రిజర్వేషన్లు ఎందుకు.. ఎలా?
దేశంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి? అనేవి ఆసక్తికర పరిణామాలు.
రాజ్యాంగం ఏం చెప్పింది?
అంటరానితనం కారణంగా అనాదిగా నిరాదరణకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు?
అణగారిన వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి, నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ల వారికి రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకూ బీసీ(ఎం/ఈ) కింద రిజర్వేషన్లు ఇచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, స్థానిక నియమ నిబంధనలు ప్రాతిపదికగా ఇవి అమల్లోకి వచ్చాయి.
స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉండేది?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో కూడా కొన్ని కులాలు, వర్గాలకు కోటా విధానం ఉండేది. కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహూ బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902లో ఇది అమల్లోకి వచ్చింది. 1932లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ‘కమ్యూనల్ అవార్డ్’ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యురోపియన్లు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక కోటా ప్రాతినిధ్యం కల్పించారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించగా.. అంబేడ్కర్ సమర్థించారు.
స్వాతంత్య్రానంతరం ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దేశ స్వాతంత్య్రానంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత ప్రభుత్వం 1950లోనే కార్యాచరణ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన.. విద్యాసంస్థల్లో 20 శాతం సీట్లను ప్రత్యేకించాలని విద్యా మంత్రిత్వశాఖ అప్పట్లోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఖాళీలను జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌చేశారు.
మండల్ కమిషన్ ఎందుకొచ్చింది?
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడం కోసం 1979 జనవరి 1వ తేదీన అప్పటి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఓబీసీల జన సంఖ్య ఎంత అన్న గణాంకాలు అప్పటికి కమిషన్ వద్ద లేవు. దాంతో అది 1931 నాటి జనాభా లెక్కల్ని వినియోగించుకుని వారి జనాభా 52 శాతంగా నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని సేవలు, సంస్థల ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సుచేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే రిజర్వేషన్ల అమలుకూ మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 49.5%కి చేరుకున్నాయి. మండల్ సిఫార్సుల్ని అమలుచేస్తామని 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. అప్పటికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా.. ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు మొదలైంది.
రిజర్వేషన్ల ఉద్దేశం?
అనాదిగా కుల వివక్ష, అసమానతలు, అవమానాల్ని ఎదుర్కొంటున్న వర్గాల వారికి తగిన న్యాయం చేయడం కోసం, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల వ్యవస్థ మొగ్గతొడిగింది. అణగారిన వర్గాల విద్య, సామాజిక స్థితిగతుల్ని పెంపొందించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య చేపట్టారు.
ఎక్కడెక్కడ?
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు 1992లో తేల్చిచెప్పింది. అలా దాటితే.. రాజ్యాంగం ప్రస్తావించిన సమానత్వ హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని వ్యాఖ్యానించింది.
మారుతున్న ఆలోచనలు
* వివక్ష నుంచి ఆర్థికానికి: రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ‘వివక్ష’, ‘నిరాదరణ’లకు విరుగుడుగా ముందుకు తెచ్చారనీ, కానీ కొంతకాలంగా ఈ రిజర్వేషన్లకు వివక్షను (డిస్క్రిమినేషన్) ప్రాతిపదికగా కాకుండా వెనకబాటుతనానికి (డిప్రైవేషన్) విరుగుడుగా చూడటం ఆరంభమవుతోందన్న వాదన వినపడుతోంది. పేదరికమన్నది రకరకాల వివక్షలకు దారితీసే మాట వాస్తవమే అయినా.. ఆ పేదరిక నిర్మూలనకు కేవలం వ్యవస్థాత్మకమైన రిజర్వేషన్లనే పరిష్కారంగా చూడలేమనీ, లేదా ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన విధానాలకూ ఇది ప్రత్యామ్నాయం కాదని పలువురు వాదిస్తున్నారు. వివక్షనూ, ఆర్థిక వెనకబాటునూ ఒక గాటన కట్టకూడదన్నది వీరి సిఫార్సు.
* మినహాయింపు నుంచి విస్తరణకు: రిజర్వేషన్లన్నవి వాస్తవానికి ప్రాథమిక హక్కు అయిన ‘సమానత్వ హక్కు’కు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలను సరిదిద్దేందుకు, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల విధానాన్ని ‘సమానత్వ హక్కు’కు ఒక మినహాయింపుగా ప్రతిపాదించారనీ, కానీ క్రమేపీ ఇది విస్తరణకు దారితీస్తోందని అంటున్నారు. దీన్ని ప్రత్యేక మినహాయింపుగా కాకుండా వెనకబాటుతనానికి విరుగుడుగా చూడటం వల్లే వివిధ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.
- ఈనాడు ప్రత్యేక విభాగం

No comments:
Post a Comment