Monday, 1 January 2018

వేలిముద్రలే వేశాయి బేడీలు

వేలిముద్రలే వేశాయి బేడీలు 
మౌజన్‌ హత్య కేసులో వీడిన చిక్కుముడి
నిందితుడు అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మణిగా గుర్తింపు
చోరీ కోసం వచ్చి దారుణానికి ఒడిగట్టిన వైనం

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరం లాలాచెరువులోని ప్రార్ధనా మందిరంలో గత నెల 28వ తేదీ అర్ధరాత్రి తరువాత జరిగిన ‘మౌజన్‌’ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. నిందితుడు కరడుగట్టిన నేరస్థుడు అని తెలిసింది. నేరం చేసే సమయంలో క్రూరమైన, విపరీత ధోరణితో ప్రవర్తించే నేరస్థుడుగా పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ హత్యోదంతంలో చిక్కుముడిని అతికష్టంపై పోలీసులు విప్పగలిగారు. సంఘటన స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మణి ఈ కేసులో నిందితుడని పోలీసులు తేల్చారు.రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు ప్రాంతంలో మణి సోదరుడు నివాసముంటున్నట్లు తెలిసింది. ఇలా రాజమహేంద్రవరానికి వచ్చిపోతున్న మణి కొన్ని రోజుల కిందట ఇక్కడ దొంగతనం చేసి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో దొంగతనం చేసేందుకు తిరుగుతూ లాలాచెరువు వద్ద ప్రార్ధనా మందిరంలోకి చొరబడి మౌజన్‌గా ఉన్న ఫరూక్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రార్థనామందిరం సమీపంలో నిర్మాణంలో ఉన్న గృహం వద్ద కర్రను సంపాదించిన దొంగ ప్రార్ధనా మందిరం గేటు దూకి లోపలకు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నిద్రపోతున్న ఫరూక్‌ కదలడంతో తలపై కర్రతో విచక్షణారహింగా మోది ఉంటాడని భావిస్తున్నారు. అనంతరం ఫరూక్‌ జేబులోని ప్రార్ధనామందిరం తాళాలు తీసుకుని లోపలకు ప్రవేశించి అంతా వెతకడంతో పాటు డబ్బీ తెరిచి డబ్బులు తస్కరించి విలువైన వస్తువులను చోరీ చేసి ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పొగరప్పించే ప్రక్రియలో భాగంగా గుడ్డను అంటించి ఏసీపైకి పెట్టడంతో ఏసీ పైన ప్లాస్టిక్‌ భాగం అంటుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫరూక్‌ హత్యతో రెండు రోజుల పాటు ప్రార్థనా మందిరం ఉన్న లాలాచెరువు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా దీనిపై క్లూస్‌టీం దర్యాప్తునకు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు శని,ఆదివారాల్లో ప్రార్థనా మందిరాన్ని నిశితంగా పరిశీలించిన క్లూస్‌టీం బృందం అక్కడ సేకరించిన వేలిముద్రలను పలువురు నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చారు. ఈ క్రమంలోనే వేలిముద్రలు పాత నేరస్థుడు మణివిగా గుర్తించిన పోలీసులు అతని కోసం నిఘా ఉంచారు. నేరం అనంతరం తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిన నిందితుడు సోమవారం ఉదయం అనంతపురం జిల్లా ఉరవకొండకు రావడంతో అనంతపురం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన మౌజన్‌ హత్య కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో పాటు నేరపరిశోధన బృందాలను రంగంలోకి దింపింది. 

No comments:

Post a Comment