Saturday, 17 October 2015

దేశంలో ఉండాలంటే గొడ్డుని తినొద్దు!

దేశంలో ఉండాలంటే గొడ్డుని తినొద్దు! 
Updated :17-10-2015 03:22:11
  •  ముస్లింలపై హర్యానా సీఎం ఖట్టర్‌ వ్యాఖ్య 
  • పౌర అర్హతలను ఖట్టర్‌ నిర్ణయిస్తారా? 
  • మండిపడుతున్నప్రతిపక్షాలు 
  •  అవి వ్యక్తిగత వ్యాఖ్యలు : వెంకయ్య 
  •  ఖట్టర్‌ యూటర్న్‌.. అలా అనలేదని వివరణ 
చండీగఢ్‌, అక్టోబరు 16 : ‘‘ముస్లింలు ఈ దేశంలో ఉండవచ్చు. కాకపోతే గొడ్డు మాంసం తినడం మానేయాలి’’ అంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని అవమానించిన ఖట్టర్‌ను పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేయగా, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ‘‘మాకంటే పాకిస్థాన్‌కు వెళ్లడానికి టికెట్‌ ఉంది. మరి గోవాలోని క్రైస్తవులు ఎక్కడకు వెళతారు?’’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ఖట్టర్‌ను అరెస్టు చేయాలని ‘ఆప్‌’ డిమాండ్‌ చేసింది. బీఫ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన ఖట్టర్‌ వ్యాఖ్యలకు.. బీజేపీ నాయకత్వం మాత్రం దూరం పాటిస్తున్నది. ‘ఖట్టర్‌ వ్యాఖ్యలు సరికాదు. అవి ఆయన వ్యక్తిగతం. మాట్లాడి అర్థం చేయిస్తాను’’ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏమి తినాలి, తినకూడదనేది వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఇతరుల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఊహించని విధంగా వ్యతిరేకత రావడంతో ఖట్టర్‌ వెనక్కి తగ్గారు. ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూని తప్పుగా ప్రచురించారని వివరణ ఇచ్చారు. ‘‘నేను అలా అనలేదు. కానీ, ఎవరి మనసులైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు కోరడానికి సిద్ధమే’’నని పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూలో దాదరీ ఘటన సరికాదని ఖట్టర్‌ అన్నారు. ఏవో అపోహల వల్ల ఆ పొరపాటు జరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. దేశంలోని అత్యధికులకు గోవు, గీత, సరస్వతి అత్యంత పవిత్రమైన విషయాలని, అదే సమయంలో గోమాంస విసర్జన వల్ల ముస్లింల మత విశ్వాసాలకు వచ్చే ముప్పేం ఉండదని ఖట్టర్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ఖట్టర్‌ వ్యాఖ్యలను ఏఐసీసీ తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ఇది ప్రజాస్వామ్యానికి చెడ్డదినం. ఎవరు పౌరులు, ఎవరు కాదనేది ఇకపై ఖట్టర్‌జీ నిర్ణయిస్తారన్నమాట! ఇదేనా మోదీజీ కొత్త పాలనా నమూనా!’’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఎద్దేవా చేశారు. గొడ్డు మాంసం తినే ముస్లింలు పాకిస్థాన్‌కు వెళితే, అదే పని చేస్తున్న ఈశాన్య ఆదివాసీలను ఎక్కడకు పంపుతారని జేడీయూ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఖట్టర్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ‘ఆప్‌’ ఢిల్లీ చీఫ్‌ దిలీప్‌ పాండే మండిపడ్డారు.

No comments:

Post a Comment