Friday, 24 April 2020

సంక్షోభ సమయంలో బీజేపీ విద్వేష వైరస్‌! మత సామరస్యానికి తీరని నష్టం

సంక్షోభ సమయంలో బీజేపీ విద్వేష వైరస్‌! మత సామరస్యానికి తీరని నష్టం

12 కోట్లమంది ఉపాధి కోల్పోయారు

రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలవాలి

వాళ్ల వాటా జీఎస్టీ విడుదల చేయాలి

మత సామరస్యానికి తీరని నష్టం..

లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహాన్ని రచించాలి.. వర్కింగ్‌ కమిటీ భేటీలో సోనియా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరాటంలో కేంద్రం రాష్ట్రాలకు అండగా నిలబడాలని, ఆర్థికంగా అండదండలు కల్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గురువారం డిమాండ్‌ చేసింది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే కేంద్రంలోని మోదీ సర్కారు పిసినారిలా వ్యవహరిస్తూ అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రజల కష్టాల పట్ల సానుభూతి, విశాల హృదయం, వేగంగా స్పందించే తత్వం కేంద్ర ప్రభుత్వంలో లేదని దుయ్యబట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బీజేపీ మత విద్వేషాలవైర్‌సను వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నుంచి ఎలా బయటపడాలన్న స్పష్టమైన వ్యూహం కేంద్రం దగ్గర లేదన్నారు. లాక్‌డౌన్‌లో మిగిలిన సమయాన్ని అయినా బయటపడే వ్యూహంపై వెచ్చించాలని సూచించారు. గురువారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సమావేశమైంది. సోనియాగాంధీ అధ్యక్షోపన్యాసం చేశారు.

‘‘కరోనా వైర్‌సపై దేశమంతా ఒక్కటిగా పోరాటం చేస్తుంటే బీజేపీ మత విద్వేషమనే వైరస్‌ వ్యాప్తిని కొనసాగిస్తోంది. సమాజ సామరస్యానికి తీరని నష్టం జరుగుతోంది. ఈ నష్టాన్ని పూడ్చడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అన్నారు. మహారాష్ట్రలోని పాల్గార్‌లో లాక్‌డౌన్‌ సమయంలో వాహనంలో వెళుతున్న హిందూ సాధువుల్ని పిల్లలను ఎత్తుకెళ్లే వారిగా అనుమానించి,కొట్టి చంపిన ఉదంతాన్ని బీజేపీ వివాదాస్పదం చేయడాన్ని సోనియా పరోక్షంగా ప్రస్తావించారు. మూడు వారాలుగా కరోనా వైరస్‌ ప్రబలుతున్న తీరు ఆందోనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు టెస్టింగ్‌ తక్కువగా జరుగుతోందని, కిట్ల లభ్యత, నాణ్యత సమస్యలు ఉన్నాయని చెప్పారు.



వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్ల సంఖ్య, నాణ్యత బాగా తక్కువగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ కమిటీ పలు తీర్మానాలు చేసింది. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను ఇచ్చేయాలని, రుణాలు తీసుకొనేందుకు మరింత స్వేచ్ఛ కల్పించాలని, రాష్ట్రాలకు ఆర్థిక మద్దతు ప్రారంభించాలని కోరింది. వ్యవసాయం, చిన్న, మధ్య తరహా రంగాలు తీసుకున్న రుణాలపై కనీసం ఏడాది పాటు మారటోరియం విఽధించాలని కూడా డిమాండ్‌ చేసింది. లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు పేదల కుటుంబాలకు రూ.7500 చొప్పున చెల్లించాలని సోనియా కోరారు. లాక్‌డౌన్‌ తొలిదశలోనే 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. నిరుద్యోగం మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. వలస కార్మికులకు ఆహార, ఆర్థిక భద్రత కల్పించి, సంక్షోభం నుంచి గట్టెక్కించాలని సూచించారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించి, పౌరులకు చేరేట్లు చూడాలని, చిన్న మధ్యతరహా పరిశ్రమలు కుప్పకూలిపోకుండా సంక్షేమ ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. ఈ రంగంలో 11 కోట్ల మంది కార్మికులు ఉన్నారని ప్రస్తావించారు. సరైన రక్షణ పరికరాలు లేకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి భారత ప్రజలు వందనం చేయాలన్నారు. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాల్గొన్నారు. కేంద్రం తమకు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదని సీఎంలు ఆరోపించారు. కేంద్రం భారీ ప్యాకేజీ ఇవ్వకపోతే రాష్ట్రాలు లాక్‌డౌన్‌ తర్వాత బయటపడటం సాధ్యం కాదని చెప్పారు.   రాష్ట్రాల జీఎస్టీ వాటాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కార్మికులను కరోనా పరీక్షలు నిర్వహించి, సొంత రాష్ట్రాలకు అనుమతించాలని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ డిమాండ్‌ చేశారు. వారిని ఇళ్లకు చేర్చే బాధ్యతను సొంత రాష్ట్రాలు తీసుకోవాలని కోరారు. 

No comments:

Post a Comment