Tuesday, 27 October 2015

గోవుతోనే పాడిపంటలు

 హోం >> ఎడిటోరియల్
గోవుతోనే పాడిపంటలు
Updated :27-10-2015 01:07:38
ఇటీవల జైనుల పర్వదినాలను పురస్కరించుకొని ‘పశు మాంసం’ అమ్మకాలను నిషేధించిన మహారాష్ట్ర ప్రభుత్వంపై అందరూ అక్కసు వెళ్లగక్కుతున్నారు! అదే బాటలో జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మేధావులు, నాయకులు అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. మాంసానికి మతం రంగు, దళిత బహుజన రంగు పులిమి జాతీయ ప్రభుత్వం మీద ఒంటికాలిపై లేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేద్దామంటే 2జీ, 3జీ, భోఫోర్స్‌ లాంటి కుంభకోణాలు లేవు. కొందరైతే ఏకంగా దేశంలో జరిగే ప్రతీ విషయానికీ నరేంద్ర మోదీయే కారణమన్నట్లు తూటాలు పేల్చుతుంటే, మరికొందరు నరేంద్రమోదీ స్పందించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దేశాన్ని ప్రధాని మాత్రమే పాలిస్తున్నారా! వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు లేరా! ఇదంతా రాజకీయం. కానీ ‘పశువధ’ వల్ల మన సమాజానికి జరుగుతున్న నష్టాన్ని మరోకోణంలో ఆలోచించడం శాస్త్రీయత అని తెలుసుకోలేకపోతున్నారు.
 
ముస్లింలు పశువధకు మద్దతు ఇస్తారనీ, వారి ఆహారం అదే అని ప్రచారం చేస్తూ దానికి మతపరమైన మరణశాసనం రాస్తున్నారు. కానీ వ్యవసాయిక దేశంలో రైతులకు పశువధ వల్ల ఎంత నష్టం జరుగుతుందో అంచనావేయడం లేదు. దీనికో పవిత్రత ఆపాదిస్తూ మన దేశ వ్యవసాయన్ని కాపాడే హిందూ వర్గంపై అనవసర ఖండన మండనలు చేస్తున్నారు కానీ ఈ పశువధ వల్ల వ్యవసాయ రంగం ఎంత బలహీనమైపోతుందో, విదేశీ ఎరువుల కంపెనీల ముందు మనం ఎంత దాసోహం అయిపోతున్నామో ఈ తీవ్రతలో వివేకంతో ఆలోచన చెయ్యలేకపోతున్నాం. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా వృత్తి, నైపుణ్యాలపై ఆధారపడతారు. వారు మూల ఉత్పత్తి వ్యవస్థలో భాగం కాదు. కాబట్టి పశుపోషణను ముస్లింలకు అనుసంధానించడమే తప్పటడుగు.
 
పూర్వం నుంచి గోరక్షణ-పశుపోషణ హిందుత్వంలో అంతర్భాగాలు. దిలీపుని గోసేవ, శ్రీకృష్ణుని గోరక్షణ, ఉత్తర గోగ్రహణం-దక్షిణ గోగ్రహణం వంటి పదాలు హిందూ ఇతిహాస, పురాణ కావ్యాల్లో స్థానం పొందాయి. గోరక్షణకు పవిత్రత ఆపాదించిన ఋషులు దానిలోని పరమార్థం అర్థం చేసుకొంటారని భావించారు. దురదృష్టవశాత్తూ పవిత్రత మాత్రమే పట్టుకొని, సామాజిక ఉపయోగ దృష్టిని విస్మరించాం. అందువల్ల పశుపోషణ - పశుహింసకు గల వ్యత్యాసం మనం గ్రహించలేకపోతున్నాం. దానికి మతం రంగు పులిమి మరింత రాక్షస క్రీడగా మార్చుకొన్నాం.
 
మహాత్మాగాంధీ గోవధ నిషేధాన్ని బలపరిచారు. ఓ బహిరంగ సభలో.. ‘‘నేను ప్రధానిని అయితే పశువధశాలలన్నీ మూసివేయిస్తాను’’ అని ప్రకటించారు. 1924లో మదన్‌మోహన్‌ మాలవ్యా గోవధ నిషేధంపై యూనిటీ కాన్ఫరెన్స్‌లో తీర్మానం చేయించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 48 గోసంపదను రక్షించాలని ఆదేశిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు 1910 వరకు 350 మాత్రమే ఉన్న గోవధశాలలు 1947 తర్వాత 36000కు పెరిగాయి. అప్పటి నుంచి దేశంలో ఆవు-ఆవు సంతతి ధ్వంసం జరుగుతూనే ఉంది. గోరక్షణను ప్రాథమికహక్కుగా మార్చాలని నేషనల్‌ కమిషనర్‌ ఫర్‌ క్యాటిల్‌ (ఎన్‌సీఎ్‌ఫసీ) నాలుగు సంపుటాలల్లో 1500 పుటల నివేదిక 3 ఆగస్టు 2002న కేంద్రానికి సమర్పించింది.
 
అయితే గోవు విషయంలో 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీషువారు ఉపయోగించిన కుటిలనీతి మన పాలకులకు ఆదర్శమయ్యింది. తూటా చివర పెట్టే కొవ్వు విషయాన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చి 1857 తిరుగుబాటును నాటి పాలకులు నీరు గార్చినట్లే నేడు లౌకికవాదుల పేరుతో కొందరు పశువధను మతదృష్టితో చూపిస్తూ వ్యవసాయరంగాన్ని దెబ్బతీస్తున్నారు. కేవలం 2002లో 8,780 కోట్ల రూపాయల తోళ్ల ఎగుమతి జరుగగా అందులో 60 శాతం ఆవును చంపడం వల్ల లభించినదే కావడం గమనార్హం. ఎస్‌.శ్యాంప్రసాద్‌ అనే అధికారి ఇటీవల కాలంలో తీసిన లెక్కల ప్రకారం ఒక పశువధశాల నుంచి రూ. 20 కోట్ల ఎగుమతులు జరిగితే అక్కడ చంపబడే పశువులతో తయారు చేయదగ్గ ఎరువులు, శక్తి విలువ 910 కోట్ల రూపాయలు మనం కోల్పోవడమే! ఒక ఆవు పాలతో తన జీవిత కాలంలో 25,478 మంది వ్యక్తులను ఒకసారి తృప్తి పరచగలుగుతుందని స్వామి దయానంద తన ‘‘గో కరుణానిధి’’ పుస్తకంలో పేర్కొన్నారు. మహావీరుడు, గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ వంటి అహింసామూర్తులు ప్రభవించిన ఈ నేలలో రోజూ ఎంత భయంకరమైన హింస జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ముఖ్యంగా ఆవును హింసించే విధానం, చంపబడుతున్న గోవుల సంఖ్య మనకు తెలిస్తే గుండె బద్ధలయిపోతుంది.
ముంబైలోని దేవనార్‌, మెదక్‌ జిల్లాలోని అల్‌-కబీర్‌, ఔరంగాబాద్‌లోని పశువధశాలల్లోని గోహత్య దేశానికి కళంకం. అదీ భయంకరమైన హింసతో చేసే గోవధ, గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతాన్ని హత్య చేయడమే! గోవులను తరలించే ట్రక్కులలో ఒక్కో వాహనంపై 20 నుంచి 30 కంటే ఎక్కువ ఆవులను ఎక్కించలేం కానీ 50కి పైగా ఆవులను ట్రక్కుల్లో ఎక్కిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గోవధశాలలకు వెళ్లేటప్పుడు వాటికి ఎలాంటి గ్రాసం (మేత) వేయకుండా 4 నుండి 5 రోజులు ఉపవాసం ఉంచుతారు. గోవులను పశువధశాలలో తలక్రిందులుగా వ్రేలాడదీస్తున్నారు. ఆ తర్వాత 100 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత గల వేడినీళ్లను వాటి శరీరం మీద పోస్తున్నారు. బ్రతికుండగానే వాటి చర్మాలను ఒలుస్తారు. వాటి శరీరానికి వాడి కత్తులు గుచ్చి రక్తం తీస్తున్నారు. వాటిని ఇంత భయంకర, క్రూర హింసలకు గురిచేసి మాంసం తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
 
స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ ఇచ్చిన మూడు ప్రాధాన్యాల్లో ‘గోవధ నిషేధం’ ఒకటి. కానీ భారతదేశంలో గోవులను ఇంత దారుణ చిత్రవధకు గురి చేసి సొమ్ము చేసుకోవడం ఎంత ఘోరం? ఈ హింసాకాండను ఆపలేని ప్రభుత్వాల అసమర్థతను ప్రశ్నిస్తూ 1989లో అఖిల భారత కృషి గోసేవాసంఘ్‌, అహింసా ఆర్మీ ట్రస్ట్‌ అనే రెండు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ తర్వాత ఈ కేసులో నాటి గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్‌ అయ్యింది. జస్టిస్‌ ఆర్‌.సి. లాహోటీ నేతృత్వంలో 2004లో సుప్రీంకోర్టు ఓ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ సుదీర్ఘంగా చేసి 2005 సెప్టెంబరులో తీర్పు వెలువరించింది. ఇందులో ముఖ్య ప్రతివాది ఖురేషి సమాజ్‌ (అతి ఎక్కువ గోహత్యా కేంద్రాలు నడిపే సంస్థ) ఎన్నో అబద్ధాలను, హేతురహిత కారణాలను కోర్టుకు సమర్పించింది. అందులో మొదటి కుతర్కం ముసలి ఆవులను పోషించడం కష్టమనీ, గ్రాసం లేక ఆకలిచావు చచ్చేదానికన్నా పశువధశాలకు వెళ్లడం మంచిదనీ, స్థలాభావం వల్ల గోవులను పోషించడం కష్టమనీ, ముసలి గోవులను చంపి దేశ ఆర్థిక వ్యవస్థను మేం పరిరక్షిస్తున్నామని కోర్టుకు తెలిపింది. దానికి చివరగా గోహత్య మా మతహక్కు అని కూడా ఇంకో కొత్త పల్లవి అందుకొన్నది.
 
దానికి కేసులు వేసిన పై సమాజాలవారు కోర్టుకు తర్కబద్ధంగా కొన్ని గణాంకాలను సమర్పించారు. వాటిని విశ్లేషిస్తే - ఒక ఆవు జీవితకాలం 20 ఏళ్లు. ఆరోగ్యంగా జీవించే ఆవు బరువు 300 నుంచి 350 కిలోలు. దానిని చంపడం వల్ల లభించే మాంసం 70 కిలోలు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాంసం ధర 50 రూపాయలు. అంటే ఒక ఆవును చంపగా వచ్చిన మాంసం ధర 3500 రూపాయలు. ఆవు నుంచి లభించేది 20 నుండి 25 లీటర్ల రక్తం. దాని ధర సుమారు 2000 రూపాయలు మాత్రమే. అలాగే దాని ఎముకల ధర రూపాయలు 1200 నుండి 1300 వరకు లభిస్తుంది. చర్మం, ఇతరాల నుంచి మరికొంత. మొత్తానికి ఒక ఆవును చంపినపుడు దాని వల్ల సుమారు 7000 రూపాయలు లభిస్తాయి. మరి ఆవును బ్రతికిస్తే ఒక ఆరోగ్యకరమైన ఆవు ప్రతిరోజు 8 నుంచి 10 కిలోల పేడనిస్తుంది. ఒక కిలోపేడతో 38 కిలోల సేంద్రియ ఎరువు (ఆర్గానిక్‌ ఫర్టిలైజర్‌) తయారు చేయవచ్చు. ఈ రోజు ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో 6 రూపాయలు. అలాగే గోమూత్రం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. ఒక లీటర్‌ ఆవు మూత్రం ధర భారత మార్కెట్లో 500 రూపాయలు. గోమూత్రం ద్వారా ఆస్ర్టియో పోరోసిస్‌, ఆస్ర్టియామైలీటాస్‌, ట్యుబరికిలోసిస్‌, బ్రాంకైటిస్‌ వంటి వాటికి మందులు తయారు చేయవచ్చు. గోమూత్రంపై అమెరికా మూడు రకాల పేటెంట్‌ హక్కులు కైవసం చేసుకొన్నది.
 
ఇవాళ గోమూత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో 800-1200 రూపాయల వరకు పలుకుతున్నది. అదేవిధంగా ఆవు పేడ నుంచి మీథేన్‌ గ్యాసును ఉత్పత్తి చేస్తే 70 పైసలకే కిలోమీటర్‌ వాయుకాలుష్యం లేకుండా వాహనాలపై ప్రయాణం చేయవచ్చు. అలాగే శబ్దం రాని వాహనాలతో ధ్వని కాలుష్యం లేకుండా నివారించవచ్చు. వంట చెరుకుగా కట్టెలకు బదులుగా ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ఆవుపేడను ఉపయోగించి అడవులను కాపాడవచ్చు తద్వారా పర్యావరణ పరిరక్షణ చేయవచ్చు. ఇలా ఒక ఆవు తన జీవితకాలంలో గణాంకాల ప్రకారం 40 లక్షలు మనకు అందిస్తుంది. మరి ఆవును చంపి దాని రక్తమాంసాలను 7 వేలకు అమ్ముకొందామా? ఒక ఆవును రక్షించి 40 లక్షల రూపాయల ఆర్థిక పుష్టిని కలిగిద్దామా? అని కేసువేసిన సంస్థలు వాదించాయి. దాంతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. వెంటనే ప్రతివాదులు ఆవును చంపడం తమ మతహక్కు అని వాదించారు. దానికి పై సంస్థలవాళ్లు కొన్ని ఉదాహరణలు, మతగ్రంథాలు, చారిత్రక గ్రంథాలు చూపించారు. ఖురాన్‌, హదీ్‌సలలో ఎక్కడా గోహత్య లేదని వాదించారు. దీనికి సాక్ష్యంగా చారిత్రక గ్రంథాలను కూడా చూపించారు. దాదాపు 750 ఏళ్లకు పైగా భారత్‌ను పాలించిన ముస్లిం రాజులెవరూ గోవధ చేయలేదని నిరూపించారు. బాబర్‌ చక్రవర్తి తన ‘బాబర్‌నామా’లో ‘తన మరణానంతరం కూడా గోవధ నిషేధం అమలు చేయాలని’ రాశారు. దానిని ఆయన కుమారుడు హుమాయున్‌ పాటించాడు. అలాగే అక్బర్‌, జహంగీర్‌, ఔరంగజేబులతో సహా అందరూ గోవధ నిషేధం చేశారు. బక్రీదు పర్వదినం నాడు కూడా గోవధ నిషేధం విధించాడు ఔరంగజేబు. టిప్పుసుల్తాను తండ్రి మైసూరు రాజు హైదరాలీ గోవధ చేసినవారి చేతులు నరకమన్నాడు. అలాగే బహాదూర్‌ షా తన రాజ్యంలో గోవధనిషేధం పకడ్బందీగా అమలు చేశాడు. ఒక నెల సమయం కోరిన ప్రతివాదులు తమ వాదనను సమర్థించుకోలేకపోయారు. చివరకు సెప్టెంబర్‌ 2005లో సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరిస్తూ వెంటనే దేశంలో గోహత్యా నిషేధం చేయాలని, రాష్ర్టాలు గోహత్యనిషేధ చట్టం వెంటనే అమలు చేయాలని, గోవులను రక్షించడం ప్రతిపౌరుని బాధ్యత అని తీర్పు ఇచ్చింది. తీర్పు పాఠం www.supremecourtcaselaw.com చూడవచ్చు.
 
మరి ఈ దేశంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలో భాగమైన సుప్రీంకోర్టు తీర్పును గౌరవించరా? గోవధ నిషేధం జాగ్రత్తగా అమలు పర్చాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు నటిస్తుంటే పౌరులు ఉద్వేగాలకు లోనై ప్రతిచర్యలకు పూనుకుంటున్నారు. ప్రతిచర్యలను విమర్శించేవాళ్లు చర్య జరగకుండా ఎందుకు నిలువరించలేకపోతున్నారు?
-డా. పి. భాస్కరయోగి

No comments:

Post a Comment