Tuesday, 8 January 2019

‘అయోధ్య’పై రాజ్యాంగ ధర్మాసనం

‘అయోధ్య’పై రాజ్యాంగ ధర్మాసనం
Jan 09, 2019, 01:34 IST
 Supreme Court has made a crucial decision on Ayodhya dispute - Sakshi
ఐదుగురు జడ్జీలతో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

రేపు ధర్మాసనం విచారణ

న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వం వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉంటారు. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం కేసులో గురువారం (ఈ నెల 10వ తేదీన) ఈ ధర్మాసనం వివిధ వర్గాల వాదనలు విననుందని సుప్రీంకోర్టు మంగళవారం తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత అక్టోబర్‌ 29న వెల్లడించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చింది.

తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి మినహా మిగిలిన నలుగురూ భవిష్యత్తులో సీజేఐ అయ్యే అవకాశం ఉన్న వారే కావడం గమనార్హం. అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ తేవాలంటూ పలు హిందూత్వ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాతే.. మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్‌ తెచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments:

Post a Comment