శివ! శివ! ఈ వికృతమేమిటి? Updated :16-10-2015 00:40:38 |
చాలాకాలం క్రితమే మరాఠి, హిందీ భాషల్లో వెలువడుతున్న ‘మహానగర్’ దినపత్రిక అధిపతి, మరాఠీ సంచిక సంపాదకుడు నిఖిల్‌వాగ్లే, ఈ కాలమిస్టు కూడా సుధీంద్రపై జరిగినటు వంటి అఘాయిత్యానికి గురయ్యారు. 1991లో ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్‌కు నిరసనగా వాంఖడే స్టేడియంలో పిచ్‌ను శివసేన తవ్వివేసింది. శివసైనికుల మూర్ఖపు చర్యను ఎంత తీవ్రంగా ఖండించాలో అంత తీవ్రంగా ఖండిస్తూ నేను ఒక వ్యాసాన్ని రాశాను. పాత్రికేయునిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించడాన్ని సహించ లేకపోయిన శివసేన ముంబైలోని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (అప్పట్లో నేను ఆ పత్రికలో పనిచేస్తుండేవాణ్ణి) కార్యాలయం ఎదుట నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించింది. నన్ను నానావిధాలుగా దుర్భాషలాడింది. అదృష్టవశాత్తు నాకు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా ఇంటికి వెళ్ళడానికి అనుమతించింది. నిఖిల్‌కు ఇంత అదృష్టం లేకపోయింది. శివసేన పూర్తి పెత్తనం చెలాయించే దాదర్ ప్రాంతంలోని ఆయన కార్యాలయంపై దాడిచేశారు. అంతేకాదు ఆయనపై తీవ్రస్థాయిలో చేయి చేసుకున్నారు.
2009లో శివసేన మళ్ళీ అటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడింది. ముంబైలోని ఐబీఎన్ లోక్‌మత్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించింది. ఆ టీవీ చానెల్ ఎడిటర్‌గా నేను, ఆ దాడికి పాల్పడిన వారిపై కఠినచర్య తీసుకోవాలని పోలీసులను కోరాను. లాంఛనంగా కొంత మందిని అరెస్ట్ చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ బెయిల్ మంజూరు చేశారు. లోక్‌మత్‌పై దాడిచేసిన తమ కార్యకర్తలను శివసేన నాయకత్వం అమితంగా ప్రశంసించింది. అంతటితో అ వ్యవహారం తర్వాత దాడి వరకు ముగిసిపోయింది. 1966 నుంచి ఇప్పటివరకు శివసేన చర్రిత సిరాతో లిఖితమైనది మాత్రమే కాదు; రక్తంలో రాసినదే ఎక్కువ. తనతో విభేదించిన వారిని దాడులు, బెదిరింపులతో మౌనం వహించేలా చేయడం శివసేనకు ఆనవాయితీగా వస్తోంది. హత్యలకు పాల్పడడానికి అది వెనుదీయదు (1970లో కమ్యూనిస్టు నాయకుడు కృష్ణకాంత్ దేశాయిని హత్యచేసింది శివసేనేనన్న ఆరోపణ ఉన్నది). హింసను అంతిమ ఆయుధంగా చేసుకున్నవారు శివసైనికులు. ప్రతిసారీ వారు చట్టం బారి నుంచి సురక్షితంగా బయటపడుతూనే ఉన్నారు.
రాజ్యాంగానికి నిబద్దమై ఉండడానికి శివసేన దశాబ్దాలుగా తిరస్కరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొదట, శివసేన తీరుతెన్నులకు చట్టాన్ని అమలుపరిచే సంస్థలనే తప్పుపట్ట వలసివుంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎన్నో మార్లు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 153 (ఎ), (బి)లను ఉల్లంఘించారు. వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు చేశారు. అయినప్పటికీ బాల్‌ఠాక్రే తన సుదీర్ఘ ప్రజాజీవితంలో విద్వేష ప్రసంగం చేసినందుకు గాను ఒకే ఒక్కసారి (2007లో) అరెస్టయ్యారు. వెన్వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. అంతకు ముందు 1969లో ఒక దాడి కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 2007లో తన అరె్‌స్టకు కొద్ది రోజుల ముందు నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘నా పై ఎవరైనా చేయివేస్తే దేశమంతా అగ్నికీలల్లో మండిపోతుందని’ బాల్ ఠాక్రే అన్నారు. ఆయన్ని అరెస్ట్ చేయ డం జరిగింది. అయితే అవాంఛనీయమైనదేదీ సంభవించలేదు. అయితే ఆయన చేసిన హెచ్చరిక న్యాయవ్యవస్థను ప్రభావితం చేసినట్టుగా ఉంది. ఆయనపై కఠిన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా వెన్వెంటనే బెయిల్‌పై విడుదల చేయడం జరిగింది. చట్టం గురించి భయం లేనప్పుడు మీరు దాన్ని పదే పదే ఉల్లంఘించకుండా ఉంటారా?
రెండో వాస్తవమేమిటంటే మహారాష్ట్ర ప్రభుత్వాలు మొదటినుంచీ శివసేన నాయకత్వం పట్ల మృదు వైఖరితోనే వ్యవహరిస్తూ వచ్చాయి. ఢీ కొనడంకంటే లోపాయి కారీ ఒప్పందాలకే ప్రాధాన్యమిచ్చాయి. తమ మిత్రపక్షమైన శివసేనను అదుపు చేయడంలో బీజేపీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిస్సహాయులుగా ఉన్నారు. 1960వ దశకం తుదినాళ్ళ నుంచీ వసంతరావు నాయక్ మొదలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ ఇప్పుడు ఫడ్నవీస్ మాదిరిగానే శివసేన విషయంలో నిస్సహాయులుగా ఉన్నవారేననడంలో సందేహంలేదు. కొన్ని సందర్భాలలో అయితే శివసేనకు చురుగ్గా సహకరించారు. సుధీంద్రపై దాడి దేశానికి ‘సిగ్గుచేటు’ అని ఘోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, గతంలోనూ అటువంటి దాడులకు పాల్పడిన శివసేనపై తమ ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోలేదో వివరణ ఇవ్వాలి. ముంబై కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ గతంలో శివసైనికుడే కావడం విస్మరించలేని విషయం.
మూడో వాస్తవమేమిటంటే ముంబైలోని మరాఠీ ప్రజలలో నెలకొనివున్న అభ్రదతా భావం, ఆందోళనలను శివసేన తన రాజకీయ ప్రయోజనాలకు విజయవంతంగా ఉపయోగించుకొంటోంది. తమ అవస్థలకు ‘వారు’ అంటే ఇతరరాష్ట్రాల నుంచి వచ్చిన వారు కారణమని మరాఠీ ప్రజలు విశ్వసిస్తున్నారు. 1960వ దశకంలో ముంబైలోని వివిధ సంస్థలలోని గుమాస్తా ఉద్యోగాలన్నిటినీ దక్షిణ భారత రాష్ట్రాలవారే కైవశం చేసుకొనే వారు. ఈ పోటీలో మరాఠీలు పూర్తిగా వెనుకబడిపోయారు. బయటి రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తమ ఉద్యోగావకాశాలన్నిటినీ కొల్లగొడుతున్నారనే భావం అప్పటినుంచీ వారిలో గూడుకట్టుకుపోయింది. ‘మరాఠీ మనూ్‌స’గా తమకు ప్రాధా న్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరాఠీ ప్రజల అభద్రతా భావాన్ని శివసేన నాయకత్వం చక్కగా వినియోగించుకొంది.
ఇంతకూ ముంబై విశ్వనగరమేనా? శివసేన తన రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి హింసాత్మక పద్ధతులపై ఆధారపడడాన్ని చూస్తే ముంబై కాస్మోపాలిటన్ నగరమనేది ఒక కట్టు కథేనని అన్పించడంలేదూ? అంతేకాదు లౌకిక వాదుల నైతిక దివాళాకోరుతునాన్ని కూడా ఇది సూచిస్తుంది సుమా? సహనం, శాంతియుత సహజీవనం గురించి ఎవరు ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ తీవ్ర హిందూత్వ రూపంలో హింసాకాండ ఆమోదయోగ్యమవుతునే ఉంది కదా. ‘ప్రజల వెతలు, ఇక్కట్లను శివసేన చాటి చెప్పుతుందని’ ఒక మరాఠీ పత్రిక సంపాదకుడు నాతో అన్నారు. హిందువుల మనస్సులలో ‘ముసల్మాన్’ పట్ల అసహనం, అవిశ్వాసం ఇంకా బలంగా ఉన్నాయి. శివాజీ, అఫ్జల్‌ఖాన్‌ల ఉదంతాన్ని ఉపయోగించుకొని హిందువుల ‘రక్షకుడు’గా శివసేన తనకు తాను ప్రచారం చేసుకొంటోంది.
1992-93 మతతత్వ అల్లర్లు ఇందుకొక మంచి ఉదాహరణ. అప్పట్లో శివసేన చర్యలను ముంబై నగర ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఆ అల్లర్లలో పాల్గొనడం ద్వారా శివసేన ముంబైని ‘రక్షించిందని’, లేనిపక్షంలో ముస్లింలు దాన్ని స్వాధీనం చేసుకొనేవారని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విచారకరమైన విషయమేమిటంటే ‘లౌకిక వాదులు’ ఎవరూ ఈ అభిప్రాయాన్ని ఖండించలేదు. శివసైనికులు హిందువుల ‘రక్షకులు’ అన్న వాదనను సవాల్ చేయలేదు. ముంబై అల్లర్లపై విచారణ జరిపిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అరేబియా సముద్రంలోకి ఎలా విసరివేశారో గమనించండి.
శివసేన హింసాత్మక కార్యకలాపాల పట్ల ముంబై వాసుల్లో ప్రముఖులు మౌనంగా ఉండిపోవడం పరిపాటి అయిపోయింది. ఈ కారణంగానే శివసైనికులు పదేపదే రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. కారణమేదైనాగానీ శివసేన చర్యలకు ఆక్షేపణ తెలుపుతున్న వారు చాలా కొద్దిమంది మాత్రమే. కొత్త సినిమా ముహూర్త కార్యక్రమాలకు ఆహ్వానించడానికి ఠాక్రే గృహం మాతోశ్రీ వద్ద బారులు తీరేవారు రోజూ ఎంతో మంది కన్పిస్తుంటారు. క్రికెట్ క్రీడాకారులు ఠాక్రే ఆశీస్సులను కోరేవారు. కార్మిక సంఘాలతో సమస్యలేకుండా చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఠాక్రేలనే ఆశ్రయిస్తుంటారు. నటుడు, కాంగ్రెస్ ఎంపీ సునీల్‌దత్ సైతం తన కుమారుడు సంజయ్‌దత్‌ను ముంబై పేలుళ్ల కేసు నుంచి తప్పించడానికి బాలా సాహెబ్‌ను శరణు జొచ్చారు. భారతరత్న పురస్కార గ్రహీతలు లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్‌లు ముంబై వాసులు. అయినా ముంబె ౖనగర జీవితానికి సంబంధించి బాల్ ఠాక్రే తన జీవితకాలంలో వలే, మరణాంతరం కూడా గాడ్‌ఫాదర్‌గా ఉన్నారు. ముంబై నగర ప్రథమ కుటుంబం ఠాక్రేలదే!
తాజా కలం : 1989లో బాల్ ఠాక్రేతో నేను మొట్ట మొదటసారి సమావేశమయినప్పుడు ఆయన నన్ను మృదువుగా ఇలా అడిగారు: ‘నీవు, నాప్రియమైన స్నేహితుడు క్రికెటర్ దిలీప్ సర్దేశాయి కుమారుడువి. నీవు మహారాష్ర్టియన్‌వి, భారతీయుడివి. మరి నీవు మమ్ములను ఎలా విమర్శిస్తున్నావు?’. దానికి ‘అధర్మపరుల అంతిమ శరణం దేశభక్తి’ అని సమాధానమివ్వాలని ఉత్సాహపడ్డాను గానీ అందుకు ధైర్యం చేయలేకపోయాను.
- రాజ్‌దీప్ సర్దేశాయ్
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
|
No comments:
Post a Comment