Friday, 16 August 2019

మోదీ సర్కార్ మరచిన సత్యం

మోదీ సర్కార్ మరచిన సత్యం
17-08-2019 00:43:48

ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ పెట్టుబడి, ప్రైవేట్ వినియోగం, ఎగుమతులు ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీటిలో ఏ ఒక్కటీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడం లేదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, దాన్ని మార్చడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. శక్తిమంతమైన జాతీయవాదం ప్రయోజనకరమైన ఫలితాలను సాధించలేని రంగాలలో ఆర్థిక వ్యవస్థ ఒకటి. సరికదా ఆర్థికాభివృద్ధికి అది అవరోధమవుతున్నది.

భారత ప్రభుత్వ సార్వభౌమాధికారానికి ప్రతీక రాష్ట్రపతి భవన్. దీనికి ఒక కిలో మీటర్ పరిధిలోనే పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం; హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు మొదలైన కీలక మంత్రిత్వ శాఖలకు నెలవులైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉన్నాయి. ప్రధానమంత్రి అధికార నివాసం, ఇంకా ఉప రాష్ట్రపతి, స్పీకర్, త్రివిధ సాయుధ బలగాల ప్రధానాధికారుల అధికార నివాసాలు, అలాగే పలువురు పార్లమెంటు సభ్యుల బంగళాలు కూడా రాష్ట్రపతి భవన్‌కు అత్యంత చేరువలో ఉన్నాయి.
ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM



మరి ఈ అధికార వలయం(పవర్ సర్కిల్)లో ఉండే వారు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? జమ్మూకశ్మీర్ విభజన, పార్లమెంటు ఉభయ సభలలో వివాదాస్పద బిల్లులకు ఆమోదం పొందిన తీరుతెన్నులు, ప్రాంతీయ పార్టీల లొంగుబాటు, పాలనా వ్యవహారాలలో నరేంద్ర మోదీ ప్రాబల్యం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య పరిష్కారానికి జరుగుతోన్న తర్జన భర్జనలు, సుష్మా స్వరాజ్ అకాల మరణం మొదలైన విషయాల గురించే అధికార శక్తిమంతులందరూ మాట్లాడుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మినహా సమస్త అంశాలూ వారి పిచ్చాపాటీ, మాటా మంతీలో చోటు చేసుకుంటున్నాయి.

ఇదంతా రాష్ట్రపతి భవన్ కిలో మీటర్ పరిధిలోని వ్యక్తుల విషయం. రాష్ట్రపతి భవన్‌కు అన్ని దిశలలోనూ యాభై కిలో మీటర్ల దూరంలో ఉన్న జనావాసాలకు వెళ్ళండి. ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో నివశించేవారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ప్రధానంగా ఆర్థిక వ్యవహారాల గురించేనని మరి చెప్పనవసరం లేదు. వాస్తవ వేతనాల తగ్గుదల, వాస్తవ ఆదాయాల నిశ్చలత్వం, ఫ్యాక్టరీల మూసివేత, ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగాలకై నిరర్థక అన్వేషణ, వరదల బీభత్సం, కరువు ప్రాంతాల దైన్యం, నీటి కొరత, విద్యుత్ సరఫరాలో కోతలు, అసమానతల సమాజంలో మనుగడకై పోరాటాలు.. మొదలైనవి మాత్రమే ఆ సామాన్య భారతీయుల సంభాషణాంశాలు.

సరే, న్యూఢిల్లీకి 1150 కిలో మీటర్ల దూరంలో వున్న ముంబైకి వెళదాం. రిజర్వ్ బ్యాంక్, సెబి, స్టాక్ ఎక్ఛేంజెస్, అనేక లిస్టెడ్ కంపెనీల, బ్యాంకుల కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలకు ఆ మహానగరమే నెలవు కదా. మరి అక్కడ వారి సంభాషణలు ఒకే ఒక్క విషయం గురించే సాగడం కద్దు. ఆ ఏకైక అంశం డబ్బు, లేదా అది లేక పోవడం గురించి. బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ సూచీల పతనం, రూపాయి విలువ తగ్గుదల, బాండ్లపై ఆదాయం పెరుగుదల, ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు, కఠిన పన్నులు, వాటి వసూళ్ళకు అనుసరిస్తున్న అనుచిత పద్ధతులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, కఫే కాఫీ డే ప్రమోటర్ విజి సిద్ధార్థ ఆత్మహత్య మొదలైనవే ముంబై మహానగర మహాజనుల ప్రస్తుత పిచ్చాపాటీ.
ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకునే ఏ ప్రభుత్వమైనా, పేదల, శ్రామికుల సంభాషణల్లో ప్రాధాన్యం వహించే అంశాలపై అత్యంత శ్రద్ధ చూపుతుందని, చూపాలని నేను భావిస్తున్నాను. కార్మిక శ్రేణులు, ఇతర అంశాల గురించి ఎంతగా పట్టించుకున్నా, ఏ పార్టీకి ఓటు వేసినా ఆర్థిక వ్యవస్థ బాగోగులకు మాత్రమే వారు ప్రాధాన్యమిస్తారు. ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల మెరుగుదలపై వారు ఆశలు పెట్టుకుంటారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పట్టించుకునే అంశాలలో ఆర్థిక వ్యవస్థ చివరిదిగా కన్పిస్తోంది!

ఇక ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పతనమవుతూనే వుంది. 201౮–-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా ఆ వృద్ధిరేటు 6.8 శాతం కాగా, ఆ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 5.8 శాతంగా మాత్రమే ఉన్నది. ఈ దృష్ట్యా 2019–-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండగలదనే భరోసా కలగడం లేదు. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.9 శాతంగా మాత్రమే ఉండగలదని రిజర్వ్ బ్యాంక్ అంచనా. మరి మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంటే మనం అదృష్టవంతులమే. కీలక రంగాల పెరుగుదల రేటు 0.2 శాతానికి పడిపోయింది. గత యాభై నెలల్లో ఈ వృద్ధిరేటు ఇంత అత్యల్పంగా ఉండడం ఇదే మొదటిసారి. వస్తూత్పత్తి రంగానికి సంబంధించిన సకల పరిశ్రమల సామర్థ్య వినియోగం సగటున 70 శాతానికి తక్కువగానే ఉన్నది.

ఆసియాలో అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీ మన రూపాయే కావడం ఎంతైనా విచారకరం. డాలర్-– రూపాయి మారకం రేటు ఆగస్టులో 3.4 శాతం మేరకు తగ్గిపోయింది. కొత్త ప్రాజెక్టు (ప్రైవేట్, ప్రభుత్వ)లలో పెట్టుబడులు తగ్గిపోయాయి. జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో ఈ పెట్టుబడులు రూ. 71,337 కోట్లకు తగ్గిపోయాయి. గత పదిహేనేళ్ళలో ఈ పెట్టుబడులు ఇంత తక్కువగా ఉండడం ఇదే మొదటిసారి. అలాగే అదే త్రైమాసికంలో పూర్తయిన ప్రాజెక్టుల విలువ, గత ఐదేళ్ళలో అతి తక్కువ స్థాయికి- రూ.69,494 కోట్లకు పడిపోయింది.

సరుకుల (బొగ్గు, సిమెంట్, పెట్రోలియం, ఎరువులు మొదలైనవి) రవాణా ద్వారా రైల్వేస్‌కు రాబడులు 2019 ఏప్రిల్– -జూన్ త్రైమాసికంలో 2.7 శాతం మేరకు పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ రాబడుల పెరుగుదల 6.4 శాతంగా ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్-–జూన్ త్రైమాసికంలో (సరుకుల, సేవల) ఎగుమతులు, గత ఏడాది అదేకాలంలో జరిగిన వాటి కంటే 3.13 శాతం పెరిగాయి. దిగుమతులు 0.45 శాతం మేరకు తగ్గిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని ఈ పతనం సూచిస్తుంది.

వినియోగం మున్నెన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. 2019–-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలు 23.3 శాతానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11.7 శాతం పడిపోయాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 9.5 శాతం పడిపోయాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 14.1 శాతం పడిపోయాయి. జూలై నెలలో ఈ అమ్మకాల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. ఆటోమొబైల్ రంగం 2,30,000 ఉద్యోగాలను, 286 డీలర్ షిప్‌లను కోల్పోయిందని పారిశ్రామిక వేత్తల సంఘాలు తెలిపాయి. భవన నిర్మాణ రంగంలో 2019 మార్చి నాటికి అమ్మకం కాని యూనిట్లు 12,80,000.

ప్యాకేజ్డ్ ఫుడ్స్, సబ్బులు, శీతల పానీయాలు మొదలైన వినియోగ సరుకుల విక్రయాల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. హిందుస్థాన్ లివర్, డాబర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆసియన్ పెయింట్స్ మొదలైన కంపెనీల పరిమాణాత్మక పెరుగుదల రేటు 2019 ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో, గత ఏడాది అదేకాలంలో సదరు కంపెనీల పరిమాణాత్మక పెరుగుదల రేటులో సగం కంటే తక్కువగా ఉన్నది. టోకు ధరల సూచీ గత జూలైలో 1.08 శాతం వద్ద ఉన్నది. తయారీ రంగం ద్రవ్యోల్బణం 0.34 శాతంగా ఉన్నది. ఇవి శుభ సూచనలు కావు. తక్కువ డిమాండ్‌కు మాత్రమే సూచనలు. కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను రాబడి 2019–-20 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో 1.4 శాతం మాత్రమే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ వసూళ్లు 22.1 శాతం. దీన్ని బట్టి కార్పొరేట్ సంస్థల, వ్యక్తుల ఆదాయాలు తక్కువగా ఉన్నాయని, వారు తక్కువ ఖర్చు చేస్తున్నారని విశదమవుతుంది.

ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు : ప్రభుత్వ వ్యయం, ప్రైవేట్ పెట్టుబడి, ప్రైవేట్ వినియోగం, ఎగుమతులు. వీటిలో ఏ ఒక్కటీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడం లేదు. విఖ్యాత ఆర్థిక వేత్తలతో సహా ఎంతో మంది ఎన్నో సార్లు ఈ వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ఇంకా చెబుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం ఆ విజ్ఞులు చెబుతున్న దాన్ని వినడానికి గానీ, అర్థం చేసుకోవడానికి గానీ, ఆ పరిస్థితిని మార్చడానికి గానీ సుముఖంగా లేదు. శక్తిమంతమైన జాతీయవాదం ప్రయోజనకరమైన ఫలితాలను సాధించలేని రంగాలలో ఆర్థిక వ్యవస్థ ఒకటి. సరికదా ఆర్థికాభివృద్ధికి అది అవరోధమవుతుంది.


పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

No comments:

Post a Comment