Sunday, 29 January 2017

హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు : ఢిల్లీ హైకోర్టు

హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు : ఢిల్లీ హైకోర్టు
29-01-2017 13:58:33

న్యూఢిల్లీ : హిందూ ధర్మం ప్రకారం జరిగిన వివాహం కాంట్రాక్టు కాదని, అదొక సంస్కారమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. హిందూ వివాహం అంటే దస్తావేజును రాసుకొని కుదుర్చుకొనేది కాదని స్పష్టం చేసింది.

సిటీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన వ్యక్తిని తాను పెళ్ళి చేసుకున్నానని, వివాహానికి సంబంధించి దస్తావేజు, అఫిడవిట్ రాసుకున్నామని ఓ మహిళ కోర్టుకు తెలిపింది. తనను ఆ వ్యక్తికి భార్యగా ప్రకటించేందుకు నిరాకరిస్తూ జారీ అయిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమె వాదనను హైకోర్టు తిరస్కరించింది.

తన భర్త మరణించినందువల్ల కారుణ్య నియామక విధానంలో తనకు ఉద్యోగం ఇచ్చేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. తనకు అర్హతగల ఇతర ప్రయోజనాలను మంజూరు చేస్తూ, తనను తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా ఆదేశించాలని కోరారు.

1990 జూన్ 2న తాను పారిశుద్ధ్య కార్మికుడిని దస్తావేజు రాసుకుని పెళ్ళి చేసుకున్నానని ఆ మహిళ పేర్కొన్నారు. అప్పటికే ఆయనకు జీవించి ఉన్న మరొక భార్య ఉందని అంగీకరించారు. ఆ భార్య 1994 మే 11న మరణించిందని తెలిపారు. దస్తావేజు ద్వారా తాను పెళ్ళి చేసుకున్న భర్త 1997 ఫిబ్రవరిలో మరణించారని తెలిపారు. తాను కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేయగా తనను అదే ఆసుపత్రిలో సఫాయీ కర్మచారిగా తాత్కాలికంగా నియమించారని తెలిపారు. అనంతరం తన వివాహానికి చట్టబద్దతను నిరూపించుకోవాలని కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారని తెలిపారు. తన భర్త మరణించే సమయానికి ఆయనకు తాను మాత్రమే భార్యనని చెప్పారు.

ఆమె వాదనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. హిందూ పద్ధతిలో వివాహం చేసుకోవడమంటే సంస్కారమని, పవిత్రమైన శపథమని జస్టిస్ ప్రతిభా రాణి చెప్పారు. వివాహ దస్తావేజును రాసుకొని వివాహ బంధంలో ప్రవేశించడం సాధ్యం కాదని తెలిపారు.

No comments:

Post a Comment