Thursday, 15 October 2015

అజిత్‌ డోవల్‌ ఇండియా జేమ్స్‌బాండ్‌

అజిత్‌ డోవల్‌ ఇండియా జేమ్స్‌బాండ్‌ 
Updated :04-10-2015 03:07:00
  • భారత సైన్యం దూకుడు వెనుక సూత్రధారి..
  • పాక్‌ ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి సింహస్వప్నం

  • భారత సైన్యం ఈ ఏడాది జూన్‌ 9న మయన్మార్‌లో మాటువేసిన 20 మంది ఉగ్రవాదులపై విరుచుకుపడింది. వారిని మట్టుబెట్టింది. భారత సైన్యం చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

  • భారత భూభాగంలోకి పాక్‌ చొరబాట్లు ఇప్పటి వరకు సాగిన చరిత్ర. ఇటీవలి కాలంలో ‘భారత్‌ మా భూభాగంలోకి చొరబడుతోంది’ అంటూ పాక్‌ గగ్గోలు పెడుతోంది. ఇదే విషయాన్ని ఐరాసతో మొరపెట్టుకుంటోంది.

  • కశ్మీర్‌లో పాక్‌ అనుకూల ర్యాలీలు, నినాదాల గురించి తరచూ వింటుంటాం. సెప్టెంబరు 30న పత్రికల్లో వచ్చిన ఓ వార్త కశ్మీర్‌ అంశంలో కొత్త కోణాన్ని చూపింది. ‘మమ్మల్ని భారత్‌లో కలిపేయండి’ అంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్థానికులు ఆందోళన చేశారన్నది ఆ వార్త సారాంశం.

  • పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లో ఎప్పుడు ఎలాంటి అరాచకానికి పాల్పడుతారోనన్న ఆందోళన గతం. భారత సైన్యం అనుసరిస్తున్న వ్యూహాలతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు, వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఐఎ్‌సఐకి కంటి మీద కునుకు కరువైందన్నది ప్రస్తుతం.

న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి : దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాదులను మట్టుబెట్టే దూకుడు భారత సైన్యానికి ఎలా వచ్చింది? పాక్‌-భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి కారణమేమిటి? దీనికంతటికీ సూత్రధారి ఒకే ఒక్క వ్యక్తి. అతనే ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ కుమార్‌ డోవల్‌. భారత జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ). డోవల్‌ పేరు భారత్‌కన్నా పాక్‌లోనే సుపరిచితం! ఎన్‌ఎస్‌ఏగా ఆయన ఎంపికైనప్పుడు ‘పాక్‌ను విచ్ఛిన్నం చేయడానికి నియమితుడైన భారతీయుడు’ అంటూ అక్కడి పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. డోవల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు మోస్ట్‌వాంటెడ్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం పాక్‌నుంచి ఆఫ్ఘన్‌కు మకాం మార్చాడని సమాచారం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఐబీ డైరెక్టర్‌గా పనిచేసిన డోవల్‌ అపర చాణక్యుడిగా పేరొందారు. ఉత్తరాఖండ్‌లో 1945లో జన్మించిన ఆయన, 1968లో కేరళ కేడర్‌కింద ఐసీఎస్‌కు ఎంపికయ్యారు.
 
రహస్య గూఢచారి 
రహస్య గూఢచారి సినిమా చూస్తే కలిగే అనుభూతి డోవల్‌ గురించి తెలుసుకున్నా కలుగుతుంది. పంజాబ్‌, మిజోరం, కశ్మీర్‌లలో గూఢచారిగా ఉగ్రవాదుల నుంచి అనేకసార్లు దేశాన్ని రక్షించిన ఘనత ఆయన సొంతం. వాజ్‌పేయి హయాంలో 1999లో తాలిబన్‌లు భారత విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్‌కు తరలించినపుడు ప్రయాణికులను రక్షించడంలో డోవల్‌ కీలకపాత్ర పోషించారు. మిజోరంలో 1980లో ప్రత్యేక దేశం కోసం పోరాడిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధినేత లాల్‌డెంగా అనుచరులను లొంగదీసుకొని వారిచేతే తిరుగుబాటు చేయించి ప్రభుత్వంతో చర్చలకు ఒప్పించిన ఘనతా డోవల్‌దే. అంతేకాదు...1989, 92లలో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో బ్లూస్టార్‌, బ్లాక్‌ థండర్‌ ఆపరేషన్ల విజయంలోనూ ఆయన పాత్ర కీలకం. ఆలయంలోని ఖలిస్థాన్‌ తీవ్రవాదుల్లో కలిసిపోయేందుకు డోవల్‌ రిక్షావాలా అవతారమెత్తారు. పాక్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ ఏజెంటునని నమ్మించి వారిలో కలిసిపోయారు. తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నా రు? ఎలా దాడులు చేయాలి? అన్న సమాచారాన్ని పంపి స్వర్ణాలయం ఎక్కువ ధ్వంసంకాకుండా ఆపరేషన్‌ పూర్తి చేయించిన ఘనుడు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 1990లో పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదుల శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి తిరుగుబాటు తేవడంలోనూ కీలకపాత్ర పోషించారు. కశ్మీర్‌లో 1996 ఎన్నికలకు సానుకూల వాతావరణం సృష్టించడంలో డోవల్‌ కృషి ఎంతో ఉంది. పాక్‌లోనూ ఏడేళ్లు అండర్‌ కవర్‌ గూఢచారిగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో ఒకసారి ఆయనకు చిత్రమైన అనుభవం ఎదురైంది. ముస్లిం యువకుని గెట్‌పలో మసీదు వద్ద ఉన్న ఆయన్ను ఒక ముస్లిం మతపెద్ద పిలిచి.. ‘నువ్వు హిందువువా?’ అని అడిగారు. కాదని డోవల్‌ జవాబివ్వగా ఆ మతపెద్ద ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లి ‘నువ్వు కచ్చితంగా హిందువువే’నని డోవల్‌ చెవి తమ్మెకున్న రంధ్రాన్ని చూపాడు. ‘హిందువులు మాత్రమే చెవిపోగులు కుట్టించుకుంటారు. నువ్వు హిందువేననడానికి ఈ ఆధారం చాలు. నిజంచెప్పు’ అని గద్దించాడు. దీంతో పుట్టుకతో హిందువే అయినా ముస్లింగా మారానని డోవల్‌ అబద్ధమాడారు. ఇంతకూ డోవల్‌ను నిలదీసిన పెద్దమనిషీ హిందువే. తన బంధువులను ముస్లింలు చంపేశారని అందుకే మారువేషంతో ఉన్నానంటూ... తక్షణం చెవికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చాడట.
 
మోదీకి డోవల్‌ సన్నిహితుడు. ఆడ్వాణీకి అంతే దగ్గరివాడు. ఆడ్వాణీ 2009లో ప్రధాని అయి ఉంటే అప్పుడే ఎన్‌ఎస్‌ఏగా నియమితులయ్యేవారు. చివరకు మోదీ 2014 మే30న ఆ పదవిలో డోవల్‌ను నియమించారు. సంఘ్‌ మేధోవర్గంలో ఒకరుగా ముద్రపడిన డోవల్‌ మోదీకి అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. పాక్‌ ఉగ్రవాదుల గుండెల్లో డెవిల్‌గా ముద్రపడిన డోవల్‌ సైనికులకు మాత్రమే దక్కే కీర్తిచక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్‌ అధికారి. ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టాక ఇరాక్‌లో ఐఎస్‌ ఉగ్ర చెరనుంచి 45మంది భారత నర్సులను విముక్తులను చేయడంలోనూ డోవల్‌దే కీలకపాత్ర. శ్రీలంక ఎన్నికల్లో మహింద రాజపక్షే ఓటమి వెనుక డోవల్‌ చాణక్యనీతి ఎంతో ఉంది. ‘‘నాకు దేశమే ముఖ్యం.. దేశం కోసం అవసరమైతే హింసను ఆశ్రయించడంలో తప్పులేదు’’ ఇదీ డోవల్‌ సిద్ధాంతం.

No comments:

Post a Comment