Thursday, 14 November 2019

అజిత్ దోవల్ నివాసంలో హిందూ, ముస్లిం ప్రతినిధుల సమావేశం

అజిత్ దోవల్ నివాసంలో హిందూ, ముస్లిం ప్రతినిధుల సమావేశం
10-11-2019 18:34:43

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలో హిందూ సంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతల కీలక సమావేశం జరిగింది. అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి హిందూ సంఘాల నుంచి 18 మంది ప్రతినిధులు, ముస్లిం సంఘాల నుంచి 12 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం లంచ్‌తో ముగిసింది.

అయోధ్యపై తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ తీర్పును ఆసరాగా చేసుకొని దేశం లోపల, వెలుపల కొన్ని శక్తులు లేనిపోని ఉద్రిక్తతలను రేపే అవకాశం ఉందని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని మేధావులు అభిప్రాయపడ్డట్లు సమాచారం. సమాజంలో ఎలాంటి ఉద్రిక్తతలకు చోటు లేకుండా, శాంతిభద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తామని దోవల్‌కు మేధావులు స్పష్టం చేశారు.

సుప్రీం తీర్పు వెలువడగానే ఇరు వర్గాలు, భారతీయులు తమ బాధ్యతను, సంయమనాన్ని ప్రదర్శించారని ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు హిందూ ప్రతినిధులుగా అవధీశానంద స్వామీజీ, స్వామీ పరమార్థానంద, పేజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీతో పాటు తదితరులు హాజరు కాగా, ముస్లిం సమాజం నుంచి మౌలానా ఆజాద్ యూనివర్శిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అఖ్త్రుల్ వసే, నవీద్ హమీద్, మౌలానా సయీద్ అహ్మద్ నూరీతో పాటు తదితరులు హాజరయ్యారు.


No comments:

Post a Comment