UCC : ఉమ్మడి పౌర స్మృతి ఎలా సాధ్యం?
మాడభూషి శ్రీధర్, ఆంధ్రజ్యోతి
ABN , First Publish Date - 2023-07-25T03:49:57+05:30 IST
UCC : ఉమ్మడి పౌర స్మృతి ఎలా సాధ్యం?
భారత రాజ్యాంగ రచనా కాలంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చెప్పిన మాట, 21వ లా కమిషన్ (2018) చెప్పిన మాట ఒకటే. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) వాంఛనీయమే గానీ, దేశం మొత్తం దీన్ని ఆమోదించడానికి సిద్ధమయ్యేదాకా స్వచ్ఛందంగా అమలుకావాలని అంబేడ్కర్ చెప్పారు.
ఆర్టికల్ 44లో ఉన్న ఆదేశిక సూత్రాలకి, ఆర్టికల్స్ 25, 29లోని ప్రాథమిక హక్కులకు వైరుధ్యం ఉంది. హక్కులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది, కాని ఆర్టికల్ 44 ఆదేశిక సూత్రమే కాని ఆదేశం కాదు. తమ మత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు మైనారిటీలకు ఉందని ఆర్టికల్ 25 ప్రకటించింది. భాషా సంస్కృతి పరమైన విభిన్న లక్షణాలను రక్షించుకునే హక్కు ఆర్టికల్ 29 కింద ఉంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా, ఈ హక్కులను దెబ్బతీయకుండా యూసీసీ సాధ్యమా?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, మలేషియా, టర్కీ, ఇండోనేషియా, సూడాన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తున్నా, మనదేశంలో ఉండే వైవిధ్యానికి వాటితో పోలికలేదు. ఇస్లాం శాసనాలలో ఖురాన్ ఆధారిత మత సంప్రదాయాలే ఎక్కువగా ఉంటాయి.
హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు అనుగుణంగా వర్తించే విభిన్న చట్టాలున్నాయి. ముస్లింలు, క్రైస్తవులకు విడివిడిగా స్వంత చట్టాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం కింద వాటిని అమలు చేసుకునే హక్కులున్నాయి. దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వ ఆస్తి, దత్తత వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. గోవా ఉపయోగించే ఉమ్మడి పౌరస్మృతిని లా కమిషన్ గుర్తుచేస్తున్నది. కానీ, భర్త లేదా భార్య సజీవంగా ఉండగా హిందువులు రెండవ వివాహం చేసుకునేందుకు గోవా పౌరస్మృతి అనుమతిస్తుంది. ఇతర మతాల వారికి ఇటువంటి స్వేచ్ఛ లేదు. కనుక అటువంటి నియమాలను పాటించడం దేశమంతటా సాధ్యం కాదు. మరొక అంశం ఏమంటే, ఈశాన్య రాష్ట్రాలను, ఆదివాసీలు, గిరిజన తెగలను యూసీసీ నుంచి మినహాయించాలని ‘పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ లా’ చైర్మన్ సుశీల్ మోదీ జూలై 3న సూచించారు. ఆరెస్సెస్ కూడా గిరిజనులను ‘ఉమ్మడి పౌరస్మృతి’ నుంచి మినహాయించాలని కోరింది. కనుక అనేక మినహాయింపులతో ఎన్నికల లక్ష్యంతో ప్రభుత్వం ఏదో యూసీసీని చేయవచ్చు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై 2018 ఆగస్టు 31న ఒక విధానపత్రాన్ని విడుదల చేసింది. ముంబై హైకోర్టు న్యాయవాది దుష్యంత్ అరోరా సహా కొందరు ప్రముఖ పౌరులతో కూడిన ముసాయిదా తయారీ బృందం అక్టోబర్ 2017లో ప్రగతిశీలకమైన ముసాయిదా రూపొందించి బల్బీర్ సింగ్ చౌహాన్‌కు సమర్పించినప్పుడు ‘హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)ను రద్దును ప్రతిపాదిస్తున్న నిబంధనను చేర్చడం తప్పనిసరా? అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో సమానత్వం, దాంతో మొత్తంమీద ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంది.
ముంబైలోని ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్’ అధ్యయనంలో బహుభార్యాత్వం అన్ని మతాలలోనూ ఉన్నదని, కాని ఆ ఆచారాన్ని పాటించేవారు అంతకంతకూ తగ్గిపోతున్నారని దుష్యంత్ అరోరా చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం సర్వేలో పాల్గొన్న ముస్లిం స్త్రీలలో 1.9 శాతం మంది, హిందూ మహిళల్లో 1.3 శాతం మంది తమ భర్తకు రెండో భార్య ఉందని అంగీకరించారు. తెలంగాణలో బహు భార్యాత్వాన్ని ఆచరిస్తున్న హిందువుల సంఖ్య ముస్లింల కంటే అధికం. అస్సాంలో ముస్లింలే ఈ విషయంలో అధిక్యతలో ఉన్నారు. బహు భార్యాత్వాన్ని నిషేధించి తీరాలనీ, ఎటువంటి మినహాయింపులూ లేకుండా అన్ని మతాలవారికీ వర్తింపచేయాలని అంటే వచ్చే ప్రమాదం అధికమని 21వ లా కమిషన్ వివరించింది. ‘ప్రాథమిక హక్కులకు కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ తొలగించకుండా ఉమ్మడి పౌరస్మృతి చట్టం సాధించడం ఈ దశలో సాధ్యం కాదు, వాంఛనీయం కాదు’ అని వివరించింది. అందుకు ఎన్నో చట్టాలలో పార్లమెంట్ ద్వారా సవరణలు చేయడం అవసరం. కుటుంబ శాసనాలలో మతాలకు సంబంధించిన నియమాలలో అయోమయాలు చాలా ఉంటాయి. వాటికి స్పష్టత సాధించడం ద్వారా చట్టాలను మార్చుకోవచ్చు.
వివాహాన్ని నిర్బంధంగా రిజిస్టర్ చేయడం ఒక తగాదా. నిర్బంధ వివాహ రిజిస్ట్రేషన్ బిల్లు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉంది. వివాహానికి సమ్మతించే వయసు అందరికీ ఒకటే ఉండాలంటే ఏది? ఏ విధంగా నిర్ణయిస్తారు? 1875 నుంచి ఇండియన్ మెజార్టీ వయసు 18 సంవత్సరాలుగా అమలులో ఉంది. అయితే మహిళ పెళ్లి వయసు 21. అసలు తొలుత ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని మార్చే శక్తి ఎవరికి ఉంది? మన సంప్రదాయాల ప్రకారం యువకుల వయసు ఎక్కువ ఉండాలని, అమ్మాయి వయసు తక్కువ ఉండాలని నిర్ణయించే పెద్దలను ఎవరు మార్చాలి?
పెళ్లి సులభమే కాని, విడాకుల సమస్యను పోలీసు స్టేషన్లు, కోర్టులు తేల్చడం అంత సులువు కాదు. భార్యాభర్తలలో ఇద్దరూ సంపాదనపరులే అయితే వారి ఆస్తి తగాదా ఏ విధంగా పరిష్కరించాలి? వారి సంతానం విషయంలో పరిష్కారం మరింత సంక్లిష్టం. విడాకుల కారణాల్లో లెప్రసీ వంటి జబ్బులను తొలగించాలని ఒక సిఫార్సు ఇచ్చారు. అదేకాదు, చాలా జబ్బుల విషయంలో ఆలోచనలు చేయాలి. రోగాలు చికిత్సలు లేని వారికి విడాకులు అవసరమవుతాయి. హిందూ వివాహ చట్టంలో Restitution of Conjugal Rights అనే ఒక హక్కు ఉంది. కోర్టువారు, భార్యను లేదా భర్తను కాపురం చేయాల్సిందిగా డిక్రీ ఇవ్వవచ్చు. ఇరువురిలో ఎవరైనా వద్దనుకున్నప్పుడు విడాకులు ఇవ్వడం తప్ప ఇలా బలవంతంగా కాపురం చేయిస్తారా? ఇది సాధ్యమా? ఇటువంటి పనికిరాని చట్టాన్ని తీసిపారేయక దానికి యూసీసీ ఎందుకు? ‘స్పెషల్ పెళ్లి చట్టం 1954’ కింద వివాహ సంబంధాన్ని వ్యతిరేకించే వారు 30 రోజుల నోటీసు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వధూవరులను రక్షించడానికి చర్యలు చేపట్టే అవకాశం ఉండాలి. కులాంతర మతాంతర వధూవరులను రక్షించాలి. ఇవన్నీ చాలా ప్రధానమైన అంశాలు.
హిందూ చట్టాల కింద కొపార్సనరీ (HUF అనే సమిష్టి కుటుంబ సభ్యులకు వాటాల లెక్క) చాలా సంక్లిష్టంగా తయారైంది. దాదాపు సమిష్టి కుటుంబాలు లేకుండా పోయినా వారికి HUF సభ్యత్వం ఇస్తూ, పన్ను సంబంధిత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనుక వాటిని పూర్తిగా తొలగించాలని లా కమిషన్ సూచించింది. హిందూ అవిభాజ్య కుటుంబపు సంస్థల కింద పన్నులను రద్దు చేయాలని సిఫార్సు చేసారు.
వీలునామా ద్వారా సంక్రమించే ఆస్తుల విషయంలో మగ, ఆడవారి మధ్య సమానత్వం ఉండాలని లా కమిషన్ సూచిస్తున్నది. హిందూ చట్టంలో వీలునామాకు సంబంధించి చాలా తేడాలు ఉన్నాయి. ఆడవారి మధ్య, అన్నదమ్ములకీ కొన్ని తేడాలున్నాయి. కీర్తిశేషులైన వారి సంపాదనలో వాటా ఇచ్చే విషయాల్లో ఆస్తి సంక్రమణల నియమాలు భిన్నంగా ఉన్నాయి. ఒక యూసీసీ చట్టం తేవడానికి ఇవన్నీ అడ్డంకులు. ఏ రకంగా వీటిని పరిష్కరిస్తారో వివరించడం లేదు. 1939 ముస్లిం వివాహ రద్దు చట్టంలో సవరణ ద్వారా కొత్తగా అక్రమ సంబంధాలు (అడల్టరీ) అనే నియమాలు చేర్చాలని కమిషన్ అన్నది. నిఖానామా అంటే వివాహ కాంట్రాక్టులో బహుభార్యత్వ నేరాన్ని పరిశీలించవలసిన అవసరం అవుతుంది.
ఏ మతం వారికైనా విడాకుల కేసుల్లో కోర్టులు విపరీతమైన జాప్యం చేస్తున్నాయి. క్రైస్తవుల కేసుల్లో విధిగా రెండేళ్ల పాటు వేరుగా ఉండాలనడం దారుణం. ఆడవారు మతం మారితే పార్సీ మతంలో కమ్యూనిటీ నుంచి వెలివేస్తారు. ఆ తరువాత ఆస్తి సంక్రమణ నుంచి ఆస్తి జప్తు చేస్తారు. మతం మార్పిడి కారణం మీద ఇలా మహిళలను వెలి వేయడం, ఇంటిపేరును రద్దు చేయడం హక్కుల సమానత నియమాలకు, రాజ్యాంగ సమానతకు పూర్తి వ్యతిరేకం. మూడునాలుగు మత నియమాలు మార్చగలిగితే యూసీసీ దాదాపు 90 శాతాన్ని రూపొందించడం సాధ్యం. ఘర్షణలకు తావులేకుండా మరో 10 శాతం సంస్కరణలు చేయగలిగితే యూసీసీ సాధ్యమే.
కుటుంబ శాసనాలలోని మత సంబంధిత నియమాలలో చాలా అయోమయాలు ఉన్నాయి. వాటికి స్పష్టత సాధించడం ద్వారా చట్టాలను మార్చుకోవచ్చు. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ తొలగించినప్పుడే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం సాధ్యమవుతుంది.
మాడభూషి శ్రీధర్
No comments:
Post a Comment