Monday, 13 November 2017

Bandenaka bandi katti - Song on Pratapa Reddy dora

Omar Shaik
November 12 at 7:55pm
నిజాం మీద జరిగినంత విష ప్రచారం బహుషా ప్రపంచంలో ఏ పాలకుని మీదా జరిగి ఉండదు. నిజాం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రమహాసభ కాని, కమ్యూనిస్టు పార్టీ కాని విమర్శించిన దాఖలాలు లేవు. హైదరాబాదు విలీన సమయంలో రజాకార్ల అరాచకాలు జరుగుతున్న సందర్భంలో కూడ నిజాంను విమర్శించలేదు. రజాకార్ల చర్యలను కాశీంరజ్వీ ఉన్మాదంగానే చూసిండ్రు కాని నిజాంకు అంటగట్టలేదు.
కమ్యూనిస్టులు సాయుధ పోరాటంగా ప్రచారం చేసుకునే జనగామ తాలూకా పోరాటం ముగిసిన తర్వాత కూడ ఇరవై ఐదేండ్లు ఏ ఉద్యమకారుడు విమర్శించలేదు. అసలు ఆ పోరాటాన్ని కమ్యూనిస్టులే పట్టించుకోలేదు. 1969 తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా కమ్యూనిస్టులు పోరాట రజతోత్సవాలు జరుపుకునే సందర్భంలో మాత్రమే నిజాం మీద విషప్రచారం చేసే పుస్తకాలు అచ్చేసిండ్రు. ఆ తర్వాతనే చరిత్రను వక్రీకరించి నిజాంను విలన్ గా చిత్రీకరించిండ్రు.
అటువంటి వాతావరంలో గౌతం ఘోష్ దర్శకత్వంలో బి.నరసింగరావు ‘మా భూమి’ సినిమా తీసిండు. ఈ సినిమా కథ కోసం చరిత్రను వక్రీకరించిండ్రు. నిజాం అరాచకాలంటూ రజాకార్ల అరాచకాలను చూపిండ్రు. ఈ సినిమా కోసం, అంతకు ముందు భూస్వాములకు వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చిన పాటలను కూడ వక్రీకరించి నిజాంకు అంటగట్టిండ్రు.
అట్ల వక్రీకరణకు గురైన పాట ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి…’ అనే పాట. నిజానికి ఈ పాట నిజాంకు వ్యతిరేకంగా రాసింది కాదు, పాడింది కాదు. అసలు ఈ పాట పుట్టింది ఎర్రపాడు భూస్వామి జెన్నారెడ్డి ప్రతాపరెడ్దికి వ్యతిరేకంగా. ఈ పాట అసలు స్వరూపం ఇది :
బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె పోతవ్ కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి
దొడ్లన్ని కాలిపాయె
ఎడ్లన్ని ఎల్లిపాయె
ఇకనైన లజ్జ లేదా
నా కొడక ప్రతాపరెడ్డి
గొల్లోళ్ల గొర్లు వొడిసె
రైతోళ్ల బియ్య మొడిసె
ఇక ఏమి తింటవ్ కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి
పెదపంది సూరిగాడు
సినపంది మల్లిగాడు
మీ ఇద్దరిని తింటం కొడకో
నా కొడక ప్రతాపరెడ్డి!
ఇది అసలు పాట అయితే తర్వాత ఈ పాటను మార్చి మరో పాటను ప్రచారం చేసిండ్రు. చివరికి ఈ పాట పల్లవిని తీసుకొని ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పాటను నిజాంకు వ్యతిరేకంగా అల్లిండ్రు.
బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె పోతవ్ కొడకో
నైజాము సర్కారోడా
ఇట్ల వక్రీకరించిన ఈ పాటనే సినిమాలో గద్దర్ పాడిండు. సినిమా ప్రభావంతో అది జనంలోకి పోయింది. అదే నిజమైన పాటగా జనం నమ్ముతుండ్రు. ఆ పాట ఉద్యమ సమయంలో నిజాంకు వ్యతిరేకంగా పాడిన పాటగా గుర్తింపు పొందింది. కాని అది నిజాంకు వ్యతిరేకంగా పుట్టిన పాట కాదు. ఎర్రపాడు దొర జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాసి పాడిన పాట! ఇది సత్యం. ఇది చరిత్ర.

No comments:

Post a Comment