- సహనశీలతతోనే 5వేల ఏళ్లుగా భారత్ మనుగడ: రాష్ట్రపతి
న్యూఢిల్లీ, అక్టోబరు 19: కల్బుర్గీ హత్య, సుధీంద్రకులకర్ణిపై సిరా దాడి, దాదరీ ఘటన.. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి స్పందించారు. సహనాన్ని కోల్పోరాదని, ఐకమత్యంగా ఉండాలని జాతికి హితవు పలికారు. దసరా నవరాత్రుల నేపథ్యంలో.. ఆ మహామాయ (దేశంలోని అన్ని సానుకూల శక్తుల కలయిక).. అసురులను లేదా విభజనశక్తులను దునుమాడాలని ఆకాంక్షించారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో సోమవారం ఓ కార్యక్రమంలో ఆయన.. భారత నాగరకతకుగల సహనశక్తి కారణంగానే వేల ఏళ్లుగా మనుగడ సాగించగలుగుతోందని గుర్తుచేశారు. మీడియాలో ఇటీవలి వార్తలు చూస్తుంటే. ‘‘సహనం, భిన్నాభిప్రాయాలను అంగీకరించే దృక్పథం కొరవడుతున్నాయా’’ అని ఆవేదన కలుగుతోందన్నారు. దేశంలో 1600 యాసలు, 7 మతాలు సహజీవనం చేస్తున్నాయని గుర్తుచేశారు. ‘‘మనం భిన్నత్వాన్ని ఆచరిస్తాం, సహనాన్ని ప్రోత్సహిస్తాం, భిన్నాభిప్రాయాలను అంగీకరిస్తాం. లేకపోతే ఈదేశం 5వేల ఏళ్లుగా మనుగడ సాగించగలిగేది కాదు’’ అన్నారు. మానవత్వం, బహుళత్వాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోరాదని కార్యక్రమం తర్వాత ప్రణబ్ ట్వీట్ చేశారు. దుష్టశక్తులపై అందరి శక్తినీ సంఘటితంగా ప్రయోగించాలని పేర్కొన్నారు.
|
No comments:
Post a Comment