Wednesday, 31 July 2019

ఉన్నావ్‌ బాధితురాలికి రక్షణ ఏదీ? Andhrajyothy

ఉన్నావ్‌ బాధితురాలికి రక్షణ ఏదీ?
31-07-2019 00:25:45

నిలదీసిన విపక్షాలు.. దద్దరిల్లిన లోక్‌సభ
కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, బీఎస్పీ వాకౌట్‌
న్యూఢిల్లీ/లఖ్‌నవూ, జూలై 30: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు (19) ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టిన ఘటన లోక్‌సభను కుదిపేసింది. మంగళవారం సభ మొదలవ్వగానే కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, బీఎస్పీల సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. దాదాపు 30మంది సభ్యులు న్యాయం కావాలని నినదిస్తూ అర గంటకుపైగా వెల్‌లో ఉండిపోవడంతో సభ దద్దరిల్లింది. తర్వాత వారంతా వాకౌట్‌ చేశారు. ఉన్నావ్‌ బాధితురాలి కారును ఢీకొట్టిన లారీ సమాజ్‌వాది పార్టీ కార్యకర్తకు చెందినదని గ్రామీణాభివృద్ధి మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. ఉన్నావ్‌ అత్యాచారం కేసులో నిందితుడైన బీజేపీ ఎంపీ కులదీప్‌ సింగ్‌ సేంగర్‌కు, అతని సోదరుడికి ఆ పార్టీ ఇచ్చిన రాజకీయ అధికారాన్ని దూరం చేయాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో భాగాలను ఆమె జత చేశారు. ప్రతిపక్షాల ఆందోళన, ప్రియాంక విమర్శల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ బీజేపీ వివరణ ఇచ్చింది. సేంగర్‌ను ఎప్పుడో బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ తెలిపారు. కాగా, ఉన్నావ్‌ బాధితురాలికి సంఘీభావంగా సోమవారం సాయంత్రం ప్రజలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్దకు చేరుకున్నారు. ‘నువ్వు ఒంటరి కాదు’ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


ఉత్తరప్రదేవ్‌లోని బాంగర్‌మవూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సేంగర్‌, ఉద్యోగం ఇప్పించమని కోరేందుకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేశాడని గత ఏడాది బాధితురాలు ఆరోపించింది. ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందు ఆమె ఆత్మాహుతికి ప్రయత్నించడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మృతిచెందాడు. ఆయన మృతికి ప్రత్యక్ష సాక్షి కూడా తర్వాతి రెండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సేంగర్‌ను గత ఏడాది ఏప్రిల్‌ 13న అరెస్టు చేశారు. కాగా.. రోడ్డు ప్రమాదానికి కొన్ని రోజుల ముందే (జూలై 12న).. కేసులు వెనక్కి తీసుకోకుంటే తన కుటుంబంలో అందర్నీ నకిలీ కేసులు పెట్టి జైలులో పడేస్తామని హెచ్చరించారంటూ సుప్రీం కోర్టుకు ఉన్నావ్‌ బాధితురాలు లేఖ రాయడం గమనార్హం.

మృత్యువుతో బాధితురాలి పోరాటం
లఖ్‌నవూలోని కేజీఎంయూ ట్రామా సెంటర్‌లో ఉన్నావ్‌ బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఆమె న్యాయవాది పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆదివారం నాడు రాయ్‌బరేలికి వెళుతుండగా వారి కారును ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పిన్ని, అత్త మరణించారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నారన్న అభియోగంపై పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే సేంగర్‌, అతని సోదరుడు, మరో 8 మందిపై హత్య కేసు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ముందు బాధితురాలి బంధువులు ధర్నా చేశారు.

No comments:

Post a Comment