Friday, 23 August 2019

కశ్మీర్ నేతల విడుదల కోసం ఢిల్లీలో డీఎంకే ధర్నా

కశ్మీర్ నేతల విడుదల కోసం ఢిల్లీలో డీఎంకే ధర్నా
23-08-2019 10:41:31

చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లో గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకు లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం డీఎంకే కూటమి ఎంపీలు ధర్నా చేశారు. ఇందులో డీఎంకే మిత్రపక్షాలు సహా 15 పార్టీలకు చెందిన సుమారు వందమంది ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. ఆ మేరకు పార్లమెంట్‌లో తీర్మానాలు చేసి ఆమోదింపజేసింది. ఆర్టికల్‌ 370 రద్దుపట్ల డీఎంకే, కాంగ్రెస్‌, వామపక్షాలు, డీపీఐ, ఎండీఎంకే, ముస్లింలీగ్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు జరుగకుండా వుండేందుకుగాను బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఉమర్‌ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి మోహబూబా ముఫ్తీ తదితర నాయకులను గృహనిర్బంధంలో వుంచింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈనెల 22న ఢిల్లీలో డీఎంకే కూటమి ఎంపీలు ధర్నా నిర్వహించనున్నారని ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదాను ఉపసంహ రించుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో కశ్మీర్‌ నేతలను గృహనిర్బంధంలో వుంచడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారని, భావస్వేచ్ఛకు తావులేకుండా చేశారని ధ్వజమెత్తారు.

రెండువారాలకు పైగా జమ్మూకశ్మీర్‌కు చెందిన రాజకీయ నేతలంతా గృహనిర్బంధంలో ఉంటూ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుం డా ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గృహనిర్బంధంలో ఉన్న కశ్మీర్‌ నేతలను తక్షణమే విడుదల చేయాలని, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద డీఎంకే పార్లమెంట్‌ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ సీనియర్‌ పార్లమెంటు సభ్యుడు టీఆర్‌ బాలు నాయకత్వం వహించారు. డీఎంకే ఎంపీలు దయానిధిమారన్‌, ఎ.రాజా, తిరుచ్చి శివ, టీకేఎస్‌ ఇలంగోవన్‌, ఆర్‌ఎస్‌ భారతి తదితరులు పాల్గొన్నారు.

ఈ ధర్నాలో కాంగ్రెస్‌ జాతీయ కమిటీ నాయకుడు ముకుల్‌ వాస్నిక్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఆ పార్టీ ఎంపీ తిరునావుక్కరసర్‌, సీపీఎం జాతీయ కమిటీ కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌, నేషనల్‌ కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌, సమాజ్‌వాది, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎండీఎంకే, డీపీఐ, సహా 15 పార్టీలకు చెందిన ఎంపీలు సుమారు వందమంది పాల్గొన్నారు. ఈ ఆందోళనలో కశ్మీర్‌ నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఎంపీలంతా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా పోలీసులు గట్టి భ్రదతా ఏర్పాట్లు చేపట్టారు.
తీర్మానాలు...
డీఎంకే కూటమి ఎంపీల ఆందోళన సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేతలంతా కలిసి కొన్ని తీర్మానాలు చేశారు. జమ్మూకశ్మీర్‌ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోకుండా, ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సంప్రదించకుండా ఆర్టికల్‌ 370 రద్దు వల్ల ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సందర్భంలో ఆ రాష్ట్ర ప్రజలకు తామంతా అండగా వుంటామని ఓ తీర్మానం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌కు చెందిన రాజకీయ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులను నిర్బంధించడం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్టు మరొక తీర్మానం చేశారు.

ఇక గృహనిర్బంధంలో వున్న జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు సహా రాజకీయ పార్టీల నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మరొక తీర్మానం చేశారు. ఆ రాష్ట్రంలో విధించిన నిషేధాజ్ఞలను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థ సదుపాయాలను నిలిపివేశారని, ఆ రాష్ట్ర ప్రజలు తమ బంధువులతో, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా వీలులేకున్నదని పేర్కొంటూ, ఆ రాష్ట్ర మంతటా ఇంటర్నెట్‌, ఫోన్‌ సదుపాయాలు కల్పించి సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ మరొక తీర్మానం చేశారు.

No comments:

Post a Comment