Friday, 2 October 2015

ఇది ముమ్మాటికీ హత్యే : అసదుద్దీన్ ఒవైసీ

ఇది ముమ్మాటికీ హత్యే : అసదుద్దీన్ ఒవైసీ
Updated :02-10-2015 15:14:17
ఉత్తర్‌ప్రదేశ్, అక్టోబర్ 2 : గోవధకు పాల్పడ్డారన్న అనుమానంతో యూపీలో హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఓదార్చారు. ఇది ముమ్మాటికీ పథకం ప్రకారం జరిగిన హత్యే అని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో గోవధపై నిషేధం అమలులో ఉంది. దానికి విరుద్ధంగా దాద్రీకి దగ్గరగా ఉన్న విసడా గ్రామంలో ఒక కుటుంబం ఆవును చంపి తిన్నదన్న వదంతులు వ్యాపించాయి.
 
దాంతో సోమవారం రాత్రి సుమారు వందమంది గ్రామస్థులు ఆ ఇంటిపై దాడి చేశారు. మొహ్మద్ ఇక్లాక్(50)ను, అతడి కొడుకును ఇంట్లో నుంచి బయటకు లాగి చితకబాదారు. ఇటుకలతో కొట్టారు. వారి దాడిలో ఇక్లాక్ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.
 
ఇక్లాక్ భార్యతో పాటు, 70 ఏళ్ల తల్లికి కూడా గాయాలయ్యాయి. నిజానికి తాము ఆవు మాంసం తినలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈద్ సందర్భంగా బంధువులు కానుకగా ఇచ్చిన మటన్‌నే తిన్నామని వారు అంటున్నారు. ఆ కుటుంబంపై దాడి జరుగుతుండగానే పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురు యువకులను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఆ సంఘటనపై యూపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పలుకరించి ఓదార్చిన ఆయన ఇది ముమ్మాటికి పథకం ప్రకారం జరిగిన హత్యే అని అంటున్నారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తిని చంపి ప్రమాదం అని చిత్రీకరించడం అన్యాయమన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి మహేశ్‌శర్మ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment