Thursday, 2 August 2018

‘ఎన్నార్సీ’పై మాటల యుద్ధం

‘ఎన్నార్సీ’పై మాటల యుద్ధం
Aug 01, 2018, 03:05 IST
 Assam National Register of Citizens wards of war - Sakshi
మోరీగావ్‌లో తుది జాబితాలో తమ పేరు చెక్‌చేసుకునేందుకు క్యూలో నిల్చున్న జనం

అక్రమ వలసదారులను గుర్తించే ధైర్యం కాంగ్రెస్‌కు లేకపోయింది: షా

జాబితాలో లేనివారంతా విదేశీయులు కాదు: కాంగ్రెస్‌

ఎన్నార్సీతో రక్తపాతం: మమత

న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదలచేసిన నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్నార్సీ) ముసాయిదా జాబితాపై రాజకీయ రభస కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో అధికార పార్టీ తరఫున బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వివరణ ఇస్తూ.. అక్రమ వలసదారులను గుర్తించే సాహసాన్ని కాంగ్రెస్‌ చేయలేకపోయిందన్నారు. నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవని, ఎన్నార్సీలో చోటుదక్కని వారంతా విదేశీయులు కారని కాంగ్రెస్‌ పేర్కొంది. మానవతా దృక్పథాన్ని అవలంబించాలని, భారతీయులకు జాబితాలో చోటు నిరాకరించొద్దని సూచించింది. వివాదాస్పద ఎన్‌ఆర్సీ జాబితాతో దేశంలో సివిల్‌ వార్, రక్తపాతం జరుగుతాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించారు.

అక్రమ వలసదారులను కాపాడతారా?: షా
ప్రశ్నోత్తరాలను రద్దుచేసి ఎన్నార్సీపై చర్చ నిర్వహించేందుకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అంగీకరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ.. అక్రమ వలసదారులను గుర్తించి భారతీయుల జాబితాను తయారుచేసేందుకే ఎన్‌ఆర్సీ కసరత్తు చేపట్టామన్నారు. 1985, ఆగస్టు 14న అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ సంతకంచేసిన అస్సాం ఒప్పందం ప్రకారమే ఎన్నార్సీ జాబితాను రూపొందించాల్సిందని, కానీ ఆ పనిని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. అక్రమ వలసదారులను గుర్తించే ధైర్యం ఆ పార్టీకి లేకపోయిందని ఆరోపించారు. అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశీయులను కాపాడటానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్‌ఆర్సీ రూపుదిద్దుకుంటోంది. 40 లక్షల మందికి ముసాయిదా జాబితాలో చోటుదక్కలేదు. ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన వారినా?’ అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన భారతీయులెవరూ ఆందోళనచెందనక్కర్లేదని, వారి పేర్లను ఎన్‌ఆర్సీ నుంచి తొలగింబోచమని హామీ ఇచ్చారు. షా వ్యాఖ్యలపై కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో తొలుత పది నిమిషాలు, తరువాత రోజంతటికీ సభ వాయిదాపడింది. 

అంతర్జాతీయంగా ప్రభావం: కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ.. ఎన్నార్సీ మానవతా సమస్య అని, పలానా కులం, మతానికి సంబంధించినది కాదని పేర్కొన్నారు. ‘ఎవరినీ దేశం నుంచి తరిమికొట్టాలని మేము కోరుకోవడం లేదు. ఇది కేవలం 40 లక్షల మందికి సంబంధించిన సమస్య కాదు. వారి కుటుంబం, పిల్లలను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరుతుంది. ఎన్నార్సీతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై, ప్రభావం పడుతుంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత కేవలం పౌరులపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఉండాలి’ అని ఆజాద్‌ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ స్పందిస్తూ ఎన్‌ఆర్సీ జాబితాలో చోటుదక్కనివారిలో హిందువులు, ముస్లింలు, బిహార్, యూపీ ప్రజలు కూడా ఉన్నారని అన్నారు.


మాజీ రాష్ట్రపతి కుటుంబీకులకు చోటేదీ?
ఎన్నార్సీ జాబితాలో దివంగత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ సోదరుడు లెఫ్టినెంట్‌ ఎక్రముద్దీన్‌ అలీ అహ్మద్‌ కుటుంబ సభ్యులకు చోటు దక్కలేదు. ఆ కుటుంబం అస్సాంలోని కామరూప్‌ జిల్లా రాంగియా పట్టణంలో నివసిస్తోంది.  ‘నేను ఫక్రుద్దీన్‌ సోదరుడి కుమారుడిని. మా నాన్న పేరు వారసత్వ డేటాలో లేకపోవడంతో మాకు ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కలేదు. ఈ విషయంలో మాకు చాలా ఆందోళనగా ఉంది‘ అని జియా ఉద్దీన్‌ అంటున్నారు. పూర్వీకులకు సంబంధించిన  స్థానికత పత్రాలు సమర్పించలేకపోయిన వారెవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో 40 లక్షల మందికి చోటు కల్పించకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఎన్నికల సంఘం అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించిన వారిని, పౌరసత్వంపై ఇప్పటికే విదేశీ ట్రిబ్యునల్స్‌లో సవాల్‌ చేసిన వారిని జాబితాలో చేర్చలేదు.

తదుపరి బెంగాల్లోనా?
అస్సాం మాదిరిగానే పశ్చిమబెంగాల్‌లోనూ ఎన్నార్సీ జాబితా ను రూపొందించే ఉద్దేశం ఉందా? అని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నుంచి స్పష్టత కోరారు. మంగళవారం ఆమె రాజ్‌నాథ్‌ను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ..‘అస్సాం ఎన్నార్సీ గురించి మాట్లాడటానికే ఢిల్లీ వచ్చా. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది వివరాలు సమర్పించాను. తదుపరి ఎన్‌ఆర్సీ బెంగాల్‌లోనే అని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. అలాంటి ప్రకటనలు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు?’ అని మమత అన్నారు. బెంగాల్‌లో అక్రమ వలసదారులు కోట్లలో ఉంటారని, తదుపరి ఎన్నార్సీ బెంగాల్లో చేపట్టే అవకాశాలున్నాయని బీజేపీ నేత కైలాశ్‌ చెప్పారు.

ఇప్పుడే చర్యలు వద్దు: సుప్రీం
ఎన్నార్సీ జాబితాను ఆధారంగా చేసుకుని ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని కేంద్రం, అస్సాం ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కేవలం ముసాయిదా జాబితానే అంది. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రామాణిక అమలు విధానాన్ని(ఎస్‌ఓపీ) రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పేర్ల తొలగింపును సవాలుచేసేందుకు బాధితులకు న్యాయబద్ధ అవకాశం కల్పిస్తూ ఎస్‌ఓపీని ఆగస్టు 16 నాటికి తమ ముందు ఉంచాలని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌ల బెంచ్‌ ఆదేశించింది. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది తప్పు డు పత్రాలతో ఇతర రాష్ట్రాలకెళ్లకుండా వారి బయోమెట్రిక్‌ వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాంటి వారు తమ రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ట్రాలు ఆందోళనచెందుతున్నాయంది.
మోరీగావ్‌లో తుది జాబితాలో తమ పేరు చెక్‌చేసుకునేందుకు క్యూలో నిల్చున్న జనం

No comments:

Post a Comment