Monday, 19 October 2015

‘అప్పుడెందుకు మౌనం వహించారు? ’

‘అప్పుడెందుకు మౌనం వహించారు? ’
Updated :19-10-2015 00:48:29
  • ప్రజలను తప్పుదారి పట్టించేందుకే మీ నిరసనలు
  • రచయితలపై కేంద్ర మంత్రి వెంకయ్య ఆగ్రహం 
హన్మకొండ, అక్టోబర్‌ 18(ఆంధ్రజ్యోతి): దాదరీ, కల్బుర్గీ ఘటనలకు నిరసనగా సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న రచయితలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రచయితలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ‘నాడు ఎమెర్జెన్సీ సమయంలోను, ఆ తర్వాత జరిగిన వివిధ సంఘటనల కాలంలో రచయితలు ఎందుకు మౌనం వహించారు?’ అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విశిష్ట వారసత్వ సంపద కలిగిన నగరాల అభివృద్ధికి ఉద్దేశించిన హృదయ్‌ పథకాన్ని దేశంలో తొలిసారిగా వరంగల్‌లో ప్రారంభించారు. తొలుత ఓరుగల్లు కోటను సందర్శించిన వెంకయ్య.. అనంతరం హృదయ్‌ పథకం కింద భద్రకాళి చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేశారు. హన్మకొండలోని వేయిస్తంభాలగుడి ఆవరణలో హృదయ్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రేటర్‌ వరంగల్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఇవాళ దేశంలో నిరసనలు తెలిపే రచయితలందరూ ఎమర్జెన్సీ సమయంలో ఎందుకు నోరెత్తలేదు? ఎమర్జెన్సీ విధించి 2లక్షల 70వేల మందిని జైళ్లలో తోస్తే రచయితలు ఎందుకు మౌనం వహించారు? 1984లో ఢిల్లీలో 3500 మంది సిక్కులను ఊచకోత కోశారు.. నోరెత్తలేదే? తస్లీమా నస్రీన్‌ అనే రచయిత్రి స్వేచ్ఛగా రాస్తే హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ‘నువ్వెట్లా బయటకు పోతావో చూస్తా.. నీ ప్రాణం తీస్తా!’ అని అక్బరుద్దీన్‌ హెచ్చరిస్తే ఎవరూ మాట్లాడలేదే? సల్మాన్‌ రష్దీ విషయంలోను, ముజఫర్‌పూర్‌ హత్యాకాండపైనా నొరెత్తలేదే? ఇప్పుడు మోదీ అధికారంలోకి వచ్చారుకనుక కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నిలువు దోపిడీ చేసిందన్నారు. ‘కాంగ్రెస్‌ హయాం అంతా కుంభ కోణాల మయం. భూమి మీద క్రీడల కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభ కోణం. ఆకాశంలో అగస్టా హెలీకాప్టర్‌ కుంభకోణం. అంతరిక్షంలో టూజీ కుంభకోణం. ఆకాశాన్నీ, భూమినీ, అంతరిక్షాన్ని సైతం కాంగ్రెస్‌ వదల్లేదు’ అని ఘాటుగా విమర్శించారు.
 
రూ.200 కోట్లు ఇవ్వండి: కడియం 
హృదయ్‌ పథకం కింద వరంగల్‌ నగరానికి రూ. 200 కోట్లు ఇవ్వాలని వెంకయ్యను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. రైతులను ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా హృదయ్‌ పథకం కింద రూ 2 కోట్ల చెక్కును శ్రీహరికి వెంకయ్య అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినియ్‌భాస్కర్‌, టీడీఎల్‌పి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభసభ్యురాలు గుండు సుధారాణి, ఎంపీ సీతారాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment