అవార్డు వెనక్కి ఇవ్వడం.. అగౌరవం Updated :15-10-2015 01:38:30 |
తస్లీమాపై దాడిని ఖండించలేదేం?.. రచయితలకు అనుపమ్ ఖేర్ ప్రశ్న..
ముజఫర్‌నగర్ ఘటనపై నిరసనేదీ?: కేంద్రం
అవార్డు వెనక్కిచ్చేది లేదన్న బెంగాలీ రచయిత
పురస్కారాలు తిరిగి ఇచ్చేసిన మరో నలుగురు
న్యూఢిల్లీ, గువాహటి, అక్టోబరు 14: రచయితల నిరసన గళాలతోపాటు, వారి చర్యపై వ్యతిరేక స్వరాలూ బలపడుతున్నాయి. ‘ఎమర్జెన్సీ కాలంలో మీ నిరసనలు ఏమయ్యాయి?’ అని కేంద్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తుండగా, ‘రచయితల తీరు గౌరవప్రదంగా లేదు’ అని కొందరు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. అవార్డులు తీసుకోవచ్చు, తిరిగి ఇవ్వవచ్చుగానీ, అందుకు వారు ఎంచుకొన్న సమయమే అనుమానాలకు తావిచ్చేలా ఉందని యూపీ గవర్నర్ రామ్ నాయక్ అన్నారు. కాగా, రాజకీయ ప్రేరిత చర్యగా.. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.
‘తస్లీమా నస్రీన్‌ను అవమానించినప్పుడు.. అవార్డులు వెనక్కి ఇచ్చేయాలని వీరెవరికీ అనిపించలేదు. ఇదంతా ఒక వేలంవెర్రి తప్ప మరేమీ కాదు’ అని ఆక్షేపించారు. రచయితల వైఖరిలో ఒకింత అహంకారం కనిపిస్తున్నా.. వారి ఆగ్రహంలో న్యాయం ఉన్నదని మరో నటుడు నసిరుద్దీన్‌షా అన్నారు.
దాదరీ, కల్బుర్గీ హత్య కేసుల్లో ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం వల్లనే రచయితలు నిరసన తెలపాల్సి వస్తున్నదని గీత రచయిత జావేద్ అక్తర్ అన్నారు. అవార్డుకు ఉన్న విలువ, ప్రతిష్ట దెబ్బతినేలా నడుచుకోవద్దు అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. కాగా, ‘మీ నిరసనల్లోకి సాహిత్య అకాడమీని అనవసరంగా లాగొద్దు’ అని అసోమీ సాహిత్య సభ ఘాటుగా సూచించింది. మరోవైపు, అవార్డులు వెనక్కి ఇచ్చే పరంపర బుధవారం కూడా కొనసాగింది. హిందీ రచయిత్రి కృష్ణ సోబ్తీ తన సాహిత్య అకాడమీ అవార్డుని, ఫెలోషిప్‌ను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు.
బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ తన అవార్డుని వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. బెంగాలీ కవయిత్రి మందక్రాంత సేన్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించారు. యూపీ కవి దారూవాలా తన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. అయితే, మరో బెంగాలీ రచయిత సమరేశ్ మజుందార్ తన అవార్డును వెనక్కి ఇచ్చేది లేదని, అకాడమీని తప్పుబట్టడం సరికాదని అన్నారు.
|
No comments:
Post a Comment