Wednesday 31 January 2018

కొత్త భారతంలో అచ్ఛేదిన్ కి దర్పణం పడుతున్న కాస్ గంజ్

కొత్త భారతంలో అచ్ఛేదిన్ కి దర్పణం పడుతున్న కాస్ గంజ్
- వాహెద్

వీర్ అబ్దుల్ హమీద్, షహీద్ అబ్దుల్ హమీద్ ... ఈ పేరెవరికైనా ఇప్పుడు గుర్తుందా? పరమవీర్ చక్ర్ గుర్తుందా? 1965 పాకిస్తాన్ తో యుద్ధం గుర్తుందా? పాకిస్తాన్ యుద్ధట్యాంకులను తన మిలిటరీ జీపుతో ఢీకొని వరుసగా మూడు ట్యాంకులను అగ్నికి ఆహుతి చేసిన శౌర్యం గుర్తుందా? పాకిస్తాన్ యుద్ధట్యాంకులను పనికిరాని రేకుల డబ్బాల్లా మార్చి నేలకొరిగిన దేశప్రేమ గుర్తుందా?
జబ్ ఘాయల్ హువా హిమాలా ... ఖతరే మెం పఢీ ఆజాదీ ... జబ్ తక్ థీ సాంస్ లడే వో... ఫిర్ అప్నీ లాష్ బిఛాదీ ... సంగీన్ పర్ ధర్ కే మాథా... సో గయే అమర్ బలిదానీ ... జో షహీద్ హువే హై ఉన్కీ జర యాద్ కరో ఖుర్బానీ
ఉత్తరప్రదేశ్ కాస్ గంజ్ లో వీర్ అబ్దుల్ హమీద్ చౌక్ వద్ద భారతజాతీయ పతాకావిష్కరణ సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు చూసిన తర్వాత కూడా నాకిప్పుడు వీర్ అబ్దుల్ హమీద్ గుర్తుకు రావడం లేదు. అసలు పాకిస్తాన్ యుద్ధంలో ముస్లిములెవరైనా భారతదేశం తరఫున పోరాడారా అన్నది కూడా గుర్తుకు రావడం లేదు. 
కోయి సిఖ్ కోయి జాట్ మరాఠా, కోయి గుర్ఖా కోయి మదరాసీ
సర్ హద్ పర్ మర్నే వాలా, హర్ వీర్ థా భారత్ వాసీ
జో ఖూన్ గిరా పర్వత్ పర్, వో ఖూన్ థా హిందూస్తానీ
జో షహీద్ హువే హై ఉన్కీ, జర యాద్ కరో ఖుర్బానీ
ఇప్పుడు ప్రదీప్ రాసిన దేశభక్తి గేయం కూడా ఎందుకో గుర్తుకు రావడం లేదు. ఇంతకు ముందు గుర్తుండేది. ప్రతి పంక్తి గుర్తుండేది. అందులో సిక్కులు, మరాఠాలు, గుర్ఖాలు, మదరాసీలని అందరినీ ప్రస్తావించడం చాలా బాగుండేది. అంతా ఒక్కటే అన్న గర్వం ఉండేది. ఇప్పుడెందుకో ప్రదీప్ ముస్లిముల పేర్లు, క్రయిస్తవుల పేర్లు అందులో ఎందుకు రాయలేదన్న అనుచితమైన, అసంబద్దమైన ప్రశ్న ప్రదీప్ పాటను మరిచిపోయేలా చేస్తోంది.
ఎందుకంటే ఇది కొత్త భారతదేశం. అచ్ఛేదిన్ ప్రకాశానికి కళ్ళు బైర్లు కమ్ముతున్న భారతం. బైర్లు కమ్మిన కళ్ళల్లో ఇప్పుడిక ఏదీ గుర్తుండడం లేదు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అపూర్వానంద్ రాసిన మాటలు మాత్రమే తలపుకు వస్తున్నాయి. ఆ మాటలేమంటే... ప్రొఫెసర్ అపూర్వానంద్ ఏమన్నాడంటే:
’’వాళ్ళ మువ్వన్నెల జెండా నాది కాదు. కాస్ గంజ్ వద్ద వీర్ అబ్దుల్ హమీద్ చౌక్ దగ్గర రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణ చేయడానికి గుమికూడిన ముస్లిములపై బలవంతంగా దౌర్జన్యాలకు పాల్పడిన బైక్ ర్యాలీ లోని మువ్వన్నెల జెండా నాది కాదు. వీళ్ళ చేతుల్లో జెండా ఏమిటో నాకు తెలియదు. నాకు తెలిసిన జెండా కాదిది. ఇది బెదిరించడానికి, భయపెట్టడానికి, గుండాల చేతుల్లో ఆయుధంలా, నా ఉనికిని నాశనం చేయడానికి వాడుతున్న ఆయుధంలా ఉంది. భారతదేశం భారత ప్రజలది.‘‘
ఇంకా ఏం రాశారు ప్రొఫెసర్ అపూర్వానంద్ అంటే.. ’’త్రివర్ణ పతకాన్ని ఇప్పుడు దేశంలో అంతర్భాగంగా ఉన్న జనసముదాయాలపై దాడులకు ఉపయోగిస్తున్నారు. దాన్ని పట్టుకుని ఝళిపిస్తున్న వారి ముఖాలు చూడండి. వారు దండయాత్రలకు బయలుదేరినవారిలా కనిపిస్తున్నారు. కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోడానికి బయలుదేరిన ఆక్రమకకశక్తుల్లా, అక్కడి ప్రజలను ఓడించడానికి బయలుదేరిన వారిలా కనిపిస్తున్నారు. ఈ జెండా కేవలం తమది మాత్రమేనని, తమకు తప్ప మరెవ్వరికీ చెందదనీ, ఇతరులు దానికి సాష్టాంగపడేలా చేస్తామని, తమ మాట వినేలా చేయడానికి బయలుదేరిన శక్తుల్లా కనిపిస్తున్నారు‘‘
ప్రొఫెసర్ అపూర్వానంద్ రాసిన ఈ మాటలు కాస్త విపరీతంగా కనిపిస్తున్నాయా?
గణతంత్ర దినోత్సవం రోజున కాస్ గంజ్ లో అల్లర్ల తర్వాత బరేలీ జిల్లా మేజిస్ట్రేటు రాఘవేంద్ర విక్రమ్ సింగ్ ఫేస్ బుక్ పోస్టు కూడా ఒకసారి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఆయనేం రాశాడంటే ’’విచిత్రమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. ముస్లిముల మహల్లాల్లోకి బలవంతంగా ఊరేగింపుగా వెళ్ళడం. అక్కడ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయడం. ఎందుకలా చేస్తున్నారు? వాళ్ళేమైనా పాకిస్తాన్ వాళ్ళా? ఇక్కడ బరేలీలోని ఖైలాన్ లోను ఇలాగే జరిగింది. ఆ తర్వాత రాళ్ళు విసరడం, ఆ తర్వాత కోర్టు కేసులు.‘‘ జెండాలు చేతబట్టుకుని గుంపులు ఏం చేస్తున్నాయో ఈ పోస్టు చదివిన తర్వాత అర్ధం కావడం లేదా? ఆ మేజిస్ట్రేటు గారు మరో పోస్టు కూడా పెట్టారు, పాకిస్తాన్ కన్నా పెద్ద శత్రువు చైనా. చేతిలో జెండా పట్టుకుని చైనాకు వ్యతిరేకంగా ఎప్పుడూ నినాదాలివ్వరేమిటి? అని ప్రశ్నించారు. దేశంలో సామాజిక సమైక్యతను దుష్టశక్తులు నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అసలు కాస్ గంజ్ లో ఏం జరిగింది? ఏం జరిగిందో తెలుసుకునే తక్షణ మార్గం మీడియా. కాబట్టి మీడియాలో వచ్చిన వార్తలనే అందరం నమ్ముతాం. రిపబ్లిక్ డే రోజున కాస్ గంజ్ లో అల్లర్లు జరిగాయి. ఏబిపి న్యూస్ జర్నలిస్టు అభిసార్ శర్మ ఈ అల్లర్ల గురించి, మీడియా రిపోర్టింగ్ లో చవుకబారు మతతత్వాన్ని బట్టబయలు చేశాడు.
కాస్ గంజ్ అల్లర్ల గురించి చాలా మీడియా చానళ్ళు ఏం చెప్పాయంటే, రిపబ్లిక్ డే రోజున పతాకావిష్కరణ, జెండా ర్యాలీలు జరక్కుండా అక్కడ ముస్లిములు అడ్డుకున్నారు. ’భారత్ మేం తిరంగా... పహరాయాతో దంగా‘‘ అంటే ’’భారతదేశంలో మువ్వన్నెల జెండా ఎగరేస్తే హింసాకాండ‘‘.. ఇది సబ్ సే తేజ్ అని చెప్పుకునే ఆజ్ తక్ పెట్టిన చర్చ. మతతత్వ అల్లర్లు రెచ్చగొట్టేలా వార్తలను ప్రసారం చేయడంలో అందెవేసిన చేయి సర్దానా ఈ చర్చ పెట్టాడు. విచిత్రమేమంటే అదే చానల్ కు చెందిన అశుతోష్ మిశ్రా కాస్ గంజ్ వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు, చివరకు ఒక హిందూ పూజారి కూడా చెప్పిన మాటలు సర్దానా పచ్చి అబద్దాలు చెబుతున్నాడని స్పష్టం చేశాయి. 
బిజేపి నాయకులు ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వినయ్ కతియార్ బిజేపి ప్రముఖ నాయకుడు. వరుసగా, ఆదిత్యనాథ్ లాగే గెలుస్తూ వచ్చిన నాయకుడేమన్నాడంటే ’’అక్కడ పాకిస్తాన్ పూజారులు వచ్చేశారు. వాళ్ళు భారత జెండాను గౌరవించడం లేదు. పాకిస్తాన్ జెండానే గౌరవిస్తున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.‘‘
సిఎన్ఎన్ ఐబిఎన్ రిపోర్టరు ఆయన్ను కలుసుకుని అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చినట్లు, పాకిస్తాన్ జెండా ఎగరేసినట్లు పోలీసులు చెప్పడం లేదు, జిల్లా మేజిస్ట్రేటు చెప్పడం లేదు, ఎఫ్ ఐ ఆర్ లో కూడా అలాంటి ప్రస్తావన లేదు. మీరెలా చెబుతున్నారు మహాశయా మీ దగ్గర ఆధారాలేమున్నయని అడిగినప్పుడు ముఖం చాటేసి వెళ్ళిపోయాడీ నాయకుడు.
కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ఏమన్నారో చూద్దాం, కాస్ గంజ్ సంఘటనను చూస్తే దేశద్రోహ శక్తులు జెండా యాత్రను సహించడం లేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై కఠినంగా వ్యవహరిస్తోంది. 
ఉత్తరప్రదేశ్ లో బిజేపి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బిజేపి ప్రభుత్వం ఉంది అయినా ఉత్తరప్రదేశ్ లో దేశద్రోహ శక్తులు వచ్చేస్తే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. అల్లర్లు జరిగి ఇన్ని రోజులు గడిచినా అసలు నిందితులెవరన్నది పేర్లు చెబుతున్నారే కాని అరెస్టులు ఎందుకు చేయడం లేదు? ఈ ప్రశ్నలకు జవాబులెవరి వద్దా లేవు.
సరే బిజేపి నాయకుల ప్రకటనలు, వారి వ్యాఖ్యలు, మీడియాలో కొన్ని శక్తుల ప్రచారాలు ఇవన్నీ చూస్తే వెంటనే అర్ధమైంది కాస్ గంజ్ లో ముస్లిములు త్రివర్ణ పతాకం ర్యాలీని అడ్డుకున్నారు, అల్లర్లకు పాల్పడ్డారు, హింసాకాండకు పాల్పడ్డారు. వినయ్ కతియార్ స్పష్టంగా ’’వాళ్ళు‘‘, ’’మేము‘‘ లాంటి పదాలు ఉపయోగించాడు. ఇది మొదట మీడియాలో వచ్చిన వార్తల వల్ల అర్ధమైన విషయం. కాని సత్యం దాచేస్తే దాగదు. అది ఎలాగూ బయటపడుతుంది.
హిందూత్వ శక్తులు చేస్తున్న ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఏబివిపి, విహెచ్పి ప్రచారం అబద్దాలపుట్ట అన్నది స్పష్టమైంది. కాస్ గంజ్ లోని ముస్లిం ప్రాంతంలో ముస్లిములు వీర్ అబ్దుల్ హమీద్ చౌక్ వద్ద రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుపై కుర్చీలు వేసి జెండా ఎగరేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాయి. సాధారణంగా ఇలాగే ప్రతి ప్రాంతంలోను జెండావందన కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రాంతంలోకి హిందూత్వ శక్తుల గుంపు మోటారు సైకిళ్ళపై వచ్చింది. వాళ్ళ చేతుల్లో భారత జాతీయ జెండాలతో పాటు కాషాయ జెండాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తమ ర్యాలీ అటు నుంచే వెళ్ళాలని పట్టుబట్టారు. కుర్చీలు వేసి ఉండడం వల్ల జెండా వందనం తర్వాత వెళ్ళవచ్చని, జెండావందనంలో పాల్గొనాలని అక్కడి వాళ్ళు చెప్పారు. కాని ర్యాలీలో ఉన్నవాళ్లు ఒప్పుకోలేదు. ఘర్షణ జరిగింది. 
ఈ విషయాన్ని అక్కడి ఐజి ధ్రువ్ కాంత్ ఠాకూర్ కూడా స్పష్టంగానే చెప్పాడు. అక్కడ ముస్లిములు రిపబ్లిక్ డే సందర్భంగా పతాకావిష్కరణ చేస్తున్నప్పుడు ఘర్షణ జరిగింది. మరి పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జెండా ఎగరేయడాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. అక్కడ ఎఫ్ ఐ ఆర్ లలో కూడా ఈ ప్రస్తావన ఎవరూ చేయలేదు. బిజేపి నాయకులు మతం చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఒకవైపు ఉంటే, ముస్లిములైనా, దళితులైనా ఎవరైనా జాతీయ పతాకం ఆవిష్కరించాలని అనుకున్నా అది వారికి వ్యతిరేకంగా మారిపోయే పరిస్థితి దేశంలో నెలకొంది.
ఆజ్తక్ వంటి చానళ్ళలో పనిచేసే రోహిత్ సర్దానా లాంటి యాంకర్లు మతం మంటలు మరింత ఎగదోయడానికి చేతనైనన్ని ప్రయత్నాలు చేశారు. ’’జాతీయ జెండా ఎగరేయాలన్న సంకల్పం బలంగా ఉన్న చందన్ తన ప్రాణాలను త్యాగం చేశాడని ట్వీటు చేశాడు. అక్కడెవరైనా జాతీయ జెండా ఎగరేయడాన్ని అడ్డుకున్నారా? అదే చానల్ కు చెందిన శ్వేతా సింగ్ ట్వీటు చేస్తూ భారతమాతాకి జై అనడమే పాపమా అంది. రెండువేల రూపాయల నోట్లలో ట్రాకింగ్ చిప్పు అనే చెత్త వార్తలు ప్రసారం చేసిన ఘనత ఈవిడదే. 
పాకిస్తాన్ జిందాబాద్ అననందుకే నా కొడుకును చంపేశారని ఆ అల్లర్లలో మరణించిన చందన్ గుప్తా తండ్రి చెప్పినట్లు కొన్ని పత్రికలు రాశాయి. ఈ వార్తకు నిర్ధారణ లేదు. మరో వ్యక్తి రాహుల్ ఉపాధ్యాయ్ కూడా అలాగే చనిపోయాడన్న వార్త గుప్పు మంది. స్వయంగా ఆ రాహుల్ ఉపాధ్యాయ పోలీసుల దగ్గరకు వెళ్ళి తాను బతికే ఉన్నానని, ఆ సంఘటనలు జరిగినప్పుడు అస్సలు కాస్ గంజ్ లోనే లేనని చెప్పుకున్నాడు. మరో చానల్ లో చర్చల సందర్భంగా చందన్ గుప్తా తండ్రి తన కుమారుడి మరణానికి కారణం ఉద్రిక్తతల వాతావరణం అని చెప్పినట్లు తెలిసింది. 
మొత్తానికి కాస్ గంజ్ విషయంలో అబద్దాలు, మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రధాన మీడియాలోను, సోషల్ మీడియాలోను తమ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తూ, మరోవైపు బిజేపి నేతలు స్వయంగా మతం చిచ్చు పెట్టే మాటలు చెబుతూ మరో ముజఫర్ నగర్ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. 
కాని ఈ ప్రయత్నాలకు జాతీయ జెండాను వాడుకోవడం అత్యంత శోచనీయం. చేతిలో జెండా పట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ధోరణి కనిపిస్తోంది. జాతీయ జెండా తమ చేతిలోనే ఉండాలి, ఇతరులు ఆ జెండాను పట్టుకున్నా సహించలేరు. కాస్ గంజ్ లో చేసిందిదే. అక్కడ జెండా వందనాన్ని అడ్డుకుని హింసాకాండ సృష్టించారు. బిజేపి ఇలా చేయడం ఇది కొత్త కాదు. జాతీయ జెండాను తమ రాజకీయ ప్రయోజనాలకు సాధనంగా మార్చుకోవడమూ కొత్త కాదు. 
కర్నాటకలో 1994లో హుబ్లీ లోని ఈద్గా మైదాన్ వద్ద జాతీయ జెండా ఎగరేస్తామంటూ చేసిన హంగామా ఇప్పుడు ఎవరికి గుర్తుండి ఉండదు. కాని అప్పటి హింసాకాండలో ఆరుగురు మరణించారు. అప్పుడు హుబ్లీలో జరిగిందే ఇప్పుడు కాస్ గంజ్ లోను జరిగింది. ముస్లిములకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి ఈ వ్యూహాన్ని బిజేపి ఎప్పటి నుంచో అమలు చేస్తూ వస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి కర్నాటకకు బిజేపి నేత ఉమాభారతి అప్పుడు ఈద్గా మైదాన్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడానికి వచ్చింది. రాజకీయంగా బిజేపికి ఈ కార్యక్రమం ఎంత ప్రముఖమైనదో దీన్ని బట్టి అర్ధం కావడం లేదా? ఇప్పుడు బిజేపిలోనే అనామక స్థాయికి దిగజారిన ఒకప్పటి బిజేపి నాయకుడు మురళీ మనోహర్ జోషి కూడా జెండా రాజకీయాలు నడిపాడు. ఇప్పుడు ప్రధాని కూడా తిరంగ యాత్ర గురించి మాట్లాడుతుంటారు. ఆరెస్సెస్ నాయకులు కేరళ వెళ్ళి తిరంగా ఏగరేసే కార్యక్రమాలు చేస్తుంటారు. వీధుల్లో మోటారు సైకిళ్లపై ముగ్గురేసి యువకులు జెండా పట్టుకుని హెల్మెటు కూడా లేకుండా వేగంగా వెళుతుంటారు. ఫిబ్రవరి 2017లో రామ్ జాస్ కాలేజి విద్యార్థులపై దాడి చేసిన తర్వాత ఏబివిపి ఢిల్లీ యూనివర్శిటీలో తిరంగా ర్యాలీయే తీసింది. ఈ వివరాలన్నీ ప్రొఫెసర్ అపూర్వానంద్ రాస్తూ అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్న జెండా నా జెండా కాదన్నారు. 
కాస్ గంజ్ కొత్త భారతదేశంలో కొత్త రాజకీయాలకు దర్పణం పడుతుంది. వ్యవస్థీకృత ఆటవిక దశలోకి క్రమంగా జారుకుంటున్న వైనాన్ని కళ్లకు కడుతోంది. మధుర సమీపంలోని కాస్ గంజ్ లో సాధారణ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. 22 సంవత్సరాల చందన్ ఈ అల్లర్లలో మరణించాడు. అతన్ని తుపాకితో కాల్చి చంపిందెవరో ఇంతవరకు ఖచ్చితంగా తెలియదు. పోలీసులు చెబుతున్న ప్రధాన నిందితుడిని వాళ్ళు ఇన్ని రోజులుగా ఎందుకు అరెస్టు చేయలేకపోయారో తెలియదు. మరో వ్యక్తి చనిపోయాడని అబద్దాలు ప్రచారంలో పెట్టారు. కాని అది అబద్దం అని తెలిసిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. 
కాస్ గంజ్ లో వినబడుతున్న ఆర్తనాదాలు, స్కూలు పిల్లల బస్సుపై కర్ణీసేన చేసిన దాడుల్లో వినిపించిన ఆర్తనాదాలు ఇవన్నీ ఒకే నిజాన్ని చాటి చెబుతున్నాయి. ప్రజలకు భద్రత కల్పించడంలో పాలనాయంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. గుంపుల హింసాకాండ నుంచి భారతదేశంలో రక్షణ పొందడం సాధ్యం కాదు. స్కూలు పిల్లల బస్సుపై దాడిని ఎంత సిగ్గులేకుండా సమర్థిస్తారో అంతే సిగ్గులేకుండా ప్రతి అబద్దాన్ని సమర్థించుకుంటారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను అడ్డుకుని పాకిస్తాన్ కి పొమ్మని చెప్పడమే కాదు, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారంటూ అబద్దాలను ప్రచారంలో పెట్టి జనాన్ని నమ్మిస్తారు. 
ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, ఒక ప్రాంతం వారు అక్కడ జెండావందనం చేసుకోవడంలో అభ్యంతరమేమిటి? మోటారు సైకిళ్ళపై జెండాలు పట్టుకుని ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి, ఘర్షణ వాతావరణం సృష్టించవలసిన అవసరమేముంది. అందరూ ప్రశాంతంగా జెండావందనం చేసుకోవచ్చు కదా. అలా ప్రశాంతంగా జరిగితే అందులో రాజకీయ ప్రయోజనాలు ఉండవు.
ఢిల్లీ యూనివర్శిటీ రామ్ జాస్ కాలేజిలో ఒక సెమినార్ ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు ఈ శక్తులు చేసింది ఇదే. ఆ సెమినార్ పై దాడి చేసి, విద్యార్థులను చితక్కొట్టి వారిని జాతి వ్యతిరేకులనీ, పాకిస్తాన్ ఏజంట్లని, దేశద్రోహులనీ ప్రచారం చేశారు. దొంగ వీడియోలు, మార్ఫింగ్ చేసిన వీడియోలు ప్రచారంలో పెట్టిన విషయం కూడా తర్వాత బయటపడింది. ఆ తర్వాత ఈ శక్తులే ఢిల్లీ యూనివర్శిటీలో తిరంగా ర్యాలీ తీశాయి. జెఎన్ యు విషయంలోను మార్ఫింగ్ వీడియోల కథ బయటకు వచ్చింది. కొన్ని న్యూస్ చానళ్ళు ఈ వీడియోలనే ప్రసారం చేస్తూ మతతత్వ శక్తులకు కావలసిన సహాయం అందించాయి. 
కాస్ గంజ్ జిల్లా పోలీసు సూపరిండెంటు సునీల్ కుమార్ సింగ్. కాస్ గంజ్ లో సంఘటనల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నట్లు ఆయన సూచనాప్రాయంగా మాట్లాడాడు. తిరంగా యాత్ర చేపట్టి మోటారు సైకిళ్లపై బయలుదేరిన ఏబివిపి, విహెచ్పి కార్యకర్తలు ఈ ర్యాలీకి పోలీసు అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పాడు. చందన్ గుప్తాను కాల్చిందెవరో ఖచ్చితంగా తెలియదు. నౌషాద్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోజున ట్రాఫిక్ లో కారు ఇరుక్కుని కూర్చుని ఉన్న అక్రమ్ అలీపై పదునైన ఆయుధంతో దాడి జరిగింది. ఈ సంఘటనలు జరిగిన కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న బిజేపి ఎంపి రాజ్ వీర్ సింగ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే కాదు, జిల్లాలోని పోలీసు అధికారులతో విచారణ జరిపించరాదని అన్నాడు. దానికి కారణం జిల్లా యస్.పి. చెప్పిన నిజాలు. తిరంగా ర్యాలీలో పాల్గొన్నవారు రెచ్చగొట్టే నినాదాలు చేయడమే ఘర్షణకు కారణమని జిల్లా యస్. పి. స్పష్టంగా చెప్పాడు. యస్.పి. చెప్పిన మాటలు అక్కడి వీడియో ఫుటేజి చూస్తున్నప్పుడు నిజమే అనిపిస్తాయి. కాని ఆ యస్.పి.ని వెంటనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీరట్ లోని పోలీసు శిక్షణా కళాశాలకు బదిలీ చేసింది. మరణించిన చందన్ గుప్తా కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. 
రాజకీయ పార్టీల ఆశీర్వాదం ఉంటే చాలు గుంపు హింసాకాండ అడ్డు అదుపు లేకుండా కొనసాగే సంస్కృతి ఇప్పుడు స్థిరపడినట్లే కనిపిస్తోంది. చరిత్రను పరిశీలిస్తే జర్మనీలోను హోలోకాస్ట్ కు ముందు, కాంసంట్రేషన్ క్యాంపులకు ముందు ఇలాంటి స్థితే ఉండేది. ఇప్పుడు అనేక సముదాయాలు ముట్టడికి గురవుతున్నాయి. రచయితలు, ఫిల్మ్ మేకర్లు, యాక్టర్లు, విద్యార్థులు, అసమ్మతి స్వరం వినిపించే జర్నలిస్టులు అందరు ముట్టడికి గురవుతున్నారు. ముస్లిములు, దళితులపై తీవ్రమైన ఒత్తిడి పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితేమిటంటే, ఈ వర్గాలు జాతీయజెండా ఎగరేయాలన్న అనుమతి తీసుకోక తప్పదనిపిస్తోంది. మతతత్వ శక్తుల అనుమతి లేనిదే సినిమాలు విడుదల కావు. పుస్తకాలు నిషేధానికి గురవుతాయి. చరిత్రను తిరగరాస్తారు. డార్విన్ తప్పో ఒప్పో శాస్త్రవేత్తలు చర్చించడం జరగదు, రాజకీయ నాయకులు తీర్మానించేస్తారు. యూనివర్శిటీల్లో రాజకీయాలు వికృతంగా మార్చేస్తారు. మీడియాను సాగిలబడేలా చేస్తారు. చివరకు స్కూలుబస్సులో పిల్లలను కూడా వదిలిపెట్టరు. రాజస్థాన్ లో కూలివాడి హత్యను వీడియో తీసిన అమానుషాన్ని సమర్ధించేవాళ్ళు కూడా పుట్టుకొస్తారు. హంతకుడి ఖాతాకు డబ్బులు పంపిస్తారు. ఈ గుంపులు ఒకటి తర్వాత ఒకటిగా విజయాలు సాధిస్తున్నాయి. అక్లాక్ ను ఇంటిలో చంపాయి, పహ్లూ ఖాన్ ను రోడ్డుపై చంపాయి, జునైద్ ను రైల్లో చంపాయి... ఎక్కడైనా ఎప్పుడైనా చంపగలమని చెబుతున్నాయి. మతతత్వ రాజకీయాలు నడిపేవారు ఆనందంగా ప్రతి విజయాన్ని చూస్తున్నారు. ఇలాంటి సమాజం ఉన్నంత కాలం తమదే అధికారమన్నది వారికి బాగా తెలుసు. ఒక విష వలయం లాంటి హింసాకాండలో వినాశం వైపు ప్రయాణించడం కొనసాగుతోంది.

No comments:

Post a Comment