Friday, 20 January 2017

‘జల్లికట్టు’బాటు!


‘జల్లికట్టు’బాటు!
21-01-2017 04:19:31
చెన్నయ్‌ మెరీనా బీచ్‌లో వేలాదిమంది యువతీయువకులు చలికీ ఎండకీ సముద్రపు గాలికీ వెరవకుండా నాలుగురోజులుగా భీష్మించుకు కూర్చున్న దృశ్యం అద్భుతంగా ఉన్నది. నచ్చినవారు మాట్లాడుతుంటే మెచ్చినవారు చప్పట్లు కొడుతుంటే, ఉద్వేగం తప్ప ఏ మాత్రం ఉద్రిక్తత లేని ఆ వాతావరణం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ప్రజాసమస్యల మీద పదిమంది ఒక్కచోటచేరితే శాంతిభద్రతలంటూ లాఠీ విదిలించే పాలకులు ఈ దృశ్యం చూసి ఏమనుకుంటున్నారో? వేలమంది చేరినా అక్కడ ఏ ఉత్పాతమూ సంభవించలేదు. అంటువ్యాధులు సోకలేదు. కుర్రకారు ఎప్పటికప్పుడు రోడ్లనూ తీరాన్నీ శుభ్రపరుస్తూ గతంలో కంటే శుభ్రంగా కాపాడుతున్నారు. తిండినీ, నీటినీ ప్రేమగా పంచుకుంటున్నారు. వందలాదిమంది పోలీసుల సమక్షంలో కొందరు పోకిరిగాళ్ళ చేతుల్లో ఆడపిల్లలు నలిగిపోయిన దృశ్యాలు ఇటీవల చూసిన తరువాత, ఎంతోమంది ఆడపిల్లలు సముద్రపు ఒడ్డున ప్రశాంతంగా నిద్రపోతున్న దృశ్యం అద్భుతమనిపిస్తుంది. ఒక సంస్థ, ఒక రాజకీయపక్షం, ఒక నాయకుడు అంటూ ఏదీ వెనుక లేకుండా పుట్టుకొచ్చిన ఉప్పెన ఇది.

‘జల్లికట్టు’ కోసం కలసికట్టుగా సాగుతున్న ఈ ఉద్యమం తమిళనాడు మారుమూల ప్రాంతాలకూ, తమిళులు విస్తరించి వున్న విదేశాలకూ కూడా పాకింది. బరిలో ఎద్దు పరిగెత్తినప్పుడు మాత్రమే మెరీనా బీచ్‌ పరిసరాలు ఖాళీ అవుతాయని యువతరం చేసిన హెచ్చరిక నాయకులను పరుగులు పెట్టించింది. రాజకీయనాయకులనూ, పార్టీలనూ, చివరకు వాటి విద్యార్థి సంఘాలను విద్యార్థులు దూరంగా ఉంచడంతో ఎవరికి తోచిన మార్గంలో వారు తమ మద్దతు రుజువుచేసుకుంటున్నారు. తమిళనాడుకే కాక, దాని పొరుగురాష్ట్రాలకు చెందిన అన్ని రంగాల ప్రముఖులూ సామాజిక మాధ్యమాల్లో సహకారాన్ని ప్రకటిస్తున్నారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పరిస్థితి ఒక్కసారిగా పోకచెక్కలాగా మారిపోయింది. ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన భేటీలో మీ పక్షానే ఉన్నానన్న హామీతో పాటు, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నదన్న హెచ్చరిక కూడా వినిపించింది. కానీ, శుక్రవారం వేగంగా సాగిన పరిణామాలతో ఈ సమస్య తాత్కాలికంగానైనా పరిష్కారం కాబోతున్నది. ఉమ్మడిజాబితాలో ఉన్న జంతు హింస చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ముసాయిదాను కేంద్రప్రభుత్వం ఆమోదించడంతో నేడు రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి.

ఆర్డినెన్సు అమలులోకి రాగానే తానే జల్లికట్టును ఆరంభిస్తాననీ, అందువల్ల విద్యార్థులు తమ ఉద్యమాన్ని విరమించాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. మరొకపక్కన శాంతిభద్రతలను కారణంగా చూపుతూ ఈ కేసులో తీర్పును వారంపాటు వాయిదావేయాలన్న అటార్నీ జనరల్‌ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆర్డినెన్సు అమలులోకి వచ్చి సోమవారంలోగా మెరీనా బీచ్‌లో వేడుకలు జరిగే సూచనలు అధికంగానే ఉన్నాయి. దీనితో ప్రస్తుత సంక్షోభం సమసిపోతుంది కానీ, సుప్రీంకోర్టులో ఈ వివాదం ఇంకా మిగిలే వుంది. జంతుహింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘పెటా’ సంస్థ ఈ ఆర్డినెన్సును సవాలు చేయవచ్చు. తదుపరి ఆర్డినెన్సు పెటాను నిషేధించడమేనంటూ తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్య ప్రజల్లో దానిపట్ల ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా వాడుకోవడమే. శశికళ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పెటా అంతర్జాతీయ సంస్థ కావచ్చునేమో కానీ, అది భారతదేశ చట్టాలకు లోబడే ఈ దేశంలోని మూగజీవాల పక్షానపోరాడుతున్నది. లేదా, ఈ దేశం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైనప్పుడు నిలదీస్తుంది. జంతుహింస నిరోధక చట్టంలోని నియమ నిబంధనలు జల్లికట్టుకు అడ్డురావడానికి ఈ సంస్థ కారణం కాదు. సుప్రీంకోర్టులో కేంద్ర పశుసంవర్థకశాఖ కూడా జల్లికట్టును సమర్థించలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గతంలో జల్లికట్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి వివాదం రేపుతున్నాయి.

జల్లికట్టులో హింస ఉన్నదా లేదా, దానిని క్రీడ అనవచ్చునా, ఈ వినోదంలో అమానుషత్వం ఎంత అన్న అంశాలపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. పాల్గొనే వ్యక్తులు తాగిరాకుండా, వారి చేతుల్లో పదునైన వస్తువులేవీ లేకుండా పలు నిబంధనలతో జల్లికట్టులో ఎద్దులకు హాని జరగనివ్వని మాట నిజమే. ఎద్దు వెంబడి పరుగులు తీసి దాని మూపురాన్ని ఎక్కువ సమయం పట్టుకువేలాడగలిగిన వ్యక్తి విజేతగా నిలుస్తున్నాడు. స్పెయిన్‌ బుల్‌ఫైట్‌లో ఉన్న హింస ఇక్కడ లేదు కదా అన్న ప్రశ్న సరైనదే కానీ, ఒక వ్యక్తి ఒక ఎద్దుతో పోటీపడే అసలు సంప్రదాయం పోయి ఇప్పుడు వందలాదిమంది వెంటబడి ఒక ఎద్దును భయంతో పరుగులు తీయిస్తున్న మాట నిజం. దానిని లొంగదీసుకొనే, నిలువరించే క్రమంలో తోక మెలిపెట్టడం సహా కొన్ని వికృతచేష్టలు అక్కడక్కడ ఉన్నమాట నిజం. కొన్ని చోట్ల దానికే మద్యం పట్టించడమూ జరుగుతున్నది. ఒక హింసను మరొక హింసతో పోల్చి సమర్థించుకోలేం. సంస్కృతీ సంప్రదాయాల పేరిట సాగుతున్నప్పటికీ ఈ తరహా పోటీల్లో హింస ఏమాత్రమైనా ఉన్నప్పుడు ఆధునిక కాలానికి అనుగుణంగా దానిని సవరించుకోవడం అవసరం. ఇకనైనా దానిపై దృష్టిపెట్టాలి. ఇది పూర్తిగా తమిళ సంప్రదాయం కాదనీ, తెలుగు నాయక రాజులు తెచ్చినదనీ, తమిళనాడు అంతటా లేదనీ, తేవర్‌ వంటి కొన్ని ఉన్నతకులాలకు తప్ప దళితులు ఇత్యాది దిగువకులాల పాత్ర ఇందులో తక్కువన్న వాదనలూ ఉన్నాయి. అలాగే, సంస్కృతీ సంప్రదాయలతో ముడివడిన అంశాలపై న్యాయస్థానం పరిధి, తీర్పుల ప్రభావమూ, ఆచరణ పరిమితులను కూడా ఈ వివాదం మరొకమారు చర్చకు తెచ్చింది.


‘జల్లికట్టు’పై ఎవరిది రైటు?
Others | Updated: January 20, 2017 20:20 (IST)
‘జల్లికట్టు’పై ఎవరిది రైటు?
న్యూఢిల్లీ: తమిళనాడులో జల్లికట్టును సమర్థిస్తున్నవారు ఇది తమ సంస్కతిలో భాగమని, జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను తాము ఆప్యాయంగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. జల్లికట్టు పేరిట జంతువులను హింసిస్తున్నారని నిషేధాన్ని సమర్థిస్తున్న పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. ఇందులో ఎవరి వాదన ఒప్పు, ఎవరి వాదన తప్పని చర్చిస్తున్న వారు కూడా లేకపోలేదు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్‌ చేస్తూ చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న ప్రజలు మరో పక్క జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న పెటా సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేయడం గమనార్హం.

టెస్టోస్టెరోన్‌ వాడుతున్నారట...
ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ హక్కు జల్లికట్టును సమర్థిస్తున్న ప్రజలకే కాకుండా, వ్యతిరేకిస్తున్న పెటా కార్యకర్తలకు కూడా ఉంటుంది. జల్లికట్టు ఆట వ్యవసాయ సంస్కృతి నుంచి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సంస్కతిని రక్షించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఆ సంస్కృతి పేరిట వచ్చిన ఉపసంస్కృతిని మాత్రం వ్యతిరేకించాల్సిందే. జల్లికట్టు ఆటను రక్తి కట్టించేందుకు కొంత మంది ఎద్దులకు మద్యం తాగిస్తున్నారని, రక్తం కారేలా ఎద్దుల తోకను తెంపేస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆటలో జంతువులకన్నా మనుషులే ఎక్కువ గాయపడుతున్నారని అంటున్నవారు కూడా ఉన్నారు. ఎద్దులపై స్వారీ చేసి విజయం సాధించడం కోసం యువకులు ‘టెస్టోస్టెరోన్‌’ అనే లైంగిక హార్మోన్లను ఎక్కించుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి.



ఇదేమి సంస్కృతి?...
ఈ విపరీత పోకడలను ఉప సంస్కతి అంటాం. జల్లికట్టు ఆటను రక్తి కట్టించడం కోసం పెద్ద మొత్తాల్లో స్పాన్సర్‌షిప్‌లు రావడం, ప్రైజ్‌మనీ భారీగా పెట్టడం ఈ సంస్కతికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జంతు సంక్షేమ విభాగం  మార్గదర్శకాల ప్రకారం జంతువుల ఆయురారోగ్యాలను చూసుకోవడం యజమానుల బాధ్యత. వాటిపై ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరాదు. అంతేకాకుండా వాటిని భయానికి, మానసిక ఒత్తిడికి గురిచేయరాదు. జల్లికట్టు పోటీల్లోకి దించే ఎద్దులను వాటి యజమానులు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవడమే కాదు. కన్నబిడ్డల్లా కూడా చూసుకుంటున్నారనడంలో సందేహం లేదు. కానీ జల్లికట్టు పోటీలు జరిగే పది రోజులు మాత్రం అవి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.

No comments:

Post a Comment