Friday, 31 August 2018

లేని నిర‌స‌న‌ను.. అంద‌రికీ ఆపాదిస్తున్న‌ ‘సాక్షి’!

లేని నిర‌స‌న‌ను.. అంద‌రికీ ఆపాదిస్తున్న‌ ‘సాక్షి’!
By Telugu360 -August 31, 2018

Courtesy ; Sakshi
నారా హ‌మారా.. టీడీపీ హ‌మారా స‌భ గుంటూరులో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిజానికి, ఈ స‌భ జ‌ర‌గ‌డానికి మూడు రోజుల ముందు నుంచే ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌త్రిక ‘సాక్షి’ కొన్ని రెచ్చ‌గొట్టే క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తూ ఉంది. ముస్లింల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మోసం చేశార‌నీ, కేటాయించిన నిధుల్లో క‌నీసం 30 శాతం కూడా ఖ‌ర్చు చెయ్య‌లేద‌నీ… దీంతో ఆంధ్రాలో ముస్లిం అంద‌రూ టీడీపీపై తీవ్ర‌మైన ఆగ్ర‌హంతో ఉన్నారంటూ అభిప్రాయ‌ప‌డింది. కానీ, ముఖ్య‌మంత్రి స‌భ స‌క్సెస్ అయింది. మైనారిటీల‌కు సంబంధించి పెండింగ్ ఉన్న అంశాలు, వారి డిమాండ్ల‌ను అక్క‌డిక‌క్క‌డే సీఎం నెర‌వేర్చారు.

దీంతో వైకాపాకి బాగా క‌న్నుకుట్టిన‌ట్టుగా ఉంది. ఆ స‌భ‌లో నిర‌స‌న తెలిపిన కొంత‌మంది త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని రోజూ వ‌రుసగా సాక్షి క‌థ‌నాలు రాస్తూనే ఉంది. నిర‌స‌న తెల‌ప‌డం అన్యాయ‌మా అంటూ ప్ర‌శ్నిస్తోంది. అయితే, ముఖ్య‌మంత్రి స‌భ‌లో నిర‌స‌న తెలిపిన‌వారు వైకాపాకి చెందిన‌వారే అనే ప్ర‌చారం కూడా ఉంది. ఈ ఇష్యూ సున్నిత‌మైంది కాబ‌ట్టి… పోలీసులు కొంత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, వారిపై ర‌క‌ర‌కాల సెక్ష‌న్ల‌తో కేసులు పెట్టార‌నీ, న్యాయం కోరితే దేశ ద్రోహ‌మా అంటూ సాక్షి ఇవాళ్ల మ‌రో క‌థ‌నం రాసింది. వారి త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని… శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌జాస్వామ్యంలో అంద‌రికీ ఉంటుంద‌ని పేర్కొన్నారు. అరెస్ట‌యిన‌వారంతా వైకాపాకి చెందిన‌వారే అంటూ పోలీసులు కూడా ఒక్క‌రోజులో మాట మార్చారంటూ విమ‌ర్శించారు.



ఈ అరెస్టుల‌తో ముస్లింలంద‌రూ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారన్న‌ట్టుగా రాసేశారు. ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాల నేత‌లూ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌న్నారు. నిజానికి… ఈ అరెస్టుల‌పై ముస్లింల‌కు ఉన్న క్లారిటీ ఏంటంటే… ఇది ప్ర‌తిప‌క్ష పార్టీ చేయిస్తున్న కార్య‌క్ర‌మంగానే చూస్తున్నారు. ఎందుకంటే, టీడీపీ హ‌మారా స‌భ ముందు నుంచీ ఆ పార్టీ, ఆ పార్టీ ప‌త్రిక అనుసరించిన తీరును వారూ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఈ స‌భ‌లో వైకాపా ఏదో ఒక‌టి చేస్తుంద‌నే అంచ‌నాలు అప్పుడే ఏర్ప‌డ్డాయి. దానికి అనుగుణంగానే ప‌రిస్థితులు కూడా ఉన్నాయి. ఆ యువ‌కుల అరెస్టుల నేప‌థ్యంలో వారి కుటుంబాల నుంచి కొంత నిర‌స‌న ఉంటే ఉండొచ్చు. కానీ, దాన్ని రాష్ట్రంలో ముస్లిలంద‌రికీ ఆపాదించేసి, కొంత‌మందిని నేత‌ల్ని మీడియా ముందుకు పంపుతూ… ఇలాంటి క‌థ‌నాల ద్వారా లేని వ్య‌తిరేక‌త‌ను అంద‌రిలో ఉన్న‌ట్టు ఆపాదించే ప్ర‌య‌త్నం చేస్తోంది ‘సాక్షి’. సున్నితమైన అంశాల ప‌ట్ల బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా మీడియా బాధ్య‌తే. కానీ, వైకాపా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఆ బాధ్య‌త‌ను అటకెక్కించ‌డం ఏ త‌ర‌హా జ‌ర్న‌లిజ‌మో వారే చెప్పాలి?

No comments:

Post a Comment