Friday, 16 October 2015

ద్వేషం ఈ దేశ పతాకం కాగూడదు!

ద్వేషం ఈ దేశ పతాకం కాగూడదు!
Updated :15-10-2015 00:36:33
ఇతర విశ్వాసాలపై దాడిచేయడం కూడదు. నిజమైన విశ్వాసి ఇతర విశ్వాసాలలోని ఆదరణీయమైన అంశాలన్నిటిని గౌరవిస్తాడు.
-(అశోక చక్రవర్తి క్రీ.పూ.302-232)
 
లౌకికవాదమనే జబ్బు పట్టుకుందట. ప్రభుత్వాలు మారినా ఇంకా నెహ్రూ కాలం నాటి పద్ధతులే కొనసాగాలని పట్టుబడుతున్నారట. దేశంలో వ్యాపిస్తున్న అసహనపు భూతాన్ని చూసి ఆవేదన చెందుతున్న ఆలోచనాపరులకు అందుతున్న ప్రశంసలు అవి. నిజమే. జబ్బు పట్టుకుంది. ఈనాటిది కాదు. నిన్న మొన్నటి నెహ్రూ తెచ్చిన జబ్బూ కాదు. వేల ఏండ్ల వ్యాధి. అశోకుడే పెద్ద జబ్బు మనిషి. యుద్ధం తప్పని, అసహనం అపరాధమని, సహజీవనమే సూత్రమని నమ్మాడు. లౌకికవాదమే కాదు, హేతువు ఒక జబ్బు. ప్రశ్నించడం ఒక జబ్బు. సత్యం అనుకున్న దానిని తల పణంగా పెట్టి చెప్పడం మరో జబ్బు. ఆది కాలం నుంచి వేద కాలం నుంచి, ప్రతిదీ మారేదే అని చెప్పిన గౌతమబుద్ధుడి నుంచి, లోకాయత చార్వాకుల నుంచి సత్యకాముడి నుంచి అసితకేశ కంబళి నుంచి, సాంఖ్యవైశేషికుల నుంచి, ఆర్యభట్ట వరాహమిహిరుల నుంచి, చరక సుశ్రుతుల నుంచి ప్రశ్నల కంటకారణ్యం నుంచి ప్రపంచం నడుస్తూ వచ్చింది. నాలుగుసింహాల స్తంభం సాక్షిగా, జెండా గుండె మీద అచ్చు పోసుకున్న 24 ఆకుల చక్రం సాక్షిగా ఈ దేశం వ్యాధిగ్రస్త అశోకుడినే ఆదర్శంగా చెప్పుకున్నది. ఇప్పుడిక అన్నిటినీ విసిరిపారేసి ద్వేషాన్ని ఈ దేశపు పతాకంగా ఎగురవేయాలి కాబోలు. మేకిన్‌ ఇండియా నినాదానికి తగినట్టు ఒక హిట్లర్‌ను భారతీయతలోకి అనువదించుకోవాలి కాబోలు!
 
ఇంకా రిజర్వేషన్లా, ఈ 21వ శతాబ్దంలో కూడానా? అని ఏ జబ్బూ లేని ఒక పెద్దమనిషి ఆశ్చర్యపోయాడు. తొంభైయేళ్ల వృద్ధుడు గుడిలోకి వెడతానంటే సజీవదహనం చేసినందుకు, గోమాంసం తిన్నాడనో దాచుకున్నాడనో ప్రేరేపిస్తే ఊరు ఊరంతా వెళ్లి ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపినందుకు పెద్దనుషులకు పెద్ద ఆశ్చర్యం కలగకపోవచ్చు. ఈ కాలానికి అవి అత్యంత సహజమైనవిగా కూడా తోచి ఉండవచ్చు. పాత-కొత్తల విషయంలో సంఘ ప్రముఖులకు, సాధారణులకు మధ్య ఉన్న తేడా వల్లనే, బహుశా, రచయితలు, మేధావులు ఇంకా నెహ్రూ హయాంలోనే ఉండిపోయారన్న అనుమానం కలిగి ఉంటుంది. ఇంకానా, 21వ శతాబ్దంలో కూడా సహనమూ శాంతీ గురించి మాట్లాడుతారా అని సందేహం కలిగి ఉంటుంది.
 
ప్రశ్నను, హేతువుని విశ్వసించేవారు ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఏ కాలంలో బతకాలనేది! అది క్రీస్తుపూర్వం మూడునాలుగు శతాబ్దాలలోనా, లేక 21వ శతాబ్దంలోనా? ఈ యుగాల, శకాల లెక్కలు అనవసరం అనుకుంటే, ఒక ప్రేమయుగంలోనా, ద్వేషయుగంలోనా అన్నది తేల్చుకోవాలి. ప్రేమ కోసం పనిచేసేవారు చాలా ద్వేషాన్ని ఎదుర్కొనాలి. హింసను ఎదుర్కొనాలి. ఇంట్లోకి చొరబడి మెత్తగా దించే రెండు గుండ్లకు సిద్ధంగా ఉండాలి, ఇంటి మీద పడి జరిగే హంతకదొమ్మీకి కాచుకుని ఉండాలి. ఈ కాలంలో బతుకుతూ, ఇంత ద్వేషాన్ని, ఇంతటి నైతిక కాపలాకోరుల్ని భరించలేకనే, హేతుబద్ధ ఆలోచనకు, మూర్ఖపు వాస్తవికతకు పొంతన కుదరకనే, దేశంలో అక్షర ప్రపంచం అతలాకుతలమవుతున్నది. ఇది మాకు నచ్చడం లేదు, ఈ ధోరణితో మేము ప్రయాణించము అని ప్రకటన చేయడానికి తోచిన మార్గం అనుసరిస్తున్నారు. అవార్డులు, బిరుదులు తిరస్కరించడం ఒక రూపం మాత్రమే. అందుబాటులో ఉన్న ఆయుధం మాత్రమే. తమ గొంతును బలంగా వినిపించడానికి అనువైన వాహిక మాత్రమే.
 
ఇప్పుడున్న చీకటిశక్తులు మునుపు కూడా ఇంత బలంగానూ ఇంత అధికార ఉన్మత్తతతోనూ ఉంటే, లేదా ప్రతీఘాతకులకు తాను భయపడి ఉంటే దయానంద సరస్వతి విగ్రహారాధనను వ్యతిరేకించగలిగేవాడా? ఏకేశ్వరోపాసనను బోధించగలిగేవారా? బ్రహ్మసమాజం కులవ్యవస్థను వ్యతిరేకించగలిగి ఉండేదా? సత్యశోధక జ్యోతిబా పూలే బ్రాహ్మణవాద దౌష్ట్యాన్ని ఖండించి బహుజనముక్తి గురించి ఆలోచించేవాడా? సంప్రదాయాన్నే తలకెత్తుకుని ఉంటే వీరేశలింగం వితంతు వివాహాలు చేసేవారా? యథాతథాన్ని తలకెత్తుకోవడమే ధర్మం అనుకుంటే అంబేద్కర్‌ ఆశాకిరణమై అవతరించేవాడా? స్వీయ-ఇతర ద్వంద్వంలో సమస్తాన్నీ వ్యాఖ్యానిస్తూ అగాధాలు సృష్టిస్తున్న నేటి ఉన్మాదశక్తులు చరిత్రలో ఒక్కటంటే ఒక్కటి సమాజపు చెడుగును తొలగించారా? ఒక్కటంటే ఒక్కటి ముందడుగు వేశారా?
 
భారతీయ సమాజంలో సమస్త శ్రేణులనూ చదువులోకి, సమానావకాశాలలోకి, సాధికారతలోకి తీసుకురావడానికి, అన్ని రకాల దోపిడీపీడల నుంచి విముక్తం చేయడానికి రెండువందలేళ్లుగా ఈ దేశంలో సాగుతున్న సాంఘిక, రాజకీయ ప్రయత్నాలు, ఉద్యమాలు, వలసపాలనపై చేసిన యుద్ధాలు, మరింత మరింత ప్రజాస్వామీకరణ కోసం నిరంతరం జరుగుతున్న సాధనలు- వీటన్నిటి నేపథ్యంలో నుంచి ఉద్భవించింది ఆధునిక భారతీయ ప్రగతిశీల మేధ, ఆలోచన. ఇంకా ఉష్ట్రపక్షుల వలె తమకే తెలియని గతంలోకి తలదూర్చి నిద్రిస్తున్న మెదళ్లు లేకపోలేదు. కానీ, మాట్లాడుతున్నది, సంఘాన్ని కుదుపుతున్నది రేపటి చూపు. నయనతార సెహగల్‌! విప్లవకారిణి కాదే, పిడుగుపాటు భావాలతో సంఘాన్ని కల్లోలితం చేసిన మనిషి కాదే! ఆమె ఏమన్నది? రచన అనే కళలో సత్యం పట్ల నిబద్ధత అంతర్భాగమని! భారతీయ శిష్ట సంపన్న శ్రేణి రచయితల్లో సైతం మిగిలిన జాతీయోద్యమ, ప్రగతిశీల విలువల ప్రతినిధి ఆమె. అకాడమీ అవార్డులు వెనక్కు ఇస్తున్నవారు, బిరుదులు వాపసు చేస్తున్నవారు- సచ్చిదానందన్‌ వంటి వారు మినహాయిస్తే- తీవ్ర భావాల కారణంగా ప్రసిద్ధులయినవారు కారు. అధికులు, సాధారణ ఆధునిక రచయితలు. అయినా, వారు భారతదేశపు సంప్రదాయాన్ని, అశోకుని సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. భారత్‌ అంటే ఇంకు పులిమేవారూ, అసహనపు ఇంధనంతో హత్యలు చేసేవారూ మాత్రమే కాదని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. వారికి దేశం కృతజ్ఞురాలై ఉంటుంది.
 
సరిగ్గా నెలరోజుల కిందట యూపీలోని దాద్రిలో మహ్మద్‌ అఖ్లాఖ్‌ను దుండగుల మూక కొట్టిచంపినప్పుడు, అతని పెద్దకుమారుడు సర్తాజ్‌ ఊళ్లోలేడు. అతను ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తూ చెన్నైలో ఉన్నాడు. సంఘటన జరిగిన తరువాత వచ్చిన సర్తాజ్‌, తన కుటుంబాన్ని చెన్నై తీసుకువెడతానని చెప్పాడు. తన ఉద్యోగరీత్యానే కాదు, భద్రత రీత్యా కూడా చెన్నైను అతను ఎంచుకుని ఉంటాడు. దక్షిణ భారతానికి అటువంటి ప్రతిష్ఠ ఉన్నది. బ్రిటిష్‌ వలస పాలన, సంస్కార ఉద్యమాలు, ప్రజాపోరాటాలు, ఉన్నతమయిన సాంస్కృతిక ఉద్యమాలు- దక్షిణాదిని సెక్యులర్‌గా, ప్రగతిశీలంగా మలిచాయి. మతవాద శక్తులకు ఈ ప్రాంతం ఇంకా దుర్భేద్యంగానే ఉన్నది. కొంతకాలంగా కర్ణాటక మాత్రం మతోన్మాదపు ఉధృతిని ఎదుర్కొంటున్నది. కల్బుర్గి హత్య అందుకు పరాకాష్ఠ. అయితే, సాహిత్య, సాంస్కృతిక శ్రేణులు ఎంతో దృఢంగా, నిబద్ధతతో ఉన్న రాష్ట్రం కాబట్టి, మతోన్మాదపు పీడను అక్కడి రచయితలు, కళాకారులు బలంగా ఎదుర్కొంటున్నారు. అధికార, శిష్ట శ్రేణుల్లో ఉన్నవారు సైతం కొన్ని విలువలకు గట్టిగా కట్టుబడడం చూస్తాము. సంఘసంస్కారానికి, మిలిటెంట్‌ రాజకీయోద్యమాలకు పేరుపొందిన తెలుగువారిలో మాత్రం తమిళనాట పాదుకున్నంత బలంగా లౌకికవాదం, కర్ణాటకలో ఉన్నంత కళారంగ క్రియాశీలత ఉన్నాయా అని అనుమానం కలుగుతుంది. అవార్డులు తీసుకోవచ్చా లేదా అన్న అంశంపై తీవ్రమైన చర్చలు జరుగుతాయి. అదే సమయంలో ప్రగతిశీల శిబిరం నుంచి కూడా అవార్డులు తీసుకునేవారుంటారు. అకాడమీ వంటి సంస్థల అటానమీని విశ్వసించేవారు, ప్రభుత్వం అదీ ఒకటి కాదు అనుకునేవారు ఉంటారు. నిజానికి ఆ చర్చ ఇప్పుడు అవసరమేమీ కాదు. అయితే, ఏ ప్రశ్నా లేకుండా తమకొక సాహిత్యసంస్థ గుర్తింపు ఇచ్చిందని తీసుకున్న ఇతర రాషా్ట్రల రచయితలు, దాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా ఒక ప్రకటన చేయగలుగుతున్నారు. ఎంతో మథనం తరువాత తీసుకున్న తెలుగు రచయితలు (ఎంతో ప్రయత్నం తరువాత తీసుకున్న రచయితలూ ఉన్నారు) మాత్రం అటువంటి సాహసం చేయలేకపోతున్నారు.
 
అవార్డులను తిరిగి ఇవ్వడమే ఏకైక రూపమని, అట్లా చేయడమొక్కటే తెలుగు ప్రగతి రచయితల నిబద్ధతను సూచించేదని చెప్పడం లేదు. కానీ, ఏదో ఒకటి, బలంగా గొంతు వినిపించే పని, నిరసనను తెలిపే పని తెలుగు రచయితలు చేయకపోవడం కొంత కష్టంగానే ఉన్నది. ఈ మెతకదనం చాలా ఖరీదైనది. ఈ సంకోచం ప్రమాదకరమైనది. అసహనంపై ఈ సహనం కూడనిది.

No comments:

Post a Comment