేనని’ వసుధ పేర్కొన్న వాస్తవంలో పై ప్రశ్నకు సమాధానముందని చెప్పవచ్చు. ఉమ్మడి పౌర స్మృతి అంటే ‘హిందూ చట్టాలను’ మైనారిటీ మతస్థులపై రుద్దడమేనన్న వాదనతో సీ్త్రవాదులు కొంతమంది ఉమ్మడిచట్ట ఆవశ్యకతను నిరాకరిస్తున్నారు. ఇది సమంజసమైన వాదన కాదు. 1950వ దశకంలో హిందూ మత చట్టాల్లో చేసిన సంస్కరణలను హిందూవేతరులకు కూడా వర్తింపచేయాలని ఎవరూ అడగడంలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ సంస్కరణలు సమగ్రమైనవి కావు. అవి అమల్లోకి వచ్చి ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. ప్రస్తుత సమాజ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయకోవిదులు మౌలిక ధర్మసూత్రాల ప్రాతిపదికన ఒక ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించవలసిన అవసరమున్నది.
బీజేపీ మద్దతునిస్తున్న కారణంగా చాలా మంది ఉదారవాదులు ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తున్నారు. ఇది దురదృష్టకరమైన విషయం. వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన సామాజిక ఆచారాలను క్రమబద్ధీకరించాలనేది సూత్రబద్ధ ఉదారవాద వైఖరి. ఇప్పుడు ఆ ఆచారాలను జెండర్‌ సమానత్వం దృష్టికోణంతో క్రమబద్ధీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
- రామచంద్ర గుహ

No comments:

Post a Comment