తక్షణ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపలేదేం?
01-08-2019 01:55:20
01-08-2019 01:55:20
- కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లునూ పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపకపోవడంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ విషయమై రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణ తలాక్ బిల్లు సహా మరికొన్ని బిల్లులను ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి పంపలేదని ఆరోపించాయి. సభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ఏయే బిల్లులను కమిటీకి పంపాలని కోరుతున్నారో తెలియజేయాలంటూ ప్రభుత్వం తమకు 23 బిల్లుల జాబితా ఇచ్చిందన్నారు. కనీసం సగం బిల్లులను పంపాలని తాము సూచించగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతారన్న భ్రమలో తాము ఉండగా.. ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు ఆమోదించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీకి రుణపడి ఉంటాం: ముస్లిం మహిళలు
తక్షణ తలాక్ బిల్లును ఆమోదించడంపై ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆఫీసు, పార్టీ నేత విజయ్ గోయెల్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొన్నారు. తాజా బిల్లుతో తాము సాధికారత సాధిస్తామన్నారు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ముస్లిం మహిళలు పార్టీ రాష్ట్ర అఽ ద్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీ మోర్చా నాయకులు స్వీట్లు పంచారు.
న్యూడిల్లీ, (ఆంధ్రజ్యోతి): తక్షణ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ బిల్లుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
No comments:
Post a Comment