Wednesday, 28 October 2015

మెను స్మృతి! - మల్లంపల్లి సాంబశివరావు

మెను స్మృతి! 

Updated :29-10-2015 00:29:37
తిండీతిప్పల దగ్గర్నుంచి వేషభాషల వరకూ బహుళత్వమే భారతీయాత్మ. ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా రుచుల్లో సామ్యం కనిపించదని తెలిసి కూడా, లోకోభిన్నరుచి : అన్న నోటితోనే భిన్న రుచుల మీద కత్తులు దూస్తున్న ఆర్యులారా.. మీ జీవకారుణ్యంలో మానవకారుణ్యాన్ని డిలీట్‌ చేశారా? 


మరీ ఎక్కువగా కడుపు చించుకుంటే, గత కాలపు మాంసం కాళ్ల మీద పడొచ్చు. టైమ్‌ మెషిన్‌లో ఓ సారి వేదిక్‌ టైమ్స్‌కి వెళదామా? ‘దేహిమి దదామితే’.. (నువ్వు నాకిస్తావని నేను నీకు అర్చిస్తున్నా..) దేవుడితో బేరసారాల క్విడ్‌ప్రోకో.. ఓన్లీ గోబ్రాహ్మణ హితాయ.. బర్రెలూ బహుజనులూ ఖతాయ.. మద్యమాంసాలే అన్నపానీయాలుగా బతికిన ఆర్యులారా.. మీరు మధ్యాసియా నుంచి మూటగట్టుకొచ్చిన నిప్పులో పశువులను కబాబ్‌లుగా మారుస్తుంటే.. యాగాలలో ఆగమైపోయిన నాగలి సాక్షిగా బుద్ధుడొచ్చి బుద్ధి చెప్పాడు గానీ, అది తత్కాల్‌గానే మిగిలిపోయింది..
మీరు ఏది తింటే అదే గొప్ప కాబట్టి మిగతా దేశమంతా అదే తినాలి, మీరు చెప్పింది జనమంతా వినాలి.. ఎవడి రుచి ఏదైనా దాని మీద మీ అభిరుచి రుద్దాలి. ఆహారవిహారాల్లోనే కాదు, ఆలోచనల్లోనూ మీ అడుగుజాడల్లో నడవాలి. మీకు మాంసం రుచించనప్పుడు అది ఎంత ఉత్కృష్టమో ఒక శ్లోకం.. మానేసినప్పుడు అది ఎంత ఘోరమో మరో శోకం.. ప్లేటు తిరగేయటంలో మీరు టాప్‌... మీరు ఇతరులకి నేర్పని వేదాల సాక్షిగా అశ్వలాయన గృహ్యసూత్రాల్ని మరోసారి వల్లె వేస్తారా.. సారీ.. నెమరు వేస్తారా?
                       బౌద్ధంతో మారుమనసు పొందినా, బలి ఇచ్చే అలవాటు జీన్స్‌లో బలీయంగా ఉండిపోయిందేమో.. ఏదో ఒకరూపంలో ఏకంగా మనిషినే గావు పడుతూ ఆత్మారాముడిని సంతృప్తి పరుస్తూ వచ్చారు కదా.. దేవభాషకి దేశిభాషల్ని బలి ఇచ్చి.. సరస్వతిని మీ కాంపౌండ్‌లోనే బంధించి.. చదువుకుంటున్న నేరానికి శంబూకుడిని చంపించి, ఏకలవ్యుడిని మాత్రం ‘ఫింగర్‌చిప్‌’తో వదిలేశారు.
సర్వమానవ సమానత్వాన్ని బోధించిన పాపానికి బుద్ధుడిని ఛండాలుడని తిట్టి... తర్వాత అవతారంగా మార్చి ఆ రకంగా ఆయన తత్వాన్ని బలిచ్చారు.. చార్వాకుల్నీ ఆజీవకుల్నీ లోకాయతుల్నీ బౌద్ధుల్నీ జైనుల్నీ భిన్నమైన ఆలోచనలున్న వారినీ అహింసా కరవాలంతో నిజంగానే ‘ఖండిస్తూ’ వచ్చారు కదా?
శూద్రుడినీ స్ర్తీనీ చదువుకీ మోక్షానికి దూరం పెట్టి.. కాకిలాంటి పక్షులతో సమకట్టి, హీనమైన జంతువుల గాటనకట్టి... అసహ్యించుకున్న మనువు సాక్షిగా.. మీ స్మృతులు మిగతావారికి చితులు, మీ ఆచారాలు ఇతరులకి గాచారాలు.. పవిత్రత పేరుతో ఎందరు సతుల్ని సహగమనం చేయించారో? లక్ష్మణరేఖ దాటినవాడల్లా మీ శాకపాకాల బాణలిలో ‘మ్యాన్‌ 65’గా మారిపోతాడు.. నిన్నగాక మొన్న గుళ్లోకి వెళ్లబోయిన దళితుడేమయ్యాడో తెలిసిందేగా!
                        ఎవరి కంచంలో ఏముండాలో, ఎవరు ఎవరితో మంచం పొత్తు పెట్టుకోవాలో రాసిపెట్టిన మీరు.. నెయ్యి తినే హక్కును కొందరికి రిజర్వేషన్‌ చేసి... మరికొందరికి మనుషులు పియ్యినెత్తే ఖర్మను అంటగట్టారు.. చచ్చిన జంతువుల్నే బిర్యానీ చేసుకోమన్నారు. ఇక ముడ్డికి చీపురు, మూతికి ముంత షరా మామూలే.. ప్రశ్నించకుండా జో కొట్టడానికి ఆత్మ, పరమాత్మ, కర్మపరిపాకం, పూర్వజన్మలు, పునర్జన్మలు, బ్రహ్మం, పరబ్రహ్మం లాంటి మాయలెన్నో!
నిజంగా మీరు హింసనే కొలమానంగా తీసుకుంటే మాంసాహారులందరినీ వ్యతిరేకించాలి.. మరి ఓ వైపు మేకాహారుల్ని వాటేసుకుంటూ, మరోవైపు కడజాతుల్నీ, వారి తిండినీ ఎందుకు అసహ్యించుకుంటున్నట్టు? దీన్ని బట్టి హింస మాత్రమే కారణం కాదన్నమాట. ఆధిపత్యం కోసమే ఆహారానికి పవిత్రత కల్పించి.. మనుషులను పుట్టుకతోనే ఉన్నతులుగా నీచులుగా విభజించారన్నమాట.
చాలా చిత్రంగా మురికి చేసేవాడు పవిత్ర కేటగిరీలో ఉంటే, ఆ మురికిని శుభ్రం చేసేవాడిని మాత్రం అపవిత్ర కేటగిరీలో చేర్చారు.. సమాజాన్ని స్వచ్ఛంగా మార్చేవాళ్లందరికీ మనుషులుగా కనీస గౌరవం ఏనాడైనా ఇచ్చారా? అనాదిగా మీ హోమాల్లో సమిధలైన బహుజనుల్లో కొందరు ఆర్యత్వాన్ని ఆవాహన చేసుకుంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.. కలగూరగంపలో కలిసిపోయిన మీ డీఎన్‌ఏ ప్రభావం మరి..!
బెంగాలీ బ్రాహ్మణులు జలపుష్పాలు తింటే ఈశాన్యజనం కుక్కల్ని తింటారు
                        విశ్వామిత్రుడిలాగా! ఇక ఎలుకల్ని తినే బీహార్‌ ముసాహరులూ, వాటితో పాటు పిల్లుల్ని తినే యానాదులూ.. ఉసిళ్లు తినే వాళ్లూ - ఇలా ఎవరి రుచి వారిది... తిండీతిప్పల దగ్గర్నుంచి వేషభాషల వరకూ బహుళత్వమే భారతీయాత్మ. ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా రుచుల్లో సామ్యం కనిపించదని తెలిసి కూడా, లోకోభిన్నరుచి : అన్న నోటితోనే భిన్న రుచుల మీద కత్తులు దూస్తున్న ఆర్యులారా.. మీ జీవకారుణ్యంలో మానవకారుణ్యాన్ని డిలీట్‌ చేశారా?
పోనీ అదంతా వదిలేసి శాకం సంగతి తీసుకున్నా... రైతుకూలీల చెమట నెత్తురూ కలిస్తేనే కంకులు పాలుపోసుకుంటాయని తెలుసా? హింస అంటని ఒక్క ధాన్యపుగింజనైనా మీరు చూపించగలరా? దుక్కి మొదలు నూర్పిడి వరకూ ఎన్నెన్ని జీవులు బలైపోతాయో తెలియదా? వానపాములు, నత్తలు, మిడతలు,.. ఇక పంటల మీద చల్లే పురుగుమందులకి ఎన్ని కీటకాలు పురుగులు రాలిపోతాయో! మన జగదీష్‌చంద్రబోస్‌ ప్రకారం మొక్కలకి కూడా ప్రాణమున్నప్పుడు మరి వాటి ఉసురు మనకి తగలదా? ఇక తేనెటీగలు కొన్ని చనిపోతే కానీ తేనె తయారు కాదు, వాటి కష్టాన్ని దోపిడీ చేస్తే కానీ మనకి మధువు దొరకదు..
               అందుకే అన్నింటా ‘అతి సర్వత్రావర్జయేత్‌’ అన్నాడు బుద్ధుడు.. వాస్తవికదృష్టి మీద ఆధారపడి మధ్యేమార్గాన్ని సూచించాడు.. ‘‘మనిషి అపవిత్రుడయ్యేది మాంసాహారం వల్ల కాదు. కోపం, మొండితనం, మూర్ఖత్వం, పిడివాదం, మోసం, అసూయ, ఆత్మస్తుతి, పరనింద, దురాలోచనలు, గర్వం, తాగుబోతుతనం మనిషిని అపవిత్రం చేస్తాయి..’’ఇన్నాళ్లూ మీ పవిత్ర వైరస్‌కి సిస్టమంతా ఖరాబైపోయింది, అర్జెంట్‌గా ‘బహుజన హితాయ’ యాంటీవైరస్‌ వేయకపోతే చాలా కష్టం.. క్లోజ్‌ ది క్రీ.పూ. విండోస్‌.. మీ కంట్రోల్‌కి.. ఆల్ట్‌.. డిలీట్‌..! లెటజ్‌ రీస్టార్ట్‌..!! 
 మల్లంపల్లి సాంబశివరావు


1. మీ జీవకారుణ్యంలో మానవకారుణ్యాన్ని డిలీట్‌ చేశారా? 

2. మరీ ఎక్కువగా కడుపు చించుకుంటే, గత కాలపు మాంసం కాళ్ల మీద పడొచ్చు.

3. అనాదిగా మీ హోమాల్లో సమిధలైన బహుజనుల్లో కొందరు ఆర్యత్వాన్ని ఆవాహన చేసుకుంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.. కలగూరగంపలో కలిసిపోయిన మీ డీఎన్‌ఏ ప్రభావం మరి..! 

4. ఇన్నాళ్లూ మీ పవిత్ర వైరస్‌కి సిస్టమంతా ఖరాబైపోయింది, అర్జెంట్‌గా ‘బహుజన హితాయ’ యాంటీవైరస్‌ వేయకపోతే చాలా కష్టం.. క్లోజ్‌ ది క్రీ.పూ. విండోస్‌.. మీ కంట్రోల్‌కి.. ఆల్ట్‌.. డిలీట్‌..! లెటజ్‌ రీస్టార్ట్‌..!! 


ఇంత సూటిగా, ఇంత బలంగా, ఇంత కొత్తగా రాసిన వ్యాసాన్ని ఇటీవలి కాలంలో చదవలేదు. హ్యాట్స్ ఆఫ్ మల్లంపల్లి సాంబశివరావు అనే మా సాంబూ।

No comments:

Post a Comment