ఖండనలు సరిపోవు, అవార్డులు తిరిగిచ్చేయండి! Updated :16-10-2015 00:45:51 |
‘‘సున్నితమైన స్నేహితురాలు, నిశితమైన న్యాయమూర్తి, జీవితం కన్నా ఒక మెట్టు పైనుండి మానవాళికి దారిచూపించేది సాహిత్యం’’ గోర్కీ అన్న ఈ మాటలు పుస్తకాన్ని ప్రేమించే వారందరూ విశ్వసిస్తారు. సమాజ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది సాహిత్యం. అటువంటి సాహిత్య హృదయాన్ని కర్కశంగా నలిపి వేసే ఫాసిజం చరిత్రలో మళ్ళీ మన నేలమిదే పడగవిప్పుతోంది. ప్రజలు నిర్మించిన చరిత్రను రద్దు చేసి, శాసీ్త్రయ భావాల గొంతు నులిమి, అన్య మతాల పట్ల, భిన్నాభిప్రాయాల పట్ల విపరీతమైన అసహనాన్ని, ద్వేషాన్ని రెచ్చగొడుతున్న శక్తులకు ప్రభుత్వం దన్నుగా ఉంది. చరిత్ర, పరిశోధనను అధికారికంగా, అనధికారికంగా ఆరెస్సెస్ నిర్దేశిస్తోంది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం మన వంట గదుల్లోకీ, తినే కంచాల్లోకీ ఉరిమి చూస్తోంది. మనం ప్రేమించే గజల్‌ను గాయపరిచి, పుస్తకాలను తగులబెట్టి, కళా సాంస్కృతిక కేంద్రాల్లో కాలుమీద కాలేసుకొని కూర్చుంది.
సున్నితమైనవన్నీ ధ్వంసమవుతున్నాయి. ‘పెరుమాళ్ మురుగన్ రచయితగా చచ్చిపోయాడు’, అని ఆయనే ప్రకటించిన ఏడాది లోపలే కలబుర్గిని అచ్చంగా హత్య చేశారు. ‘ఎవరీ కలబుర్గి? రెండు లీటర్ల పెట్రోలు చాలు అతన్ని ఫినిష్ చేయడానికి..’ -కన్నడ సాంస్కృతిక చరిత్ర మీద ఎన్నో పరిశోధనలు చేసి, ఎనభై పుస్తకాలు రాసిన డెభ్భై ఏళ్ల మేధావి గురించి మతోన్మాదులు ఇటువంటి మాటలంటూ బహిరంగంగా తిరిగారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన విద్యావంతుడిని, సాహిత్య అకాడెమి గుర్తింపు పొందిన ప్రఖ్యాత రచయితను కాల్చి చంపితే ప్రభుత్వం నిష్పూచీగా ఉండగలుగుతోంది. వరుసగా అటువంటి ఆలోచనాపరులను ముగ్గురిని కాల్చి వేసి సామాజిక మాధ్యమాల్లో మేధావులకు హెచ్చరికలు జారీ చేసినా డిజిటల్ తెరల మీద నవ్వులు విరజిమ్ముతూ ఎన్నికలకు ముస్తాబు కాగలదు. గొడ్డు కోసం మనిషిని చంపే ఉన్మాదాన్ని నిరసిస్తే ఆసెంబ్లీలో ఎమ్మెల్యేను కూడా చితక్కొట్టగలదు. తన శిబిరంలో ఉండే ఉదారవాదాన్ని కూడా సహించలేని ఫాసిజం తన భావాల మసిని ఎదుటివారి ముఖాల మీద పులిమి వీరంగమాడుతున్నది. సకల రంగాల్లో ఫాసిజం ఎంతగా అల్లుకుపోతోందంటే ఒక సంఘటనపై స్పందించేలోగా అటువంటి పది సంఘటనలు మీడియాలో వార్తల వుతున్నాయి. వార్తలు కానివి అసంఖ్యాకంగా ఉంటున్నాయి.
చరిత్ర డిమాండ్ చేసినప్పుడల్లా రచయితలు, కళాకారులు పీడితుల పక్షాన దుర్మార్గాన్ని, అధికారాన్ని నిరసిస్తున్నట్టుగానే ఇవాళ దేశవ్యాప్తంగా సాహిత్య సాంస్కృతిక రంగాల నుండి ధిక్కార స్వరం వినిపిస్తున్నది. దీనిని మేం ఆహ్వానిస్తున్నాం. ముప్పై మంది దాకా రచయితలు కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డులు తిరిగిచ్చేశారు. పద్మ అవార్డులు తిరిగిచ్చేస్తున్నారు. సచ్చిదానందన్ వంటివారు అకాడెమి పదవుల నుండి వైదొలగుతున్నారు. తెలుగు రచయితల నుండి అటువంటి ధిక్కార స్వరం ఇప్పటికే వినపడి ఉండాల్సింది. కాగితం మిద ఖండనలు కాదు. కాగితాలు, అక్షరాలు దగ్ధమవుతున్నప్పుడు సాహిత్య వ్యక్తిత్వం చేసే ఆగ్రహ ప్రకటన కనీసం వ్యవస్థపై, అధికారంపై నైతిక ప్రశ్న కావాలి. వర్గపోరాట సందర్భం అవార్డుల గురించి చాలా చర్చ చేసింది. ఇప్పుడు మేమది చేయబోవడం లేదు. ఇటువంటి సందర్భాలలో ఏదో ఒక రూపంలో సాహిత్యలోకం తప్పనిసరిగా ప్రశ్నని ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాం. స్పష్టంగా చెప్పాలంటే తెలుగు రచయితలు తమ అవార్డులు వదులుకొని దేశవ్యాప్త సాహిత్య సమాజ నిరసనలో భాగం కావాలి.
రచయితలు చచ్చిపోతున్నప్పుడు, సృజనను వెంటాడుతున్నపుడు అవి ఇచ్చిన గుర్తింపులు, సత్కారాల ప్రతీకలు మారి వ్యంగ్యార్థాలు పలుకుతున్నట్టుగా సృజనకారులకు కలగడం ఎంత సహజం! (కలగక పోవడం ఎంత అసహజం.) సాహిత్యంలో ఉన్నతమైన భావచిత్రం అదే కదా! ఫాసిజంపై దేశవ్యాప్త స్పందన ఈ రూపమే తీసుకుంది. సరిగ్గా జలియన్ వాలాబాగ్ దారుణం జరిగిన సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ బిరుదును తిరిగిచ్చేస్తూ ‘అవమానాల పక్కన గౌరవ చిహ్నాల మెరుపులు సిగ్గుపడేలా చేస్తున్నాయి’ అన్నట్లు. ఆనాటి సందర్భం ఇప్పటి భీభత్సానికి మరీ చిన్నదిగా కనిపిస్తుంది. ‘ప్రభుత్వ శారీరక బలం ముందు నేనేం చేయగలను? నా దేశంలోని మిలియన్ల గొంతులకు కనీసం ఒక స్వరాన్ని ఇవ్వగలను’, అని ఠాగూర్ ప్రకటించాడు. అవార్డులు తిరిగిచ్చేయడం వల్ల ఒరిగేదేమిటి అని అమాయకంగా (?) వాదించేవారు ఉన్నారు.
సాహిత్య అకాడెమి యూనివర్శిటీల వలె స్వయం ప్రతిపత్తి కలిగినదని, ప్రభుత్వంపై నిరసన అకాడెమిపై ప్రద ర్శించడం వ్యర్థమని కూడా వారు చర్చిస్తారు. ఈ సాంకేతిక అంశాలు అలా ఉంచితే, సాహిత్య అకాడెమి వైపు నుండి కూడా, అది రచయితలకు సత్కారాలు తప్ప సంక్షోభ సందర్భంలో మద్దతుగా నిలిచింది లేదం టూ అవార్డులు తిరస్కరి స్తున్న వారి అధిక్షేపణ స్పష్టంగా వ్యక్తమైంది.
ఇక్కడ ప్రశ్న సాంకే తికమైనది కాదు. నైతిక మైనది. సాహిత్య హృదయ గతమైనది. సాహిత్యకారు లకు ఈ ప్రశ్న ఎవరో కాదు, చారిత్రక సందర్భం వేస్తోం ది. రచయితలు తమ సామాజిక బాధ్యతను ఏ విధంగా గుర్తిస్తారు అని.
(తాజా : ఎట్టకేలకు అవార్డుల తిరస్కరణ అనే నిరసన రూపాన్ని స్వయంగా సాంస్కృతిక మంత్రి వెటకారం చేసి అయినా స్పందించాడు. దేశవ్యాప్త చర్చకు దారితీసిన ఈ ధిక్కారం మంత్రి గారికి ఆ మాత్రం అసహనం కలిగిం చిందంటే మన స్వరం ఇంకింత, ఇంకెంతో పెంచాల్సిన అవసరముంది.)
- విప్లవ రచయితల సంఘం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని,
తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని
వెనక్కి ఇస్తున్నాను
ఈ క్రమంలోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని, తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నాను. పాలకవర్గ మతతత్వ, హత్యా రాజకీయాలకు, అగ్రకులతత్వ భావజాలానికి కొమ్ముకాసే ఇలాంటి భూస్వామ్య మర్యాదలు, గౌరవాలకు చైతన్యయుత తెలుగు సమాజం దూరంగా ఉండాలని కోరుతున్నాను. ఈ దేశంలో ప్రత్యా మ్నాయ ప్రజాస్వామిక మానవీయ సంస్కృతి, విలువలను నిర్మించే శక్తి ఒక్క విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికే ఉంది. కాబట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని రచయితలు తమకు లభించిన కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డులను, ప్రభుత్వ పురస్కారాలను వెనక్కి ఇచ్చేసి.. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
- భూపాల్
|
No comments:
Post a Comment