Thursday, 25 July 2019

పాక్‌లో 40 వేల మంది ఉగ్రవాదులు!

పాక్‌లో 40 వేల మంది ఉగ్రవాదులు!

40 Thousand Terrorist Still In Pakistan Said Pm Imran khan - Sakshi
ఇమ్రాన్‌ఖాన్‌
పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ప్రకటన
15 ఏళ్లుగా పాక్‌ పాలకులు నిజాలు చెప్పలేదని వ్యాఖ్య
యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సదస్సులో వెల్లడి
వాషింగ్టన్‌: అమెరికాలో పర్యటిస్తున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో ప్రస్తుతం 30,000 నుంచి 40,000 మంది ఉగ్రవాదులు ఉన్నారని ప్రకటించారు. వీరంతా ఆఫ్గనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడినవాళ్లేనని తెలిపారు. యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సంస్థ వాషింగ్టన్‌లో నిర్వహించిన సదస్సులో ఇమ్రాన్‌ మాట్లాడుతూ..‘నేను అధికారంలోకి వచ్చేవరకూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే ధైర్యం అప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. పాకిస్తాన్‌లో ఉగ్రజాడ లేకుండా చేసేందుకే ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు, విద్యాసంస్థలు, అంబులెన్సులు, ఆసుపత్రులు సహా ఆస్తులను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని చెప్పారు.
అమెరికాకు నిజాలు చెప్పలేదు..
అగ్రరాజ్యం ప్రకటించిన ‘ఉగ్రవాదంపై పోరాటం’లో పాక్‌ పాల్గొంటోందని ఇమ్రాన్‌  తెలిపారు. ‘సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడులతో మాకెలాంటి సంబంధం లేదు. అల్‌కాయిదా అఫ్గానిస్తాన్‌లో ఉంది. కానీ ఎప్పుడైనా అనుకోని ఘటన జరిగితే, దానికి పాకిస్తానే బలవుతుంది. ఇందుకు మా గత ప్రభుత్వాలే కారణం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అమెరికాకు మా ప్రభుత్వాలు చెప్పలేదు. ప్రస్తుతం 40 ఉగ్రవాద సంస్థలు పాక్‌లో పనిచేస్తున్నాయి. ఈ పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్, ఇతర నేతలతో జరిగిన భేటీ చాలా కీలకమైంది.  అఫ్గాన్‌ శాంతిచర్చల్లో మేం ఏం చేయగలమో ట్రంప్‌కు చెప్పా. నేను తాలిబన్లను కలుసుకుని శాంతి చర్చలకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తా’ అని వెల్లడించారు.
ఇరాన్‌లో వేలుపెట్టొద్దు..
ఇరాక్‌ తరహాలో ఇరాన్‌ విషయంలో దుస్సాహసానికి పాల్పడవద్దని ట్రంప్‌ను ఇమ్రాన్‌ హెచ్చరించారు. ‘ఇరాన్‌ విషయంలో నా ఆందోళన ఏంటంటే.. చాలాదేశాలు అమెరికా–ఇరాన్‌ యుద్ధం పర్యావసానాలను ఆలోచించడం లేదు. ఇది 2003లో ఇరాక్‌ యుద్ధం కంటే చాలా దారుణంగా ఉండబోతోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం బుసలు కొడుతుంది’ అని ఇమ్రాన్‌ చెప్పారు. మరోవైపు ఇమ్రాన్‌ అమెరికా పర్యటన నేపథ్యంలో పాక్‌లో మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ బలోచ్‌ ప్రాంతవాసులు, ముహాజిర్లు ఆందోళనకు దిగారు.

No comments:

Post a Comment