Tuesday, 21 November 2017

ఆ రాణీ ప్రేమ పురాణం..

ఆ రాణీ ప్రేమ పురాణం..
19-11-2017 00:57:24

హిందీ రాష్ర్టాలను కుదిపేస్తున్న పద్మావతి సినిమా
పద్మావతి... ఇప్పుడు దేశమంతా పలవరిస్తున్న పేరు. బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తీసిన సినిమాలో ఆమె చరిత్రను వక్రీకరించారని, ఆమె ఔన్నత్యాన్ని మంటగలిపారని హిందూ అతివాదులు భగ్గుమంటున్నారు. రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌లలో ఇదొక పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఇంతకీ పద్మావతి ఎవరు? ఆమె అసలు చరిత్ర ఏమిటి? వివరాల్లోకి వెళితే...

చిత్తోర్‌గఢ్‌ రాణి పద్మావతి చరిత్రకు సంబంధించి జానపదులు పాడుకొనే పాటలు, మాలిక్‌ మొహమ్మద్‌ జయాసీ అనే సూఫీ కవి 1530లో రాసిన కవిత మాత్రమే ఆధారాలుగా ఉన్నాయి. పద్మావత్‌ పేరుతో అవధీ భాషలో రాశాడాయన. విశేషమేమంటే ఇప్పటికీ అవధీలో ‘పద్మావత్‌’ అనే మాండలికం ఉంది. అందులో చాలామంది మాట్లాడతారు కూడా! అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరణించిన 224 ఏళ్ళకు జయాసీ ఆ కవితను రాశాడు. గానం చేశాడు.

కథ విషయానికొస్తే పద్మావతి అపురూప సౌందర్యరాశి. సింహళదేశ రాజకుమారి. చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుణ్ణి పెళ్ళాడుతుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్‌ ఖిల్జీ- ఆమె కోసం చిత్తోర్‌గఢ్‌పైకి దండెత్తుతాడు. ఆమె అతనికి దక్కదు. ఓ యుద్ధం లో భర్త మరణించడంతో సతీ సహగమనం చేస్తుంది. ఇదీ స్థూలంగా కథ. అయుతే ఈ కథ కరెక్ట్‌ కాదనీ, అసలిలాంటి కథే లేదనీ, ఒఠ్ఠి కల్పన అనీ వాదించేవారూ ఉన్నారు.

పద్మావతి-1
జయాసీ రాసిన కథ
పద్మావతిని రాణి పద్మిని అని ముద్దుగా పిలిచేవారు. ఆమెకు చాలా మంది నెచ్చెలులతో పాటు హీరామన్‌ అనే పలుకు నేర్చిన రామచిలుక కూడా ఉండేది. రోజంతా కూతురు చిలుకతో గడపడం చూసి సింహళ రాజు గంధర్వసేనుడికి చిరాకెత్తేది. చిలుకను చంపించాలనుకుంటాడు. విషయం తెలిసిన పద్మావతి ఆ చిలుకను స్వేచ్ఛగా ఎగరేసేస్తుంది. దాన్ని పిట్టలమ్ముకునే ఓ వ్యక్తి పట్టుకొని చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుడికి ఇస్తాడు. పద్మావతి రూప లావణ్యాల గురించి ఆ చిలుక రత్నసేనుడికి కథలు కథలుగా చెబుతుంది. దాంతో రత్నసేనుడు ఎలాగైనా పద్మావతిని తన దాన్ని చేసుకోవాలనుకుంటాడు.

అజ్ఞాతంగా ఆమెను కలవాలనుకుంటాడు.. పరమ నైష్ఠికుడైన భక్తుడి వేషంలో సింహళ దేశానికి పయనమవుతాడు. ఆయన వెంట 16 వేల మంది సైన్యం ఉంటుంది. మహాశివభక్తుడైన రత్నసేనుడు- అక్కడి శివాలయంలో పూజలు చేస్తున్న సమయంలో పద్మావతి వచ్చి వెళుతుంది. ఆమెను చూడలేక పోయాననే బాధతో చనిపోవాలనుకుంటాడు. కానీ శివపార్వతులు ప్రత్యక్షమై, కోటకు వెళ్ళి యువరాణిని కలవమని చెబుతారు. భక్తుడి వేషంలోనే కోటకు వెళ్ళినపుడు సింహళరాజు అతనిని బంధించి ఉరి తీయాలని ఆజ్ఞాపిస్తాడు. రత్నసేనుడి వెంట వచ్చినవారు ఆయన అసలు రూపం ఏంటో చెప్పడంతో సంతోషపడి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. అతనికి 16 వేల మంది పద్మినీ జాతి స్త్రీలను కూడా ఇస్తాడు.

వారంతా పద్మావతి వెంట చిత్తోర్‌గఢ్‌ వెళతారు. తిరుగు ప్రయాణంలో సముద్ర తుఫానులో ఇరుక్కుంటారు. శివుడి దయతో బయటపడతారు. తరువాత పద్మావతితో కలిసి చిత్తోర్‌గఢ్‌ చేరతాడు. అప్పటికే అతనికి నాగమతి అనే భార్య ఉంటుంది. ఒకనాడు ఏకాంత సమయంలో పద్మావతితో ఉన్నపుడు- ఆమెకు బంటు రాఘవ చేతనుడనే బ్రాహ్మణుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చేస్తాడు. ఆగ్రహించిన రత్నసేనుడు అతనికి దేశ బహిష్కారం విధిస్తాడు. దేశం విడిచివెళ్లిపోయే ముందు అతనికి పద్మావతి ఓ అపురూపమైన గాజుల జత ఇస్తుంది. చిత్తోర్‌గఢ్‌ విడిచి ఢిల్లీ వెళ్లిపోయిన రాఘవ చేతనుడు అక్కడ ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీని కలుస్తాడు. ఆ గాజుల జత గురించి ఖిల్జీ అడిగినపుడు పద్మావతి గురించి, ఆమె సౌందర్యం గురించి రమణీయంగా చెబుతాడు.


ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోడానికి ఛిత్తోర్‌గఢ్‌పై దాడికి వెళతాడు. యుద్ధంలో గెలవలేకపోతాడు. చివరకు సంధికి అంగీకారం కుదురుతుంది. ఖిల్జీని కోటలోకి ఆహ్వానిస్తాడు రత్నసేనుడు. అక్కడ ఖిల్జీ లీలామాత్రంగా పద్మావతిని దర్శిస్తాడు తప్పితే ఆమె దక్కదు. సంధికి ఒప్పుకున్నట్లే నటించి ఖిల్జీ రత్నసేనుణ్ణి బంధించి ఢిల్లీ తీసికెళ్ళిపోతాడు. భర్తను విడిపించమని ఇద్దరు సైన్యాధికారులను ఢిల్లీకి పంపుతుంది పద్మావతి. విడిపించే క్రమంలో ఒకరు సుల్తాన్‌ సైనికులతో పోరాడి చనిపోగా, మరొకరు రాజును క్షేమంగా తీసుకొస్తారు. రాజు లేని రాజ్యమని తెలుసుకున్న పొరుగు రాజు దేవపాలుడు అప్పటికే పద్మావతిని దక్కించుకోడానికి సైన్యంతో వస్తాడు. రత్నసేనుడు దేవపాలుడితో తలపడతాడు. యుద్ధంలో వీరిద్దరూ మరణిస్తారు. వార్త విన్న పద్మావతి సతీ సహగమనం చేస్తుంది.

రత్నసేనుడి తొలిభార్య నాగమతి కూడా చితిలో దూకి మరణిస్తుంది. ఇదీ కథ. కొన్నాళ్ళ తరువాత ఖిల్జీ మరోసారి చిత్తోర్‌గఢ్‌పై దండెత్తుతాడు. అతనికి లొంగక అక్కడి రాణివాస స్ర్తీలంతా సామూహికంగా ఆత్మాహుతికి పాల్పడతారు. ఇప్పటికీ వారు చితిపేర్చి మరణించిన స్థలం- జౌహార్‌ కుండ్‌ -చిత్తోర్‌గఢ్‌ సమీపంలో ఉంది. దర్శనీయ స్థలాల్లో అదీ ఒకటి. చిత్తోర్‌గఢ్‌ రాణీ దక్కలేదు. అక్కడి ప్రజలూ ఇస్లాంలోకి మారలేదు. రాళ్ళూ ఇటుకలతో చేసిన కోటను మాత్రం ఖిల్జీ ఇస్లాంలోకి మార్చగలిగాడన్న చిన్న సెటైర్‌తో తన గేయాన్ని ముగిస్తాడు జయాసీ.

పద్మావతి-2
పద్మావతి గురించి ప్రచారంలో ఉన్న రెండో కథా జయాసీ రాసినదే.. రాజ్‌పుట్‌ లు ఎక్కువగా నమ్మే కథ ఇది.. దాని ప్రకారం- రాణి పద్మావతి సింహళదేశ రాజకుమార్తె. కత్తియుద్ధంలో ఆమెకు ఎవరూ సాటిలేరు.. తాను చెప్పిన వ్యక్తిని కత్తియుద్ధంలో ఓడించే వీరుణ్ణే పెళ్లాడతానంటూ ప్రకటిస్తుంది. అయితే పద్మావతి సూచించిన ఆ వ్యక్తి వేరెవ్వరో కాదు.. ఆమే.. చాలా మంది రాజులు ఆమె చేతిలో ఓడిపోతారు.. చివరకు రాజ్‌పుట్‌ రాజైన చిత్తోర్‌గఢ్‌ రాజు రత్నసేనుడు గెలుస్తాడు.. అతనిని వరిస్తుంది పద్మావతి. ఇక ఆమెకు బంటు అయిన రాఘవ చేతనుడు- భూతప్రేత పిశాచాలను ఆవాహన చేసే మాంత్రికుడు.. అతనిని రత్నసేనుడు దేశం నుంచి వెలివేయడంతో ఖిల్జీ దగ్గరకు చేరి పద్మావతి గురించి కీర్తిస్తాడు.. అది విన్న ఖిల్జీ ఆమె కోసం దండెత్తినపుడు- రత్నసేనుడు ఆ యుద్ధంలోనే మరణిస్తాడు... అది విని- పద్మావతి- ఖిల్జీకి దక్కకుండా రహస్య మార్గంలో జౌహార్‌ కుండ్‌ చేరి చితిలో దూకి మరణిస్తుంది..

పద్మావతి-3
ఈస్టిండియా కంపెనీలో పనిచేసిన జేమ్స్‌ టాడ్‌ అనే అధికారి రాజ్‌పుట్‌ చరిత్రను పరిశోధించి మరో కథ ప్రచురించాడు.. ఇది జయాసీ కథ కు కొద్దిగా భిన్నంగా ఉంటుంది.. పద్మావతి సింహళ దేశ ప్రభువైన హమీర్‌ శంక్‌ కుమార్తె.. ఆ సమయంలో చిత్తోర్‌గఢ్‌ను పాలించిన రాజు లక్ష్మణ్‌సింగ్‌. ఇతని బంధువైన భీమ్‌సింగ్‌ (భీమ్‌సీ) ను పెళ్ళి చేసుకుంటుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండెత్తుతాడు. పద్మావతి దక్కకపోవడంతో- సంధికొచ్చి- తానుకేవలం పద్మావతి అందం చూసి వెళ్ళిపోతానంటాడు. అయితే ఓ అద్దంలో ఆమె ప్రతిబింబం మాత్రమేఅతనికి కనబడుతుంది.దాంతో భీమ్‌సీని బంధించి - పద్మావతిని తనకిస్తేనే అతనిని విడుదల చేస్తానంటాడు. దాంతో పద్మావతి సింహళీయులనైన తన బంధువుల సాయం కోరుతుంది. ఆమె మేనమామలు- గోరా, బాదల్‌- ఓ వ్యూహంతో భీమ్‌సీని విడిపిస్తారు. వీరులైన 700 రాజ్‌పుత్‌ సైనికులను చెత్తబుట్టల్లో దాచి- వాటిని మోసే వారిగా మరో 700 మంది వీరులను రహస్యంగా పంపి ఖిల్జీని ఎదిరిస్తారు. చిన్నవాడైన తన కొడుకును సురక్షితంగా వేరే ప్రదేశానికి పంపి- ఖిల్జీతో పోరాడుతూ భీమ్‌సీ మరణిస్తాడు. పద్మావతి జౌహార్‌ కుండ్‌లో సహగమనం చేస్తుంది..

ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటంటే..
రత్నసేనుడికి ప్రభావతి అనే భార్య ఉంటుంది. ఆమె గొప్ప వంటకత్తె.. ఓ రోజు రాజు ఆమెను విసుక్కుంటాడు. దాంతో ఆమె- నా కంటే బాగా ఎవరైనా వంటచేయగలరా, అసలు నా కన్నా ఎవరైనా అందంగా ఉంటారా అని రాజును నిలేస్తుంది.. దాంతో రత్నసేనుడు - కొందరి ద్వారా పద్మిని గురించి విని-సింహళదేశానికి వెళ్ళడం, ఆమెను పెళ్లాడడం జరుగుతాయి..మిగిలిన కథంతా పాతదే.. సూఫీ కవి రాసిన గేయం కల్పన అనీ, సూఫీ సాహిత్యంలో దాన్ని గొప్ప రచనగా చెప్పగలం గానీ అది వాస్తవిక గాథ కాదనీ చాలామంది చరిత్రకారులు అంటున్నారు.
హోం తాజావార్తలు
‘పద్మావతి’ వివాదం : దీపిక, భన్సాలీలపై మండిపడ్డ యోగి
21-11-2017 13:31:16

లక్నో : ‘పద్మావతి’ సినిమాపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంస్థలు నిరసనలు, హెచ్చరికలు చేయడానికి సంజయ్ లీలా భన్సాలీ, దీపిక పదుకోన్ సమానంగా బాధ్యులేనని పేర్కొన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆ వ్యక్తి సంజయ్ లీలా భన్సాలీ అయినా, మరొకరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. చంపుతామని హెచ్చరించేవాళ్ళు నేరస్థులైతే, భన్సాలీ కూడా ప్రజల మనోభావాలను గాయపరచినందుకు నేరస్థుడేనని తెలిపారు. అటువంటి హెచ్చరికలు చేసినవారిపైనా, అదేవిధంగా ఫిలిం మేకర్లపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆ రాణి ప్రేమ పురాణం

సెన్సార్ కష్టాలు
Home  వార్తలు  సినిమా వార్తలు  పద్మావతికి సెన్సార్ కష్టాలు

పద్మావతికి సెన్సార్ కష్టాలుNov 18, 2017, 09:17430
సంజయ్ లీలా భన్సాలీ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం పద్మావతి .
రాజ్‌పుత్‌ మహారాణి పద్మావతి. ఈ చరిత్రను చరిత్రను భన్సాలీ చరిత్ర ను తప్పుదోవ పట్టించేలా , పద్మావతి పాత్రను నీచంగా చిత్రీకరించాడని రాజపుట్ ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ ఆందోళనలు ఒక్క రాజస్థాన్ కాకుండా మరి కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించడం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తుంది . .రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్‌ కోట ముఖద్వారం ఎదుట ఆందోళన కారులు బైఠాయించి పర్యాటకులను ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా అడ్డుకొడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయ వలసి వచ్చింది .
ఇదిలా ఉండగా సెన్సార్ వారు ఈ చిత్రాన్ని చూడకుండా అప్లికేషన్ అసంపూర్ణంగా వున్నదని దానిని సరిచేసి తిరిగి పంపమని నిర్మాతలకు కబురు పంపించడం మరింత ఆందోళన కలిగించే విషయం, కారణం పద్మావతి సినిమాను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యాలని సంజయ లీల భన్సాలీ ఇప్పటికే ప్రకటించాడు . ఈ నేపథ్యంలో సెన్సార్ వారు ఈ రకంగా కొర్రీ పెట్టడం చేస్తుంటే ఇది కావాలనే చేస్తున్నారని ప్రొడక్షన్ హౌస్ కు చెందిన వారు అంటున్నారు .
ఇవ్వాన్ని చూస్తుంటే పద్మావతి సినిమా డిసెంబర్ 1న విడుదలవుతుందా ? కాదా ? అనే అనుమానం వస్తుంది .

జీఈఎస్‌కు దీపిక డుమ్మా
21-11-2017 02:31:39

న్యూఢిల్లీ, నవంబరు 20: పద్మావతి చిత్ర వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటి దీపికా పడుకోన్‌ హైదరాబాద్‌లో 28న ప్రారంభమయ్యే ప్రపంచ వాణిజ్య సదస్సు (జీఈఎస్‌)కు డుమ్మా కొట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆమె సమాచారం పంపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా దుమారానికి కారణమైన పద్మావతి చిత్రంలో దీపిక టైటిల్‌ రోల్‌లో నటించింది. ‘పద్మావతి’పై వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో చిత్రం విడుదల వాయిదా పడింది. జీఈఎస్‌కు గైర్హాజరవ్వాలని దీపిక నిర్ణయించుకోవడానికి చిత్ర వివాదమే కారణమని తెలుస్తోంది.

No comments:

Post a Comment