Friday, 24 April 2020

కరోనా విపత్తులో జకాత్ ఉపశమనం - వాహెద్

కరోనా విపత్తులో జకాత్ ఉపశమనం
- వాహెద్
...................................................
ముస్లిములు ప్రతి ఏటా జకాత్ చెల్లిస్తుంటారు. ఎవరూ వారికి ప్రత్యేకంగా ఈ విషయం గుర్తు చేయనవసరం లేదు. ఎవరికివారు వ్యక్తిగతంగా కూడా చెల్లిస్తుంటారు. వ్యవస్థీకృతంగా జకాత్ నిధులు సేకరించి సంక్షేమకార్యక్రమాలకు ఖర్చు చేయడం కూడా జరుగుతుంటుంది.
ఈ సంవత్సరం విచిత్రంగా ప్రభుత్వ వర్గాల నుంచి జకాత్ చెల్లించి పేదలను ఆదుకోవాలనే అప్పీళ్ళు వినవచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ అప్పీలు చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ బోధనలను ముస్లిములు ఆచరించాలని, తమ సంపదలో రెండున్నరశాతం పేదల కోసం ఖర్చు చేయాలని, కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ముస్లిములు పి.ఎం.కేర్స్ నిధికి లేదా సి.ఎం.రిలీఫ్ నిధికి విరాళంగా కూడా ఇవ్వవచ్చని ఆయన అప్పీలు చేశారు.
రమజాన్ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. నిజానికి రమజాన్ కన్నా ముందే కరోనా వచ్చింది. రమజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి సాధారణంగా ముస్లిములు జకాత్ రమజాన్ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాదదృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది పేదలు లాక్ డౌన్ వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన తర్వాత చాలా మంది ముస్లిములు పేదలకు అన్నదానాల కార్యక్రమాలు ప్రారంభించారు. దాంతో పాటు జకాత్ లెక్కించి పేదల కోసం ఖర్చు పెట్టడానికి రమజాన్ వచ్చే వరకు ఆగవలసిన పనిలేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి వెంటనే జకాత్ లెక్క కట్టి చెల్లించాలని కూడా చాలా మంది ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావం కూడా ముస్లిములపై పడింది. అనేకమంది తమ తమ జకాత్ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేయడం ప్రారంభమయ్యింది.
జకాత్ అంటే ఏమిటి? అనేది చాలా మంది ముస్లిమేతర సోదరులకు తెలియకపోవచ్చు. కాబట్టి క్లుప్తంగా జకాత్ గురించి తెలుసుకుందాం. జకాత్ ముస్లిములు తప్పనిసరిగా చెల్లించవలసిన ధార్మిక విధి. ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణన పొందిన ఐదు మౌలికవిధుల్లో ఇది ఒకటి. అయితే ముస్లిములందరిపై జకాత్ విధి కాదు. జకాత్ అనేది ఆర్థిక ఆరాధన. కాబట్టి స్తోమత ఉన్న ముస్లిములకు మాత్రమే విధి. స్తోమత ఉన్న ముస్లిములంటే ఎవరనే ప్రశ్నకు కూడా ఖచ్చితమైన సమాధానముంది. ఒక వ్యక్తి వద్ద ఒక సంవత్సర కాలం అతని ఖర్చులు పోగా అతని వద్ద మిగిలిన సంపద ఆధారంగా జకాత్ లెక్కిస్తారు.
స్తోమత కలిగిన ముస్లిం అంటే ఏడున్నర తులాల బంగారం లేదా యాభైరెండున్నర తులాల వెండికి సమానమైన సంపద ఒక సంవత్సరం పాటు తన వద్ద ఉన్న వ్యక్తి ఆ సంపదపై రెండున్నర శాతం జకాత్ చెల్లించాలి. అంటే ఏడున్నర తులాల బంగారం వెల లేదా యాభై రెండున్నర తులాల వెండి వెల ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది జకాత్ చెల్లించడానికి నిసాబ్ గా భావించాలి. ఇప్పుడు మార్కెటు ధరల ప్రకారం ఏడున్నర తులాల బంగారం కన్నా యాభై రెండున్నర తులాల వెండి ధర తక్కువగా ఉంది. కాబట్టి యాభై రెండున్నర తులాల వెండి విలువ కన్నా ఎక్కువ సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజు వెండి విలువను బట్టి లెక్కేస్తే 23 వేల రూపాయల సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది.
జకాత్ పేదవారికి చెల్లించాలి. సాధారణంగా అత్యంత పవిత్రమైన రమజాను మాసంలో జకాత్ కూడా చెల్లిస్తుంటారు. కాని కరోనా వచ్చిపడిన ఈ విపత్కర పరిస్థితిలో చాలా మంది రమజాను కన్నా ముందే జకాత్ చెల్లింపులకు సిద్ధపడ్డారు. అనేకమంది నిరుపేదలకు ఆహారం అందించారు.
స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జకాత్ చెల్లిస్తాడు. కాని దేశంలో ముస్లిముల పరిస్థితి ఎలా ఉందో సచార్ కమిటి, రంగనాథ మిశ్రా కమీషన్ వంటివి చాటి చెప్పాయి. చాలా విషయాల్లో ముస్లిములు దళితుల కన్నా దయానీయమైన స్థితిలో ఉన్నారు. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే, ఇక్కడి ముస్లిం జనాభాలో కేవలం 2 శాతం మాత్రమే సంపన్నులుగా చెప్పవచ్చు. అంటే కోటి నుంచి వందకోట్ల సంపద కలిగిన వారు. కాగా 63 శాతం ముస్లిములు దారిద్ర్యరేఖకు దిగువన బతుకుతున్నారు. వీరంతా ప్రభుత్వ సంక్షేమపథకాల ద్వారా ఎలాగోలా బతుకీడుస్తున్నారు. కేవలం రెండు నుంచి మూడు శాతం ముస్లిములు మాత్రమే వార్షికాదాయం పాతికలక్షలు లేదా అంతకన్నా ఎక్కువ కలిగి ఉన్నారు. పది నుంచి పదిహేను శాతం ముస్లిములు మధ్యతరగతిలో ఉన్నారు. వీరి వార్షికాదాయం రెండు నుంచి ఐదు లక్షల లోపే ఉంది. దాదాపు 20 శాతం ముస్లిములు దిగువతరగతి ముస్లిములు. లక్షరూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం కలిగిన వారున్నారు. జకాత్ నిధులను సద్వినియోగానికి సంబంధించి అవసరమైన డాటాను హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సేకరించింది. ఈ డాటా ప్రకారం హైదారబాద్ నగరంలో 36 లక్షల 30 వేల మంది ముస్లిములు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. 11 లక్షల 60 వేల మంది దిగువ మధ్యతరగతి. లక్షా 70 వేల మంది ఎగువ మధ్యతరగతి. లక్షా ఇరవై వేల మంది సంపన్నులు. అంటే వార్షికాదాయం కోటి కన్నా ఎక్కువ ఉన్నవారు. 29 లక్షల 30 వేల మంది రోజు కూలీలు. 7 లక్షల 30 వేల మంది మహిళలు వితంతువులు లేదా మగదిక్కు లేని వారు. జకాత్ నిధులతో ఈ జనాభాలో అర్హులైన వారిని ఆదుకోవచ్చును.
ముస్లిములు వ్యక్తిగతంగా జకాత్ నిధులు పేదవారికి అందించడం చేస్తుంటారు. కొన్ని సంస్థలు జకాత్ నిదులను సేకరించి సంక్షేమకార్యక్రమాలకు వెచ్చిస్తుంటాయి. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అలాంటిదే. అలాగే అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్ కూడా అలాంటిదే. ఈ సంస్థ కూడా తనదైన సర్వే నిర్వహించింది. 2019లో ఈ సర్వే వివరాలను ప్రకటించారు. ఈ సర్వే ప్రపంచవ్యాప్తంగా జరిపారు. దేశంలోని 175 పట్టణాల్లో సర్వే జరిగింది. ఈ సర్వేలో తెలిసిన విషయాలేమంటే, జకాత్ చెల్లించవలసిన వారిలో 84 శాతానికి పైబడి జకాత్ చెల్లిస్తున్నారు. మిగిలిన 16 శాతం జకాత్ చెల్లించకపోడానికి అనేక కారణాలున్నాయి. అయితే జకాత్ ఛెల్లించేవారిలో జకాత్ గురించి పూర్తి పరిజ్ఞానం కలిగిన వారు కేవలం 30 శాతం మాత్రమేనని కూడా తెలిసింది. చాలా మంది వ్యక్తిగతంగా జకాత్ ఇస్తున్నారు. దాదాపు 60 శాతం మంది ప్రతి సంవత్సరం జకాత్ ఇస్తున్నవారికే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. ఒక ధార్మిక విధిని నిర్వర్తించే భావనతో జకాత్ చెల్లిస్తున్నారే కాని, జకాత్ తీసుకున్న వారి జీవితాల్లో ఆర్థికంగా ఏమైనా మార్పు వస్తుందా లేదా అన్నది గమనించడం లేదు. అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్స్ జకాత్ నిధులు సద్వినియోగమయ్యేలా చూడ్డానికి ప్రయత్నిస్తోంది. అలాగే అనేక ముస్లిం సంస్థలు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. జమాఅతె ఇస్లామీ హింద్ దేశంలో ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. 2016లో ఏటా దేశంలో ఎంత జకాత్ పంపకం జరుగుతుందన్నది లెక్కించే ప్రయత్నం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ముస్లిం అప్ లిఫ్ట్ మెంట్ ఈ ప్రయత్నాలు చేసింది. దాదాపు 30వేల కోట్ల రూపాయల జకాత్ నిధులు పంపిణీ అవుతున్నాయని తెలిసింది. అయితే చాలా వరకు జకాత్ పంపకం వ్యక్తిగత స్థాయిలో జరిగిపోతుంది కాబట్టి, నగదు రూపంలో జకాత్ ఇస్తున్నారు కాబట్టి ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా చాలా భారీ మొత్తంలో జకాత్ నిదులు ప్రతి సంవత్సరం పంపిణీ అవుతున్నాయి. దేశంలో పేదరికాన్ని పారదోలడానికి జకాత్ ఎంతైనా ఉపయోగపడుతోంది. దేశఆర్థికవ్యవస్థకు జకాత్ ఎంతో ఉపయోగపడుతోంది. నిజం చెప్పలంటే రమజాన్ మాసం ఆర్థికవ్యవస్థకు గొప్ప వేగాన్నిస్తుంది. రమజాన్ మాసంలో భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ముస్లిములు ఈ మాసంలో దానధర్మాలకు ఖర్చు పెట్టడమే కాదు, షాపింగ్ కోసం కూడా ఖర్చు పెడతారు. మిగిలిన పదకొండు నెలల్లో జరిగే వ్యాపారం కన్నా ఈ ఒక్క నెలలో జరిగే వ్యాపారం చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యం మార్కెటులో చెలామణీలోకి వెళుతుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్ధికవ్యవస్థ మరింత బలం పుంజుకుంటుంది.
కాని ఈ సారి రమజాన్ మాసం కోవిద్ 19 లాక్ డౌన్ లో వచ్చింది. రమజాన్ మాసంలో నమాజులకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. నెలరోజులు ఉపవాసాలు ఉంటారు. ఈ నెలలోనే చాలా మంది జకాత్ చెల్లిస్తారు. అంతేకాదు, ఈ నెలలో తమ మనోవాంఛలు, కోరికలు, ఆకాంక్షలతో సంఘర్షిస్తూ సన్మార్గాన నడిచే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలే అసలైన జిహాద్. అంటే మనిషి తన మనోవాంఛలతో పోరాడి సరయిన మార్గాన నడవడానికి చేసే ప్రయత్నం.
కాని ఈ సంవత్సరం లాక్ డౌన్ , భౌతిక దూరాల నియమాలను పాటించడం చాలా అవసరం. అంటు వ్యాధుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళరాదని, ఆ ప్రాంతానికి బయటి వారు రాకూడదని ప్రవక్త స్పష్టంగా చెప్పారు. లాక్ డౌనంటే ఇదే కదా. అలాగే అంటువ్యాధి ఉన్న వ్యక్తితో కరచలనం చేయరాదని కూడా ఆయన నివారించారు. ఒక సందర్భంలో అంటువ్యాధి కలిగిన ఒక వ్యక్తితో కరచలనం చేయనవసరం లేదని, దూరంగా ఉండడం కరచలనం చేయడంతో సమానమని చెప్పారు. ఇదే భౌతిక దూరం పాటించడం. ఈ రెండు ఇస్లాం ధర్మం బోధిస్తోంది. కాబట్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కు కట్టుబడి, భౌతికదూరం పాటిస్తూ రమజాన్ మాసాన్ని దైవారాధనలో గడపవలసి ఉంది. ఆ విధంగా కరోనా మహమ్మారిని నిరోధించాలి. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలు చేయరాదు. ఎవరి ఇండ్లలో వారు ఇఫ్తార్ చేసుకోవాలి. సామూహిక ప్రార్థనలు చేయరాదు. ఎవరి ఇండ్ల్లో వారు నమాజులు చదువుకోవాలి. ఇలా ఇంటికి పరిమితం కావడమే ధర్మాన్ని పాటించడం. ఇదే దైవాభిష్టం కాబట్టి దైవాభిష్టానికి కట్టుబడాలి. కరచలనాలు ఇప్పుడు నిషిద్ధం. దానికి బదులు ఒకప్పుడు ఒట్టోమాన్ సామ్రాజ్య కాలంలో ప్రజలు ఒకరికొకరు అభివాదం తెలియజేయడానికి తమ చేయి గుండెలపై పెట్టుకుని అభివాదం తెలిపేవారు. ఆ పద్ధతి పాటించాలని చాలా మంది అప్పీలు చేశారు.
ఇక జకాత్ విషయానికి వస్తే, ఇప్పుడు జకాత్ 60వేల కోట్ల రూపాయలకు పైబడి పంపిణీ అవుతుందని పలువురి అంచనా. జకాత్ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలు, అన్నదానాలు, ఆహారపంఫిణీ వంటివి కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చవుతాయని అంచనా. కోవిద్ 19 సంక్షోభ సమయంలో ఈ జకాత్ నిదులను సరయిన విధంగా ఖర్చు పెడితే పేదవారికి ఎంతైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా కారణంగా, లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి, నగరాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు, తమ తమ ఊళ్ళకు కాలినడకన బయలుదేరిన అనేకమంది కూలీల దీనావస్థను చాలా మంది చూశారు., ఇలాంటి ఎంతో మంది నిరుపేదలను ఈ నిధులతో ఆదుకోవచ్చు. అలాగే ఈ సారి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే అవకాశాలు లేవు, కాబట్టి ముస్లిములు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారపోట్లాలు అన్నార్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ సొమ్ము ఇవ్వడం ద్వారా రమజాన్ శుభాలను పొందవచ్చు.
ఇస్లాం ధర్మం మనిషిపై కాఠిన్యాన్ని విధించదు. అవసరమైన మినహాయింపులు ఎల్లవేళలా ఇస్తుంది. సౌదీ అరేబియాకు చెందిన గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజల్ షేక్ భౌతిక దూరం విషయంలో మాట్లాడుతూ పండుగ రోజు వరకు పరిస్థితి కుదుట పడకపోతే, పండుగ నమాజు కూడా సామూహికంగా చేయవలసిన అవసరం లేదని అన్నారు. అప్పటి వరకు పరిస్థితి చక్కబడాలని ఆశిద్దాం.
ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జకాత్ ఫంపిణీ చాలా భారీస్థాయిలో జరుగుతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే మానవీయ సహాయం విషయంలో జకాత్ నిధులే ఎక్కువ అని చెప్పాలి. కొన్నేళ్ళ క్రితం నాటి లెక్కల ప్రకారం, అంటే వ్యవస్థీకృతంగా లెక్కల్లో కనిపించిన జకాత్ పంఫిణీని లెక్కిస్తేనే 500 నుంచి 600 బిలియన్ డాలర్ల జకాత్ నిధులు ఏటా పంపిణీ అవుతున్నట్లు తెలిసింది. ఇక అసంఘటితంగా, వ్యక్తిగత స్థాయిలో జరిగే జకాత్ పంపకాలను కూడా కలుపుకుంటే ఇది ట్రిలియన్ల డాలర్లలో ఉంటుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ లో మొత్తం 57 దేశాలున్నాయి. ఇందులో 24 దేశాలకు మానవీయ సహాయం అవసరం ఉంది. ఈ సహాయం జకాత్ నిధుల ద్వారా అందుతోంది.
కరోనా కాలంలో పేదలను ఆదుకోడానికి జకాత్ నిధులను వెచ్చించడం, ఇఫ్తార్ పార్టీలకు వెచ్చించే సొమ్మును ఆహారపోట్లాలు పేదసాదలకు పంచిపెట్టడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వెచ్చించడం ద్వారా ఈ రమజాన్ లో జకాత్ మానవీయ సహాయానికి ఎంత గొప్ప సాధనమో, ప్రపంచంలో పేదరికాన్ని తొలగించడంలో ఇది ఎంత ఉపయోగపడుతుందో మనం చాటి చెప్పవచ్చు.
మరో ముఖ్యమైన విషయమేమంటే, ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ప్రగతి చక్రాలు ఆగిపోయాయి. ప్రజలు ఖర్చు పెట్టడం లేదు. మార్కెట్లో క్రయవిక్రయాలు లేకపోతే ఆర్థికకార్యకలాపాలు ఉండవు. ఒక్క వ్యవసాయరంగంలో మాత్రమే కొంత కదలిక ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు డబ్బు రావాలి. అప్పుడే వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ప్రజలు ఖర్చు పెడితేనే ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ వేగాన్న అందుకుంటుంది. జకాత్ పంపిణీ ద్వారా పేదసాద ప్రజలకు కొనుగోలు శక్తి లభిస్తుంది. మార్కెటులో మళ్ళీ ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ఈ కొనుగోలు శక్తి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం రమజాన్ మాసం ఆర్ధిక ప్రగతికి తోడ్పడాలని అల్లాహ్ ను ప్రార్థిద్దాం. కరోనా సంక్షోభం నుంచి మానవాళి గట్టెక్కాలని వేడుకుందాం.

No comments:

Post a Comment