Tuesday, 28 August 2018

జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!

జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!
29-08-2018 03:22:43

 ఏపీని మోసం చేయాలనుకుంటే పాతేస్తాం
బీజేపీ, వైసీపీ, జనసేన కలిసే నాటకాలు
ప్రధాని మోదీని ఒక్కమాటా అనని జగన్‌
ప్రతిదశలో కమలానికి ఆయన సహకారం
ఎన్డీయేపై పోరాడుతున్నది తెలుగుదేశమే
రావాల్సిన నిధులు వడ్డీతో సహా రాబడతాం
త్వరలో ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు
నామినేటెడ్‌ పదవులు కూడా ఇస్తాం: సీఎం
నాలుగు శాతం కోటా కాపాడుతాం
మైనారిటీలకూ ఉప ప్రణాళిక
మరో 4 జిల్లాల్లో రెండో భాషగా ఉర్దూ
ముస్లింలపై వరాలు కురిపించిన బాబు
గుంటూరులో ‘నారా హమారా...
టీడీపీ హమారా’ సభ
గుంటూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ముస్లింలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. ‘మీకోసం మేమున్నాం’ అని ప్రకటించారు. త్వరలోనే మంత్రివర్గంలో ముస్లిం నేతకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువమంది మైనారిటీలకు టికెట్లు ఇస్తామని తెలిపారు. నామినేటెడ్‌ పదవులతోపాటు మరిన్ని పదవులు ఇస్తామని చెప్పారు. ‘‘నాయకులుగా ఎదగండి. అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని మైనారిటీలకు పిలుపునిచ్చారు. మంగళవారం ‘నారా హమారా... టీడీపీ హమారా’ నినాదంతో గుంటూరులో జరిగిన మైనారిటీల సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ముస్లింలు తరలి వచ్చారు. ‘భాయియో... బెహనోం... అస్సలామాలేకుం... బడే ఖుష్‌ నసీబోం దిఖ్‌ రహాహై’ అంటూ ఉర్దూలో తన ప్రసంగం ప్రారంభించారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఇంత పెద్ద మైనార్టీ సభని చూడలేదు. ఇది పోరాట పటిమకు నాంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని గద్దె దింపేలా, ఢిల్లీ నాయకులు ఉలిక్కి పడేలా ఈ సభ ఉంది’ అని తెలిపారు. రాష్ట్రాన్ని మోసం చేయాలని చూస్తే పాతేస్తామని ఎన్డీయే సర్కారును హెచ్చరించారు. బీజేపీ, వైసీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది.

వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయి. వారికి ఓటేస్తే రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ఓటు వేసినట్లే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీయే ఓడిపోవాలంటే అవినీతి వైసీపీని, కుట్రలు పన్నే జనసేనను ఓడించాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసే నాటకాలు అడుతున్నారని విమర్శించారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ నిజ నిర్ధారణ కమిటీ వేశారు. రూ.75వేల కోట్లు రాష్ట్రానికి రావాలని తేల్చారు. మన ఎంపీలు పార్లమెంటులో వీరుల్లా పోరాడుతుంటే వైసీపీ ఎంపీలు లాలూచీతో రాజీనామాలు చేసి పిరికిపందల్లా వ్యవహరించారు’’ అని విమర్శించారు. ‘జగన్‌ మోదీతో కలిశారా లేదా’ అని సీఎం ప్రశ్నించినప్పుడు... ‘ఔను’ అని మైనారిటీలు గట్టిగా బదులిచ్చారు. ‘‘మోదీని జగన్‌ ఒక్క మాట అనరు. ప్రతిసందర్భంలో బీజేపీని వెనకేసుకొస్తున్నారు. వారి నాటకాలు ఇక సాగవు’’ అని సీఎం తేల్చిచెప్పారు.

ఉడుం పట్టు పడతాం
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికోసం పోరాడుతున్న నేపథ్యంలో... గతంలో తప్పు చేసిన కాంగ్రెస్‌ కూడా ముందుకొచ్చి తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ప్రకటించిందన్నారు. ‘ఎవ్వరినీ వదిలిపెట్టం. ఉడుం పట్టుపడతాం. హోదా సాధిస్తాం’ అని ప్రకటించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని ప్రాజెక్టులకు వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పారు. ఎన్డీయేపై పోరాడుతున్న తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ముస్లింలు ఏం తినాలి, ఏమేమి చేయకూడదనేది వాళ్లకెందుకని బీజేపీపై మండిపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో జైలుకు పంపిస్తామన్న ప్రతిపాదన అన్యాయమని చెప్పి పోరాడింది టీడీపీయేనని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ ఎక్కడుందని ప్రశ్నించారు. గుజరాత్‌ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీ రాజీనామాకు డిమాండ్‌ చేసింది తామేనని గుర్తు చేశారు.

అక్టోబరు 2 నుంచి సీఎం యువనేస్తం
అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి రాష్ట్రంలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరిట నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రతినెలా రూ.వెయ్యి చెల్లిస్తామని... దేశంలో ఇలాంటి పథకం అమలు చేసే తొలి ప్రభుత్వం ఏపీయేనని తెలిపారు. ‘‘చేతిలో డబ్బు లేదు! అయినా మంచి మనసు ఉంది. ప్రతి సంక్షేమ కార్యక్రమంపై ప్రజల వద్ద సూచనలు తీసుకుంటూ ఇంకా ఎంత సంతృప్తిగా అమలు చేయాలో చూస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ సభలో మంత్రులు చినరాజప్ప, కిమిడి కళా వెంకట్రావు, నారా లోకేశ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, జవహర్‌, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, ఆదినారాయణరెడ్డి, నారాయణ, శిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, ఎంపీలు గల్లా జయదేవ్‌, శ్రీరాం మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

‘నారా హమారా... టీడీపీ హమారా’ సభ చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. సభకు తరలి
వచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు
సంఘటితమయ్యారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. వచ్చే ఎన్నికల్లో మైనారిటీల ఓటు ఒక్కటి కూడా ఇతర పార్టీలకు పడొద్దు!

కొందరు స్వదేశీయులు బ్రిటిష్‌ పాలకులకు సహకరించి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. ఇక్కడ కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రానికి
సహకరిస్తున్న జగన్‌కూ అదే గతి పడుతుంది.

నేను యూటర్న్‌ తీసుకున్నానని, వైసీపీ వలలో పడ్డానని ప్రధాని అన్నారు. కానీ... నేను తీసుకున్నది రైట్‌ టర్న్‌! వైసీపీ ట్రాప్‌లో పడింది మేం కాదు...
బీజేపీయే అవినీతి కుడితిలో పడింది!

ఏపీజే అబ్దుల్‌ కలాం స్వీయరచనలో వెలువడిన ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ పుస్తకంలో నా పేరు ప్రస్తావించారు. రాష్ట్రపతిగా తాను ఉండాలని ప్రధానికంటే ముందుగానే చెప్పి ఒప్పించానని ఆయన రాశారు. - చంద్రబాబు

మైనార్టీలపై వరాల జల్లు
 మూడు వేల ముస్లిం జనాభా ఉన్న చోట ప్రభుత్వ నిధులతో ఖ్వాజీ నియామకం.
 ముస్లింలకు ప్రస్తుతం ఉన్న 4% రిజర్వేషన్లు నిలబడేలా సుప్రీంకోర్టులో పోరాటం.
 ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లలో ముస్లిం మతపెద్ద ఉండేలా చర్యలు.
 రాయలసీమ 4జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా రెండో భాషగా ఉర్దూ అమలు.
 మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు మరో రూ.100 కోట్లు కేటాయింపు
 రూ.50 కోట్లతో అర్బన్‌ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ఏర్పాటు.
 ఎస్సీ కార్పొరేషన్‌లో ఇస్తున్నట్లుగా మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 200 మందికి జీవనోపాధి నిమిత్తం కార్లు. అవసరమైతే మరిన్ని వాహనాలు.
 బీసీ కార్పొరేషన్‌ ఆదరణ పథకం కింద కులవృత్తిదారులకు రుణాలు ఇస్తున్నట్లుగా... మైనారిటీలకూ రుణాలు. పదివేల మందికి రూ.20వేల చొప్పున రుణ సహాయం.
 బంగారం పని చేసే వారి సంక్షేమానికి రూ.10 కోట్లతో నిధి.
 ఆర్థిక స్థితిలేని మౌజన్లకు ప్రభుత్వ ఖర్చులతో హజ్‌ యాత్ర.
 మదర్సాల్లో చదువుకునే పిల్లలకు ప్రతి రంజాన్‌కు రెండు జతల దుస్తులు పంపిణీ.
 మైనార్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు.
 అమరావతిలో 15 ఎకరాల్లో షాహి మసీద్‌.
 రూ.150 కోట్లతో ఇస్లామిక్‌ కల్చర్‌ సెంటర్‌.
 కడపలోని పెద దర్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని దర్గాల మరమ్మతులకు రూ.10 కోట్లు.
 కర్నూలులో ఇస్తేమా ఏర్పాటుకు రూ.10 కోట్లు
 పదో తరగతి పాసైన వారికి రూ.10 కోట్లతో నైపుణ్య సంస్థలో శిక్షణ.
 రూ.40 కోట్లతో నూర్‌బాషాల ఫెడరేషన్‌.

No comments:

Post a Comment