Monday, 20 April 2015

రాజకీయ అంటరానితనానికి అంబేద్కర్‌ బాధితుడు!

రాజకీయ అంటరానితనానికి అంబేద్కర్‌ బాధితుడు!

- ఆయన పేరిట కేంద్రం ఏర్పాటుకు..20 ఏళ్లా?
- నేను 20 నెలల్లో పూర్తి చేస్తాను : మోదీ
-అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రానికి ఢిల్లీలో ప్రధానమంత్రి శంకుస్థాపన
- అంబేద్కర్‌ లేకుండా మోదీ లేడని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 : ‘‘బీఆర్‌ అంబేద్కర్‌ రాజకీయ అంటరానితనానికి బాధితునిగా మారా’’రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంబేద్కర్‌ అంటూ లేకపోతే నరేంద్రమోదీ అనే వ్యక్తి ఎక్కడ ఉండేవాడని..వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుకు సోమవారమిక్కడ ఆయన శంకుస్థాపన చేశారు. జీవితకాలం పాటు అంబేద్కర్‌ సామాజిక అంటరానితనానికి గురి అయ్యారని, మరణానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆయన పట్ల రాజకీయ అంటరానితనాన్ని ప్రదర్శించాయని, ఆయన పేరిట తలపెట్టిన అంతర్జాతీయ కేంద్రం ఇరవై ఏళ్లయినా పూర్తి కాకపోవడమే దీనికి నిదర్శనమని మోదీ విమర్శించారు. ‘‘ఇది 1992 ల నాటి మాట. అంబేద్కర్‌ పేరిట అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులు అనుకొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తమ అభ్యర్థనను తెలిపారు. దానికి సంబంధించిన ఫైలు అప్పటినుంచీ పైకీ కిందకీ తిరుగుతూనే ఉంది. ఇప్పటికి 20 ఏళ్లు గడిచిపోయాయి. రాజ్యాంగ నిర్మాతకు ఇలాంటి పరిస్థితా? ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇంత జాప్యం జరిగిందని తెలుసుకొని ఎంతో వ్యాకులపడ్డాను. 20 ఏళ్ల కాలం ఎలాగూ దుబారా అయిపోయింది. కాబట్టి, 20 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని సంకల్పించాను’’ అని వివరించారు.అంబేద్కర్‌ రచనలు చదవని వారంతా ఆయన జీవితంపై వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ.. పరోక్షంగా జనతా పరివార్‌పై విరుచుకొన్నారు. అణగారిన, వెనుకబడిన వర్గాల ఉద్ధారకుడిగానే అంబేద్కర్‌ను పరిగణించడం ఆయనను అగౌరవపరచడమేనన్నారు. భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా..సకల జనుల కల్యాణం కోసం అంబేద్కర్‌ పాటుపడ్డారని తెలిపారు. అత్యంత గౌరవప్రద సామాజిక నేపథ్యం నుంచి ఎదిగి వచ్చి..రాజ్యాంగ నిర్మాణంలో కీలక భూమిక పోషించారని.. కొనియాడారు.
విపక్షాలకు మోదీ థ్యాంక్స్‌
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల మొదటి దశలో గతానికి భిన్నంగా అత్యద్భుత ఫలితాలు వచ్చాయని, చాలా ఏళ్ల తర్వాత సమావేశాలు ఫలవంతంగా సాగాయని, ఇందుకు అన్ని పార్టీల సహకారమే కారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. పార్లమెంటులోని అన్ని పార్టీలకూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు రెండో విడత సమావేశాల్లో కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment