Sunday, 5 April 2020

ఒక క్రోనాలజీ మన ముందుకు వచ్చింది

ఒక క్రోనాలజీ మన ముందుకు వచ్చింది
ఆ క్రోనాలజీ ప్రకారం మార్చి 13వ తేదీన ప్రభుత్వం కరోనా వైరస్ హెల్త్ ఎమర్జన్సీ కాదని ప్రకటించింది.
అదే రోజు యాధృచ్ఛికంగా తబ్లీగ్ ఇజ్తిమా ప్రారంభం అయ్యింది.
మార్చి 15వ తేదీన ఇజ్తిమా ముగిసింది
ఈ క్రోనాలజీ ప్రకారం తబ్లీగ్ ఇజ్తిమా నిషేధాజ్ఞలు ఉన్న సమయంలో జరగలేదు.
కానీ –
తబ్లీగ్ జమాఅత్ ఇస్లాం ధర్మం పట్ల ముస్లిముల్లో అవగాహన కలిగించే సంస్థ
ఈ ఇజ్తిమాలు అంటే సమావేశాలు అలాంటి కార్యక్రమాలే.
అంటువ్యాధుల గురించి ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన మాట ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను.
అంటువ్యాధి ప్రబలిన ప్రాంతంలోకి ప్రవేశించవద్దు. మీరున్న ప్రాంతంలో అంటువ్యాధి ప్రబలితే ఆ ప్రాంతం వదిలి బయటకు వెళ్ళవద్దు...ఈ మాటలు ఇస్లాం ప్రవక్త చెప్పిన మాటలు
క్లుప్తంగా చెప్పాలంటే అంటువ్యాధి ప్రబలినప్పుడు ప్రయాణాలు చేయరాదన్నది ఈ మాటల అంతరార్థం
మార్చి నెలలో ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. తబ్లీగ్ జమాఅత్ ఈ ఇజ్తిమా నిర్వహించడం ద్వారా వివిధ దేశాల్లోని ప్రజలు అటూ ఇటూ ప్రయాణాలు చేయడానికి కారణమయ్యింది.
ఎందుకిలా చేశారు?
ఇస్లాం గురించి అవగాహన కల్పించవలసిన వారు ఇస్లాం బోధనలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించారు?
తబ్లీగ్ ఇజ్తిమాకు అవసరమైన అనుమతులు లభించి ఉండవచ్చు, చట్టాన్ని అతిక్రమించడం ఎక్కడా జరగలేదన్నది కూడా నిజమే కావచ్చు.
కాని –
కరోనా వ్యాపించే ప్రమాదఘంటికలు వినిపిస్తున్నాయన్నది కాదనలేం కదా
దేశంలో ముస్లిములపట్ల విద్వేషం రెచ్చగొట్టే శక్తులు చురుగ్గా పనిచేస్తున్నాయన్నది నిజమే కదా
మతతత్వశక్తులు ముస్లిములపై దాడి చేసే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నది తెలిసిన విషయమే కదా
ఈ నేపథ్యంలో విమర్శకులకు అవకాశమిచ్చేలా, ఆ విధంగా పూర్తి ముస్లిం సమాజాన్ని దోషిగా నిలబెట్టడానికి అవకాశమిచ్చేలా ఈ ఇజ్తిమా ఎందుకు నిర్వహించారు?
ఇస్లాం బోధనలు స్పష్టంగా ఉన్నప్పుడు. అంటువ్యాధి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇజ్తిమాను ఎందుకు వాయిదా వేయలేదు?
తబ్లీగ్ జమాఅత్ చట్టపరంగా ఎలాంటి తప్పు చేయలేదని వాదించవచ్చు
కాని-
నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా మీరు చేసింది సముచితమా??

No comments:

Post a Comment