పరిహారమడిగితే వేలాడదీశారు!
http://www.sakshi.com/news/andhra-pradesh/father-and-son-injured-due-to-power-cables-447292
పరిహారమడిగితే వేలాడదీశారు!
ఏపీ రైతుల పట్ల కర్ణాటక విద్యుత్ అధికారుల ఎదుటే కాంట్రాక్టర్ దుశ్చర్య
మడకశిర: తగిన నష్టపరిహారం ఇవ్వకుండా తమ పొలంలో చేపట్టిన విద్యుత్ స్తంభాల ఏర్పాటును అడ్డుకోబోయిన ఇద్దరు రైతులను కర్ణాటక విద్యుత్ అధికారుల సమక్షంలోనే తీగలపై వేలాడదీసిన ఓ కాంట్రాక్టర్ దుశ్చర్య ఇది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ సంఘటన ఆదివారం వెలుగుచూసింది.ఇది కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. ఆ రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడ – మధుగిరి మధ్య 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెళవాయి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులైన నబీరసూల్, వన్నూర్‌సాబ్ తమకు నష్టపరిహారం ఇవ్వాలని తమ భూముల్లో జరుగుతున్న విద్యుత్ లైన్ పనులను శనివారం అడ్డుకున్నారు.
విద్యుత్ స్తంభాలకు వైర్లు కట్టి ట్రాక్టర్లతో లాగుతున్నపుడు వారు దాన్ని అడ్డుకున్నారు.ఆ వైర్లను గట్టిగా చేతుల్లో పట్టుకున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ దీన్ని గమనించినా వైర్లను అలాగే లాగారు. దీంతో రైతులిద్దరూ గాల్లో తేలాడారు. పది మీటర్ల ఎత్తుకు వెళ్లగానే నబీరసూల్ భయంతో దూకేయగా...20 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే వన్నూర్‌సాబ్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఇద్దరూ గాయపడ్డారు. నష్టపరిహారం ఇవ్వకుంటే తమకు దిక్కెవరని, ఏపీ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇంత జరిగినా సదరు కాంట్రాక్టర్ దౌర్జన్యంగా పని పూర్తి చేశాడు.
No comments:
Post a Comment