Thursday, 16 April 2020

ఇళ్లలోనే రంజాన్‌ నమాజులు, తరావీలు

ఇంట్లోనే నమాజులు
జమాతే ఇస్లామి హింద్‌ విజ్ఞప్తి

ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలి

వక్ఫ్‌ బోర్డుకు కేంద్ర మంత్రి నక్వీ ఆదేశం



న్యూఢిల్లీ/హైదరాబాద్‌/చార్మినాల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం ఆయన రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డుల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘‘కరోనా విజృంభిస్తున్నందున దేశంలోని దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు, ఇతర మతపరమైన స్థలాల్లో మత కార్యక్రమాలు, సభలు నిలిపివేశాం. మసీదుల్లో, ఇతర ముస్లిం మత స్థలాల్లోనూ నిలిపివేయడం జరిగింది’’ అని నక్వీ తెలిపారు. ఈ కాన్ఫరెన్సులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారు.

కాగా, ముస్లింలు లాక్‌డౌన్‌ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ గడప దాటి బయటకు రావద్దని జమాతే ఇస్లామి హింద్‌ తెలంగాణ అధ్యక్షుడు మౌలానా హమీద్‌ మహ్మద్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంటిపట్టునే నమాజ్‌ చదువుకోవడం షరియత్‌కు విరుద్దమేమి కాదన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఇంటికే పరిమితం కావాలని, తరావీతో పాటు ఇతర నమాజులు, ఇఫ్తార్‌ కార్యక్రమాలు ఇంట్లోనే నిర్వహించాలని ఉలేమాలు, ముఫ్తీల సంస్థ జామియా  నిజామియా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

No comments:

Post a Comment