Tuesday, 29 January 2019

ప్రధాని రామబాణం

ప్రధాని రామబాణం
30-01-2019 01:18:03

వివాదం లేని భూమిని ఇచ్చేద్దాం
అందుకు మీరు అనుమతించండి
సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌
ఎన్నికలవేళ వ్యూహాత్మక నిర్ణయం
అయోధ్య కేసులో కీలక మలుపు
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ గద్దెను మళ్లీ చేజిక్కించుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ కోటను బద్దలు కొట్టాలని రాహుల్‌ పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. అమ్ముల పొదిలోని అస్ర్తాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. రాహుల్‌ కనీస ఆదాయ పథకానికి విరుగుడుగా మోదీ సార్వత్రిక ఆదాయ పథకాన్ని తేనున్నారు. అంతేకాదు, గోభూమి ఉత్తరాదిలో ఉద్వేగాలకు మూలమైన అయోధ్య రామాలయ అంశాన్ని మోదీ ప్రభుత్వం తనదైన శైలిలో తెరపైకి తెచ్చింది. అయోధ్యలో వివాదాస్పదం కాని భూమిని సొంత యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.

న్యూఢిల్లీ, జనవరి 29: అయోధ్య కేసులో అనూహ్యమైన మలుపు...! సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ- అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఒత్తిడి పెరుగుతున్న దశలో -కేంద్రం ఓ ఆకస్మిక నిర్ణయాన్ని తీసుకుంది. వివాదాస్పద స్థలం కేవలం 0.313 ఎకరాలు మాత్రమేనని, 67 ఎకరాల్లో మిగిలిన భూమిపై గొడవే లేదని పేర్కొంది. దానిని ఆ భూమి సొంత యజమానులకు అప్పగించేస్తామని, ఇందుకు పదహారేళ్ల కిందట ఇచ్చిన ఆదేశాలను సవరించి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్రం మంగళవారం నాడు ఓ పిటిషన్‌ వేసింది. మహా రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌ తెస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ పిటిషన్‌ వేయడం రాజకీయంగా అత్యంత కీలకం. ఎందుకంటే ఆ 67 ఎకరాల్లో 42 ఎకరాలు రామ జన్మభూమిన్యాస్‌ (రామాలయ నిర్మాణానికి ఏర్పడ్డ సంస్థ)దే! వివాదరహిత భూమిలో మొదట పనులు మొదలెట్టి క్రమేణా విస్తరించుకోడానికి ఈ చర్య దోహదకారి అవుతుందని వైరిపక్షాలు అనుమానిస్తున్నాయి.

1993లో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం వివాదాస్పద స్థలంతో సహా చుట్టూ ఉన్న మొత్తం 67.703 ఎకరాల భూమిని స్వాధీనపర్చుకుంది. ఆ మేరకు చట్టం చేసింది. దాన్నే ‘అయోధ్య చట్టం’ అంటున్నారు. ఇందులో పూర్తి వివాదం ఉన్న జాగా కేవలం 0.313 ఎకరాలే. దీన్ని 1992 డిసెంబరు 6న కరసేవకులు నేలమట్టం చేశారు. వివాదాస్పద స్థలం చుట్టూ విస్తరించి ఉన్న మొత్తం 2.77 ఎకరాలపై కోర్టులో విచారణ సాగింది. దీనిపైనే 2010లో అలహాబాద్‌ హైకోర్టు త్రిసభ్య బెంచ్‌ 2-1 మెజారిటీతో తీర్పు వెలువరిస్తూ- ఆ 2.77 ఎకరాల్ని కేసులోని మూడుపక్షాలూ.. బాలరాముడు-రామ్‌ లాలాకు ప్రాతినిథ్యం వహించిన హింద్‌ మహాసభ, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు సమానంగా కేటాయించాలని పేర్కొంది. అత్యంత కీలకమైన, సీతారామ విగ్రహాలున్న- కేంద్ర గుమ్మటం (సెంట్రల్‌ డోమ్‌) కింద ప్రాంతాన్ని హింద్‌ మహాసభకు అప్పగించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై అన్ని పక్షాలూ సుప్రీంకోర్టుకెక్కాయి.

14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇపుడు వాదనలు వింటోంది. ‘‘వివాదంలో ఉన్నది కేవలం 0.313 ఎకరాల స్థలం మాత్రమే. 1993 చట్టం ప్రకారం అదనంగా సేకరించిన భూమిని వాటి యజమానులకు అప్పగించడం మా బాధ్యత. యథాతథ స్థితిని కొనసాగించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ 2003 మార్చి 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని అభ్యర్థిస్తున్నాం. ఈ సవరణ జరిగితే వివాదంపై ప్రస్తుతం సాగుతున్న కేసులో అంతిమ విజేత ఎవరవుతారో వారు ఈ అదనపు భూమిలో ఎంతమేర తమ కార్యకలాపాలు సాగించుకోగలరన్నది నిర్ధారణ అవుతుంది’’ అని కేంద్రం తరఫున పిటిషన్‌ వేసిన హోంశాఖ 33-పేజీల విన్నపంలో పేర్కొంది. ‘‘నిజానికి 2003న ఇచ్చిన ఆదేశాల్లో కోర్టు.. వివాదంలో లేని, సేకరించిన భూమినంతా కలిపి యథాతఽథస్థితిని కొనసాగించాలంది. 1994లో ఇస్మాయిల్‌ ఫరూకీ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. సేకరించిన లేదా స్వాధీనపర్చుకున్న భూమిని కేంద్రం గనక అసలు యజమానులకు ఇవ్వదల్చుకుంటే ఇచ్చేయవచ్చని ఆనాడు పేర్కొంది. ఆనాటి రాజ్యాంగ ధర్మాసన నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నాం’’ అని కేంద్రం వివరించింది.

 ‘‘ఈ వివాద-రహిత భూమిలో 42 ఎకరాలు రామజన్మభూమిన్యా్‌సకు చెందినది. దాన్ని అప్పగించాలని న్యాస్‌ కోరింది. ఇందుకు 1994లో ఇచ్చిన తీర్పునే ఆ సంస్థ ప్రస్తావించింది. ఒక్క ఆర్జేఎన్‌కే కాదు, మిగిలిన హక్కుదారులకూ వెనక్కి ఇచ్చేయడానికి మేం సుముఖంగా ఉన్నాం. దీనికి అడ్డుగా ఉన్న 2003నాటి ఆదేశాలు సవరించాలి. అప్పుడే అసలు యజమానుల కోరిక నెరవేర్చగలం’’ అని అందులో విశదీకరించింది. సుప్రీంకోర్టు అయోధ్య కేసుపై విచారణను నత్తనడకగా సాగిస్తున్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. శబరిమల, వివాహేతర సంబంధాలపై ఇచ్చిన తీర్పుల మాదిరిగా సత్వరం దీనిపైనా తీర్పు వెలువరించాలని ఆయన కోరారు. అటు ఆరెస్సెస్‌, వీహెచ్‌పీలు రామాలయ నిర్మాణాన్ని తక్షణం చేపట్టేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మంగళవారం సుప్రీంకోర్టులో జరగాల్సిన కేసు విచారణ- జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే అనే ఆరోగ్యం బాగులేక రాలేకపోవడంతో వాయిదాపడింది.

వివాదాస్పద భూమి జోలికి వెళ్లం: బీజేపీ
అయోధ్యలో వివాదం లేని 67 ఎకరాల భూమిని సంబంధిత యజమానులకు తిరిగి ఇచ్చేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదు. ఆ భూమిని ఎలా ఉపయోగించుకోవాలో యజమాని రామజన్మభూమిన్యాస్‌ ఇష్టం. వివాదాస్పద స్థలం జోలికి ప్రభుత్వం వెళ్లదు’ అని స్పష్టం చేశారు. వివాదం లేని స్థలంలో రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అనుమతి లభించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. కేంద్రం సవ్యమైన దిశగా నిర్ణయం తీసుకుందని వీహెచ్‌పీ కార్యాధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేంద్ర చర్యపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ హర్షం వ్యక్తం చేశారు. సంఘ్‌పరివార్‌ని బుజ్జగించేందుకే కేంద్రం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో విమర్శించింది.

No comments:

Post a Comment