Saturday, 19 September 2015

మోదీ సర్కార్‌కు తలనొప్పిగా మారిన వివాదాస్పద వ్యాఖ్యలు

మోదీ సర్కార్‌కు తలనొప్పిగా మారిన వివాదాస్పద వ్యాఖ్యలు
Updated :19-09-2015 18:26:51
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 19: ముస్లింలు దేశ భక్తులు కారా? చాలా మంది బీజేపీ ప్రభుత్వ పెద్దల్లో ఇదే అభిప్రాయం ఉందా? ఈ ప్రశ్నలకు అవును అన్నట్లుగా కొందరు కేంద్ర మంత్రులు వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ వివాదాస్పద చేశారు. అయితే ఆ దుమారం సమసిపోకుండానే బైబుల్, ఖరాన్ గ్రంథాలు భారత ఆత్మకు సంబంధించినవి కావంటూ మరో వివాదాల తుట్టె కదిపారాయన.
 
ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేశ్ శర్మ.. దేశ రాజధానిలోని ఔరంగాజేబు రోడ్డుకు మాజీ రాష్ట్రపతి కలాం పేరు పెట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ కాలం ముస్లిం అయినా దేశ భక్తుడు, అని జాతీయ వాది అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యత రహిత్యమైన వ్యాఖ్యలు చేయడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే మహేశ్ శర్మను భర్తరఫ్ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
 
ఇంతజరిగినా మహేశ్ శర్మ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ముస్లిం పేర్లన్నీ మార్చేస్తారా అని మీడియా ప్రతినిథి అడిగిన ప్రశ్నకు తాను ఆ విధంగా సమాధానం చెప్పానని వివరణ ఇచ్చారు. ముస్లిం, జాతియ వాది, మానవతా వాది అయిన కలాం పేరు పెట్టడాన్ని సమర్థించానని మహేశ్ శర్మ గుర్తుచేశారు. అయితే మంత్రి తన వ్యాఖ్యలను సమర్థించుకునే సమయంలో మరో వివాదానికి తెరలేపారు. మహాభారతం, రామాయణం లాగా బైబుల్, ఖరాన్ గ్రంథాలు భారత ఆత్మకు సంబంధించినవి కావన్నారు. తనకు అన్ని మతాలు సమానమంటూనే మహేశ్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఒకపక్క ముస్లింలు దేశభక్తులంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ప్రకటనలు చేస్తుండగా, మరోవైపు మంత్రులు, ఎంపీలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు మోదీ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి.

No comments:

Post a Comment