Monday, 27 August 2018

ముస్లింలకు అండదండలు

ముస్లింలకు అండదండలు
28-08-2018 01:00:58

సంక్షేమానికి సర్కారు భరోసా
4 ఏళ్లలో 2112 కోట్ల కేటాయింపు
ఇప్పటికే 1763 కోట్ల వ్యయం
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
యువతులకు 50 వేలు పెళ్లికానుక
విదేశీ విద్యకు 15 లక్షల సాయం
హజ్‌యాత్రకూ ఆర్థిక సహకారం
అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ముస్లింలకు టీడీపీ ప్రభుత్వం అండదండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలు 8.8 శాతముంటే, అందులో ముస్లింలు 7.3 శాతం(37 లక్షల మంది) ఉన్నారు. వారి సంక్షేమంపై తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగేళ్లలో రూ.2112 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి భరోసా కల్పించారు. ఇప్పటికే రూ.1763 కోట్లు ఖర్చు చేసి, ముస్లింల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. 2018-19 సంవత్సరానికి రూ.1101 కోట్లు కేటాయించి, ఆ వర్గాల మన్నన పొందింది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ ఈ వర్గాలకు ప్రత్యేకంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, యువతులకు దుల్హన్‌ పథకం కింద పెళ్లికానుక అందిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా హజ్‌యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలకు ఆ అవకాశాన్నీ ప్రభుత్వం కల్పించింది. ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం, మసీదుల మరమ్మతులు, షాదీఖానాల నిర్మాణాలు చేపడుతోంది.

29,691 మందికి పెళ్లి కానుక..
పేద ముస్లిం కుటుంబాలకు పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో చంద్రన్న పెళ్లి కానుక ద్వారా అర్హులైన ఒక్కో యువతికి రూ.50 వేలు ఇస్తున్నారు. గతంలో దుల్హన్‌గా పేరున్న ఈ పథకంలో మరింత పారదర్శకత కోసం కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది నుంచి చంద్రన్న పెళ్లికానుకగా అందుబాటులోకి తెచ్చారు. నిధుల దుర్వినియోగానికి అవకాశం లేకుండా పెళ్లికుమార్తె బ్యాంకు అకౌంట్‌లోనే నగదు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 44,083 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 29,691 మందికి ప్రభుత్వం రూ.148 కోట్లు చెల్లించింది. మిగిలిన 14,392 దరఖాస్తుదారులనూ ప్రక్రియ పూర్తవగానే ఆదుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రూ.80 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉంచింది.

కడప, విజయవాడల్లో హజ్‌హౌస్ లు...
కడపలో రూ.12 కోట్లతో హజ్‌హౌస్‌ నిర్మాణంలో ఉంది. దానికి మరో రూ.13 కోట్లు అదనంగా సోమవారం మంజూరుచేశారు. విజయవాడలో రూ.11 కోట్లతో మరో హజ్‌హౌస్‌ నిర్మాణానికి మేలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్లతో రాష్ట్రంలోని వివిధ మసీదుల మరమ్మతులు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.20 కోట్లు మరమ్మతులకు కేటాయించారు. రూ.36.86 కోట్లతో 182 షాదీఖానాలు, ఉర్దూఘర్‌లను నిర్మిస్తోంది.

326 మందికి విదేశీ విద్య
ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విదేశీ విద్యను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. అమెరికా, రష్యా, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఐర్లండ్‌, పోలెండ్‌, ఉక్రెయిన్‌, కిజికిస్తాన్‌ తదితర దేశాల్లో సుమారు 326 మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో చదువుతున్నారు. వారి కోసం విదేశాల్లోని వర్సిటీలకు రూ.9.90 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.30 కోట్లు కేటాయించారు. ఫీజు రాయితీని ఇప్పుడు రూ.15 లక్షలకు పెంచడంతోపాటు, ప్రయాణ ఖర్చులనూ ప్రభుత్వమే భరిస్తోంది. ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం ద్వారా మరో 300 మంది విద్యార్థులకు సివిల్స్‌ కోచింగ్‌కు రూ.5.70 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఇమామ్‌, మౌజన్లకు గౌరవ వేతనం...
రాష్ట్రవ్యాప్తంగా 4304 మసీదుల్లో విధులు నిర్వహించే ఇమామ్‌లకు నెలకు రూ.5 వేలు, మౌజన్లకు రూ.3 వేలు గౌరవవేతనాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటికే రూ.80.95 కోట్లు చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మరో రూ.75 కోట్లు కేటాయించారు.

2,802 మందికి హజ్‌ భాగ్యం...
ఇప్పటి వరకు 2,802 మంది హజ్‌యాత్రకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది మరో 2378 మంది ప్రభుత్వ సహకారంతో హజ్‌కు వెళ్లడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మైనారిటీల అభివృద్ధిలో భాగంగా మల్టీ సెక్టార్స్‌ డెవల్‌పమెంట్‌ పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.71.40 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వివిధ పనులు జరుగుతున్నాయి.

స్వయం ఉపాధి పథకాలు...
ముస్లిం యువతకు పలు స్వయ ఉపాధి పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 13,675 మంది ముస్లింలకు రూ.94.47 కోట్లను బ్యాంకు రాయితీ రూపంలో అందజేశారు. 2018-19లో మరో రూ.126 కోట్లు కేటాయించారు. గత ఏడాది 8,040 మందికి రూ.11.45 కోట్లతో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ ఏడాది మరో 9 వేల మందికి నైపుణ్యశిక్షణకు రూ.16.85 కోట్లు కేటాయించారు.

No comments:

Post a Comment