ముస్లింలకు అభయం
PUBLISHED: THU,JANUARY 19, 2017 02:54 AM http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/cm-kcr-talks-over-muslim-minorities-development-programmes-and-welfare-in-telangana-assembly-1-2-534626.html-12% రిజర్వేషన్ ఇచ్చి తీరుతం.. తమిళనాడు తరహాలో తీసుకువస్తం
-అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళుతాం.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్
-రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా కచ్చితంగా అమలు చేస్తం
-బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాల బిల్లు
-హైదరాబాద్‌లో పది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఇస్లామిక్ స్టడీ సెంటర్, కన్వెన్షన్ సెంటర్
-నాంపల్లిలోని అనీసల్ గుర్బా అనాథ శరణాలయానికి రూ.21 కోట్లు మంజూరు
-కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్
-ఉర్దూ టీచరు పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా డీఎస్సీ
-ఫలక్‌నుమా జూనియర్, డిగ్రీ కాలేజీకి రూ.10 కోట్లు
-గ్రీన్‌హౌస్ స్కీంలో ముస్లిం రైతులకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులతో సమానంగా 95 శాతం రాయితీ
-ఉర్దూలోనూ నీట్ నిర్వహించడంపై ప్రధానికి లేఖ
-మౌజం, ఇమాంలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.1500 గౌరవ భృతి
-దళితులకు ఎలాంటి సౌకర్యాలు, వెసులుబాట్లు ఉన్నాయో దళిత క్రిస్టియన్లకూ అవే అమలుచేస్తం
తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిన పద్ధతుల్లోనే రాష్ట్రంలోని ముస్లింలకు కూడా 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. దీనికి కేంద్రం అంగీకరించని పక్షంలో సుప్రీం కోర్టుకు వెళుతామని చెప్పారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను పట్టించుకోలేదన్న సీఎం.. తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని చెప్పా రు. తమిళనాడు తరహాలోనే మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన ముస్లిం రిజర్వేషన్ అమలుచేసుకునేలా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని స్పష్టంచేశారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలంటే, మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదనే ఆంక్షను ముందుగా సడలించుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం 45/94 చట్టం తెచ్చి, పార్లమెంట్ ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తామని వెల్లడించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్‌పై చాలా మందికి విశ్వాసం లేదు. కానీ నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినపుడు.. ఇదేదో దుకాణం మొదలుపెట్టినరని వెకిలి చేసినరు, అవమానపరిచినరు. అలాంటిది తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినం. అట్లనే 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామనే పూర్తి విశ్వాసం నాకుంది అని ఆయన చెప్పారు.
KCR
తమిళనాడులో 1994 నుంచి ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలవుతున్నదన్న సీఎం.. అక్కడ అమలైనపుడు ఇక్కడెందుకు అమలు చేయకూడదనే భరోసా నాకుందని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో మైనారిటీ సంక్షేమంపై ప్రభుత్వం తరఫున సీఎం ప్రకటన చేశారు. అనంతరం సభ్యులు చర్చలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు. అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లను మతం పేరిట కాకుండా సామాజిక వెనుకబాటు ఆధారంగా కల్పిస్తం. తమిళనాడులో ముస్లింలకు రిజర్వేషన్ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించారు. మనమూ అదే అడిగాం. కేంద్రం కాదంటే సుప్రీంకోర్టుకు పోతం. బిల్లును ఆమోదించుకున్న తర్వాత అందరం అఖిలపక్షంగా ప్రధాని దగ్గరికి పోయి ఆమోదించాలని కోరుదాం అని సీఎం చెప్పారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..
ఉర్దూ రెండో అధికార భాష
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా కచ్చితంగా అమలు చేస్తం. దళితులకు ఎలాంటి సౌకర్యాలు, వెసులుబాట్లు ఉన్నాయో దళిత క్రిస్టియన్లకూ అవే అమలుచేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములను బోర్డు స్వాధీనం చేసుకుంటుంది. హైదరాబాద్‌లో పది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్‌తోపాటు అక్కడే సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒక కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తం. నాంపల్లిలోని అనీసల్ గుర్బా అనాథ శరణాలయానికి రూ.21 కోట్లు మం జూరు చేస్తున్నా. 17 జూనియర్, 4 డిగ్రీ కాజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వమే నడుపుతుంది. షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తులన్నింటినీ మార్చి 31లోపు క్లియర్ చేస్తం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ముస్లింలకు 4% అమలవ్వాలి. లేదంటే వెంటనే అమలయ్యేలా చూస్తాం. ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తం. ఫలక్‌నుమా జూనియర్, డిగ్రీ కళాశాలకు రూ.10 కోట్లు వెంటనే మంజూరు చేస్తం.గ్రీన్‌హౌస్ స్కీంలో ముస్లిం రైతులకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులతో సమానంగా 95% రాయితీని కల్పిస్తం. నీట్ పరీక్ష ఉర్దూలోనూ నిర్వహించాల్సిన అవసరముంది. ఈ విషయంలో గురువారం ప్రధానికి లేఖ రాస్తాను. కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలో పదెకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతమైందని తేలితే ఎంత పెద్దవాళ్లు.. కలెక్టర్ భాగస్వాములైనా వదలం. సస్పెండ్ చేస్తం. ఆ భూమిని రిస్టోర్ చేస్తం.
చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమం
రాష్ట్రంలోని మైనారిటీల్లో ముస్లిం శాతం ఎక్కువ. ఇతర క్రిస్టియన్లు, సిక్కులు తక్కువ. గతంలో మైనారిటీల అభివృద్ధికి ఖర్చు చేసింది చాలా తక్కువ. మేం ఖర్చు చేసినంత ఉమ్మడి ఏపీలో కేటాయింపుల రూపంలో కూడా లేవు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1204 కోట్లు కేటాయిస్తే.. ఇప్పటికి రూ.511 కోట్లు ఖర్చు చేసినం. మిగిలినవీ ఖర్చుచేస్తం. రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు భరోసా ఇస్తున్న. ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి వంద శాతం కట్టుబడి ఉంది. ప్రభుత్వం మీ వెంట ఉంది. ప్రభుత్వంపై విశ్వాసాన్ని ఉంచండి. బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి. ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకోలేదు. ఇప్పుడు వారి అభ్యున్నతి దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు మొదలుపెట్టింది. వంద కిలోమీటర్ల వేగంతో గత నిర్లక్ష్యాన్ని ఒక్కసారిగా పూడ్చలేం. కానీ నిర్మాణాత్మక ప్రణాళిక మొదలైంది. అందుకే ఆ శాఖను నా దగ్గరే ఉంచుకున్న.
మౌజం, ఇమాంలకు రూ.1500 గౌరవ భృతి...
గత 70 ఏండ్లు అసలు మౌజం, ఇమాంలు ఉంటారనే ఆలోచన ఏ ప్రభుత్వాలూ చేయలేదు. ఇన్నేండ్లు వాళ్ల సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు ఆ నెపాన్ని మాపై పెట్టొద్దు. మౌజం, ఇమాంలకు నెలకు ఐదారువేలు గౌరవ భృతి ఇవ్వాలన్నరు. ఒక్కసారిగా అంత ఇయ్యలేం. వెయ్యితో మొదలుపెట్టినం. ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ.1500 గౌరవ భృతి కల్పిస్తం.
బంగారు భవితవ్యాన్ని కళ్లారా చూడాలి
కేజీ టు పీజీలో భాగంగా 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించినం. మైనారిటీ పిల్లలకు శక్తినిస్తే... వాళ్ల కెపాసిటీ బిల్డ్ చేస్తే సొంతంగా ఇతరులతో పోటీపడి మంచిగ జీవిస్తరు. మైనారిటీ పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్లకు బంగారు భవిష్యత్తు రావాలి. అది నేను కళ్లారా చూడాలి.
నా వల్లనే సచార్ కమిటీ ఏర్పాటు...
నాటి యూపీఏ-1లో టీఆర్‌ఎస్ భాగస్వామిగా ఉంది. యూపీఏ మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసినపుడు ప్రపంచంలో ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్న చోట కూడా లేనంత ముస్లిం జనాభా భారతదేశంలో ఉందనే విషయాన్ని అప్పుడు నేను లేవనెత్తిన. ఇన్నేండ్లుగా వాళ్లు అన్యాయానికి గురవుతున్నారని అన్నపుడు అక్కడ ఉన్న శరద్‌పవార్, లాలూ యాదవ్, సీపీఐ, సీపీఎం నేతలు కూడా మద్దతు తెలిపారు. అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ప్రధాని మన్మోహన్ ఈ విషయాన్ని క్యాబినెట్‌లో చర్చిద్దామన్నరు. మొదటి మంత్రివర్గ సమావేశంలో ఎజెండాగా తీసుకొని.. జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీని నియమించారు. సచార్ హిందువు అయినా, అద్భుతమైన నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత కుందూ కమిటీ,మహారాష్ట్ర వేసిన కమిటీ, మనం వేసిన సుధీర్ కమిటీ ముస్లింల పరిస్థితి బాధాకరంగా ఉందని, పేదరికం భయంకరంగా ఉందని చెప్పినయి.
హైదరాబాద్‌లోనే 40 గురుకులాలు
ముస్లిం విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇయ్యాలనే ఉద్దేశంతోనే 200 గురుకుల పాఠశాలల్లో వారి కోసం 71 మొదలుపెట్టినం. వీటిల్లో 13వేల సీట్లు ఉంటే 35వేల దరఖాస్తులు వచ్చినయి. ఎమ్మెల్యేలు కూడా ఇంకా కావాలని అడుగుతున్నరు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనేది చూడకుండా అన్ని నియోజకవర్గాల్లో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నం.
ఖాళీ భూములుంటే వక్ఫ్ బోర్డు స్వాధీనం..
వక్ఫ్ భూములను కాపాడుకోవాలి. గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన భూములు పోనీయండి. అక్కడ ఖాళీగా ఎంత భూమి ఉంటే దానిని వెంటనే బోర్డు స్వాధీనం చేసుకుంటది. వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ అధికారాలకు సంబంధించిన బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించుకుందాం. హైదరాబాద్‌లోని రేస్ కోర్సు, చంచల్‌గూడ జైలు, వరంగల్‌లోని జైలు తరలింపులపై చర్చలు చేస్తున్నాం. దానిపై ప్రగతి భవన్‌లో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిపై, వక్ఫ్ భూములపై ఏం చేద్దామనే దానిపై చర్చిస్తం.. అని సీఎం చెప్పారు.
No comments:
Post a Comment