Saturday, 25 November 2017

ఖిల్జీ కోటలో ప్రేమ కథ!

ఖిల్జీ కోటలో ప్రేమ కథ!
26-11-2017 00:43:50
http://www.andhrajyothy.com/artical?SID=497186

వెంకన్న ప్రేమలో ఖిల్జీ వారసురాలు!
తెరపైకి బీబీ నాంచారి కథ
బాలాజీ విగ్రహంతో ఆమె ప్రేమ
స్వామినే పెళ్లాడతానని పట్టు
అంగీకరించిన రాజు ముబారక్‌
న్యూఢిల్లీ, నవంబరు 25: ఆ రాణీ ప్రేమ పురాణం... ఆ ముట్టడికైన ఖర్చు... ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం! అని సింపుల్‌గా తేల్చేయద్దు! నాటి చరిత్రలే నేడు సినిమాలకు కథా వస్తువులవుతున్నాయి. ఆ సినిమాలే ఎడ తెగని వివాదాలనూ సృష్టిస్తున్నాయి. అటు రతన్‌సింగ్‌- రాణీ పద్మిని మధ్య ప్రేమ... ఇటు చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్‌ ఖిల్జీ ముట్టడి రెండూ కలగలిసిన చారిత్రక గాథ... ‘పద్మావతి’! ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదం నేపథ్యంలో... చరిత్రను తవ్వుతున్నప్పుడు సరికొత్త, ఆసక్తికరమైన అంశాలూ బయటపడుతున్నాయి.

అందులో ఒకటి... బీబీ నాంచారి కథ! బీబీ నాంచారి వెంకటేశ్వరస్వామి భక్తురాలు! ఇంకా చెప్పాలంటే... స్వామి పట్ల ఆమెది భక్తిని మించిన తన్మయత్వం! 8వ శతాబ్దిలో ఆండాల్‌, 16వ శతాబ్దిలో మీరాబాయిలాగే ఆమె కూడా దేవుడినే ప్రేమించింది. పెళ్లాడింది. ఈ విషయం అందరికీ తెలుసు! కొందరికే తెలిసిన సంగతి ఏమిటంటే... బీబీ నాంచారి అల్లావుద్దీన్‌ ఖిల్జీ వారసురాలు! భారత్‌పై దండెత్తి హిందూ రాణులను చెరపట్టడమే లక్ష్యంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ కదం తొక్కగా... ఆయన వారసురాలైన బీబీ నాంచారి మాత్రం హిందువులు ఆరాధించే వెంకటేశ్వరస్వామి ప్రేమలో పడటమే ఇక్కడ వైచిత్రి! పలు చారిత్రక గ్రంథాల ప్రకారం... అల్లావుద్దీన్‌ ఖిల్జీ వాఘేలా కోటపై దాడి చేసి... రాయ్‌ కర్ణదేవ్‌-2ను ఓడించాడు.

కర్ణదేవ్‌ తన కుమార్తెతో దేవల్‌ దేవితో కలిసి దేవగిరికి పారిపోయాడు. ఆయన భార్య కౌలా దేవిని మాత్రం ఖిల్జీ చెరబట్టాడు. అయితే... కాలక్రమంలో ఆమె కూడా ఖిల్జీ విశ్వాసాన్ని చూరగొంది. దేవగిరికి పారిపోయిన తన కుమార్తె దేవల్‌ను వెనక్కి తీసుకురావాలని ఖిల్జీని కోరింది. ఇందుకు ఖిల్జీ అంగీకరించాడు. ఈ పనిని... తన సైన్యాధిపతి మాలిక్‌ కఫూర్‌కు అప్పగించాడు.

1303లో కఫూర్‌ ఈ పని దిగ్విజయంగా పూర్తి చేశాడు. అదే సమయంలో... దక్షిణాదిలోని పాండ్య రాజులపైనా కఫూర్‌ దాడులు చేశాడు. వారిని ఓడించి... నగలు, విగ్రహాలు, ఇతర సంపదను కొల్లగొట్టి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అలా దోచుకున్న వాటిలో వెంకటేశ్వరస్వామి విగ్రహం కూడా ఉంది. ‘ఇదిగో ఈ బొమ్మతో ఆడుకో’ అంటూ ఖిల్జీ వంశంలో జన్మించిన బీబీ నాంచారికి ఇచ్చారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరణానంతరం అంతఃపుర కుట్రలు, కూహకాల్లో పెరిగిపోయాయి. మాలిక్‌ కఫూర్‌ హత్యకు గురయ్యాడు. ఖిల్జీ కుమారుడు ఖిజ్ర్‌! ఖిజ్ర్‌ కొడుకు ముబారక్‌! అతను పరమ క్రూరుడు. సొంత అక్క చెల్లెళ్లనే చంపేశాడు. తానే రాజు అయ్యాడు. అంతటి క్రూరుడు బీబీ నాంచారిని మాత్రం ఆదరించాడు.


తాను వెంకటేశ్వరస్వామినే వివాహమాడతానని బీబీ నాంచారి చెప్పగా అందుకు అంగీకరించాడు. అంతేకాదు... మాలిక్‌ కఫూర్‌ దక్షిణ భారత దేశ ఆలయాల నుంచి లూటీ చేసిన విగ్రహాలన్నింటినీ తిరిగి ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. మరోవైపున... కర్ణాటకలోని మెల్కోటెలోని శ్రీవైష్ణవ మఠ అధిపతి రామానుజాచార్య... స్వామి వారి విగ్రహాలను వెనక్కి తీసుకువచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరాడు.

విగ్రహాలతోపాటు బీబీ నాంచారి కూడా రామానుజాచార్య బృందంతో బయలుదేరింది. అయితే.. ఈ ప్రయాణంలో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. 1316లో వెంకటేశ్వరస్వామి (విగ్రహం)తో ఆమె వివాహం జరిగింది. మెల్కోటెలోని చెల్లపిల్లరాయ ఆలయంలో ఉంటూ... శ్రీవారి సేవలో తరించింది. అక్కడే మరణించింది. ఆమె సమాధి చెల్లపిల్లరాయ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ‘పద్మావతి’పై వివాదం చెలరేగుతున్న సమయంలో బీబీ నాంచారి కథ ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment