ఉమ్మడి పౌర స్మృతి పేర వస్తున్న మత విభజన రాజకీయ నాటకం పై!
మంచి విశ్లేషణతో కూడిన వ్యాసం
- గడ్డం అశోక్
ఈ దేశంలో ముస్లింలకు అన్ని విషయాల్లో ప్రత్యేక చట్టాలు ఏమీ లేవు.
క్రిమినల్ లాస్, సివిల్ లాస్ అందరికీ సమానం. ముస్లింల కి అన్ని విషయాల్లో సెపరేట్ లా ఉంది అనడం దుష్ప్రచారం మాత్రమే.
వాళ్ళు అందరిలా ఇక్కడి అన్ని చట్టాలని ఫాలో అవుతున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ప్రకారం అన్ని మతాలకు మత స్వేచ్ఛ ఉంది. దాని ప్రకారమే అన్ని ప్రధాన మతాలకు వారి వారి పర్సనల్ లాస్ ఉన్నాయి. దానిని రాజ్యాంగం ఆదిలోనే ఆమోదించింది.
ముస్లింలు ఒక్కరికే పర్సనల్ లా ఏమీ ప్రత్యేకంగా లేదు. హిందువులకు హిందూ పర్సనల్ లా ఉంది, క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. ఇలా అన్ని మతాలకు రాజ్యాంగం కల్పించిన పర్సనల్ లాస్ ప్రకారం కొన్ని విషయాల్లో మాత్రమే తమ మత ఆచారాల ప్రకారం కొన్ని వ్యవహారాలు చేసుకొనే మతస్వేచ్ఛ అన్ని వర్గాల వారికీ ఉంది.
ఆ ప్రకారం ప్రతి మతం లాగా, ముస్లింలు కూడా కేవలం పెళ్ళి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలు లాంటి వ్రేళ్ళ మీద లెక్కబెట్టే కొన్ని పరిమితమైన వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవహారాలను వారి మత ఆచారాల ప్రకారం అమలు చేసుకొనే స్వేచ్ఛ ఉంది.
అది స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి అమలు లో ఉంది. అది రాజ్యాంగబద్ధ హక్కు. ఏ మతానికైనా లేదా వ్యక్తికైనా పైన చెప్పిన వ్యవహారాల్లో అతని మతానికి చెందిన ఆచారాలను పాటించొచ్చు, లేకపోతే అతను కామన్ చట్టాల ప్రకారం ఆయా వ్యవహారాలను చేసుకోవచ్చు. దానికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
కాబట్టి క్రొత్తగా ఏమీ చట్టాలు చేయనక్కర లేదు. ఆల్రెడీ ఉన్నాయి.
ఉదాహరణకు ఏ మతాన్ని అవలంభించని, దేవుడిని నమ్మని నాస్తికులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా అవుతున్నాయి కదా. అంటే మతం వద్దు అన్న వారికి సయితం పెళ్లి, విడాకులు, దత్తత, ఆస్తి పంపకాలకు సంబంధించి ఇప్పటికే కామన్ చట్టాలు ఉన్నాయి. వాటి ప్రకారమే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.
మరి క్రొత్తగా కామన్ సివిల్ కోడ్ ఏమిటి? ఇప్పుడు దాని అవసరం ఏమిటి?
సివిల్ లాస్ విషయంలో కొన్ని పరిమితమైన వ్యవహారాల్లో రాజ్యాంగం రెండు రకాల అవకాశం ఏర్పాటు చేసింది. అదేమిటంటే మతస్వేచ్ఛకు అనుగుణంగా ఎవరైనా తమ మత ఆచారాల ప్రకారం తమ వ్యక్తిగత లేదా కౌటంబిక వ్యవహారాలను కొనసాగించుకోవచ్చు లేదా కామన్ చట్టాలను కూడా అతను ఫాలో అవ్వవచ్చు.
మరి అటువంటప్పుడు బలవంతంగా అందరికి ఒకే చట్టం అని ఇప్ప్పుడు ఈ హడావిడి ఎందుకు? రాజ్యాంగ బద్ధంగా తమ మత ఆచారాలను ఫాలో అవుతాము అన్న వారి మత స్వేచ్ఛను ఎందుకు అధికారికంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం కాదా?
భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని 75 సంవత్సరాలు దాటేసినా కూడా ఒకే దేశంగా నిలబెట్ట గలిగింది కదా?
మరి భిన్నత్వంలో ఏకత్వం వల్ల వల్ల కలిగిన లేదా కలుగుతున్న నష్టం ఏమిటి? అన్ని మతాల పర్సనల్ లాస్ వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏమిటి?
రాజ్యాంగబద్ధంగా ఎవరి మత ఆచారాలను వాళ్ళు ఫాలో అయితే ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేమిటి? రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రం ముసుగులో, రాజ్యాంగ ప్రాధమిక హక్కులైనటువంటి మత స్వేచ్ఛను కాలరాయడం న్యాయమా? అది ప్రజాస్వామ్యమా?
ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు అయినటువంటి పేదరికం, నిరుద్యోగం, అవినీతి, పెరుగుతున్న నిత్యావసర ధరలు, మండుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు, నడ్డి విరుస్తున్న పన్నులు, ఆడవాళ్ల పై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, దేశానికి తిరిగిరాని నల్లధనం, కూలుతున్న వంతెనలు, దిగజారిపోయిన జిడిపి, వెనక్కి వెళ్ళిపోతున్న విదేశీ పెట్టుబడులు, దివాళా తీస్తున్న కంపెనీలు, బ్యాంకులు, బడాబాబులు ఎగవేస్తున్న బ్యాంకు అప్పులు, రైతుల ఆత్మహత్యలు, నిర్వీర్యం చేయబడుతున్న ప్రభుత్వ సంస్థలు, అమ్ముడయిపోతున్న దేశ సంపద, ప్రైవేటైజేషన్, ఇవన్నీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పర్సనల్ లాస్ వల్ల జరుగుతున్నాయా? అలా కాదే!
మరి అందరినీ ఇబ్బంది పెడుతున్న ఆ ప్రధాన సమస్యలను పరిష్కరించడం మానేసి, గత ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన దేశాభివృద్ధి వాగ్దానాలు పూర్తి చేయకుండా, వారి పరిపాలనా లోపాలను కప్పిపుచ్చు కోవడానికి, దేశంలో హిందూ ముస్లింలు ఎప్పుడూ విభజించబడి, పరస్పరం దూషించుకునే, ద్వేషించుకునే సున్నితమైన మతపరమైన అంశాలను తెరపైకి తీసుకురావడం, మెజారిటీ మతం యొక్క ఓట్లను పొందడం కోసం, మైనారిటీ వర్గాల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను అమలు చేయడం అనేది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగునా?
పాలించే ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు ప్రతినిధినా? లేదా ఒక ప్రధాన మతానికి మాత్రమే ప్రతినిధినా? రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలో చేయమని చెప్పిన చాలా ప్రధాన విషయాలు ఉండగా కూడా, కేవలం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ను మాత్రమే, అది కూడా 2024 ఎన్నికల ముందు ఇంత హడావుడిగా అమలు చేసే ప్రయత్నం వెనుక దాగి ఉన్న మతరాజకీయం ఏమిటీ?
ఒక వేళ యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని భావించినా కూడా, అసలు అది ఎలా ఉంటుందో ఓ స్పష్టమైన ముసాయిదా ఏదీ? అది క్లియర్ గా చెప్పకుండా మీరు యూ.సి.సి ని సపోర్ట్ చేస్తారా లేదా అని అడగడం మోసం కాదా? ప్రజలను మతం పేర విభజించే మత రాజకీయం కాదా?
ఇది ఎలా ఉందంటే బస్టాండ్ లో ఎవరి ఊరి బస్సు వాళ్ళు ఎక్కడం కాదు, అందరూ ఒకే బస్ లో ప్రయాణం చేయాలి ఎందుకంటే పెట్రోల్ కలసి వస్తుంది అన్నట్లుంది! ప్రయాణికుడు స్వంత డబ్బులతో టిక్కెట్ కొని అతని ఊరి బస్ ఎక్కాక, నీవు చెప్పే కాకమ్మ కబుర్లు విని, నీ అబద్ధపు పెట్రోల్ సేవింగ్ కోసం విశాఖపట్నం, విజయవాడ లేదా ఇతర ప్రాంతాలకు, వేర్వేరు దిక్కులకు వెళ్లాల్సిన ప్రయాణీకులు, వారి వారి ఊరి బస్ ల నుండి దిగిపోయి, నీవు ఏర్పాటు చేసిన ఏ ఊరి బోర్డ్ లేని, ఏ రూటు వెళ్తుందో తెలియని బస్ లో ప్రయాణికులు ఎలా ఎక్కుతారు? ఒకవేళ ఎక్కినా ఒకే బస్ అందరిని ఏకకాలంలో అనేక దిక్కుల్లో ఉన్న వారి వారి ఊర్లకు ఎలా చేర్చుతుంది? ఇది హాస్యాస్పదంగా లేదా?
కాబట్టి ముందు స్పష్టమైన యూ.సి.సి ముసాయిదా తయారు కావాలి, దానిపై అన్ని మతాల వారితో సుదీర్ఘంగా చర్చించాలి. మెజారిటీ, మైనారిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి ఒక్కరి హక్కులను, మతస్వేచ్ఛను కాపాడుతూ, రాజ్యాంగ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఆ క్రొత్త చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలియపరచాలి. వాటిలో మార్పు చేర్పులతో, అందరి ఆమోదంతో మాత్రమే యూ.సి.సి. తయారవ్వాలి.
ఆ బాధ్యతను కూడా ఒక రాజకీయ పార్టీకి ఇవ్వరాదు. మతతత్వ పార్టీకి అస్సలు ఇవ్వరాదు. అది బీజేపీ అయినా, ఎమ్.ఐ.ఎమ్. అయినా సరే. ఈ అతి సున్నితమైన, యావత్ భారతదేశ ప్రజల పై, విభిన్న రాష్ట్రాల పై, అక్కడి మతాల పై, వర్గాలపై, ఆచారాలు, సంస్కృతుల పై తీవ్ర ప్రభావం చూపే యూ.సి.సి. లాంటి చట్ట తయారీ బాధ్యత ఒక స్వచ్చంద సంస్థ కు అప్పజెప్పాలి. నిపుణులతో కూడిన ఆ కమిటీలో అన్ని ప్రాంతాల, మతాల, వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. వారు అందరూ సుదీర్ఘంగా చర్చించి నిజంగా సంస్కరణకు అవసరమైన విషయాలను పారదర్శకంగా చర్చించి, ఎవరి విశ్వాసాలను, మనోభావాలను, ఆచారాలను దెబ్బతీయకుండా కామన్ చట్టాలు తయారు చేయడంలో తప్పు లేదు.
కానీ అసలు సమస్య ఏమిటంటే ఇంతటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం తన ఎజెండాలో పెట్టుకున్న ఓ మతతత్వ పార్టీ ఈ యూ.సి.సి. గురించి అడుగులు వేస్తుంటే సాధారణంగా మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతాయి. వారిని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం గుర్తించకుండా, తమ పార్టీ సపోర్టర్స్ తో మీకు హిందూదేశం కావాలంటే ఇదే మంచి సమయం, యూ.సి.సి. ద్వారానే దానిని సాధించుకోగలం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధ్యం కాదు, దేశంలో ముస్లింలు ఒక్కరే ప్రత్యేక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అని అబద్ధాలు చెబుతూ, దాని వల్ల హిందువులు ఎంతో కోల్పోతున్నారు అని నమ్మబలుకుతూ, ముస్లింలు దేశాన్ని ప్రేమించడం లేదు, వారి మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అసత్యాలు ప్రచారం చేస్తూ, ఓ ప్రక్క మాకు దేశమే ముఖ్యం మతం కాదు అని చెబుతూనే, మరో ప్రక్క అమాయక హిందూ సోదరులను మతం పేరుతో రెచ్చగొడుతూ, రాబోయే 2024 ఎన్నికల్లో మెజారిటీ మతం వారి ఓట్లతో మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.
అంతా డబుల్ స్టాండర్డ్స్. ఏనుగుకి రెండు రకాల పళ్ళు ఉంటాయట. చూపించే పళ్ళు వేరే, తినే పళ్ళు వేరే. అలా ఉంది వీరి వరస.
ఆ మతతత్వ పార్టీ మాకు దేశం ప్రధానం, మతంకాదు అంటూనే, రాజ్యాంగం మరియు నేటి చట్టాలలోని అన్ని లొసుగులు వాడుకుంటూ, ఈ దేశాన్ని మత దేశంగా మార్చే ప్రయత్నంలో భాగమే నేటి ఈ యూ.సి.సి. అమలుకు చేస్తున్న కృషి అని రాజకీయ విశ్లేషకుల గట్టి అభిప్రాయం. కాబట్టి ఒకవేళ సున్నితమైన మతాన్ని వాడుకొని, అధికార దుర్వినియోగానికి పాల్పడి, బలవంతాన యూనిఫామ్ సివిల్ కోడ్ ను వారికి అనుకూలంగా తయారు చేసుకొని అమలు చేసినా సరే, ఈ దేశాన్ని ఆర్ధికంగా మరియు అన్ని విధాలా అధోగతికి నెట్టుతున్న సమస్యల్లో 0% కూడా ఏ మార్పు రాదు.
ఇంకా సమస్యలు జఠిలమై, దేశంలో అస్థిరత ఏర్పడి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగి, దేశం మరో శ్రీలంకలా ఆర్ధికంగా, అన్ని విధాలా దివాళా తీయడం మాత్రం ఖాయం.
కానీ అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఏమాత్రం లాభం ఉండదు. కాబట్టి విజ్ఞత గల భారతీయులు ఎమోషనల్ అయి ఆ మతతత్వ పార్టీ ఉచ్చులో పడకుండా నిజాయితీగా, నిజమైన భారతీయులు గా ఆలోచిస్తేనే అసలు వాస్తవం అర్ధం అవుతుంది. ఆ మతతత్వ పార్టీ వారు "దేశాన్ని ప్రేమించే వారు యు.సి.సి కావాలంటుంటే, మాకు మా మతమే ముఖ్యం అంటున్న వారు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారు" అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
వీరి మెసేజ్ లతో, వీడియోలతో సోషల్ మీడియా వేదికలు నిండిపోతున్నాయి. ఇలా ఆ పార్టీ మతం పేరున అమాయక ప్రజల నుండి యూ.సి.సి. కి సపోర్ట్ ను కూడగడుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే దేశాన్ని ప్రేమిస్తున్న వారందరూ యూ.సి.సి. ని వ్యతిరేకిస్తుంటే, కేవలం ఆ మతతత్వ పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ మాకు దేశం కన్నా మా మతతత్వ పార్టీనే ముఖ్యం, మా నాయకుడే ముఖ్యం అంటున్నవారు మాత్రమే అసలు ఏ జ్ఞానం లేకుండా యూ.సి.సి. ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది యదార్ధం.
కానీ చివరకు ఒక మాట అంటాను: నిజంగా నిద్రపోయే వారిని నిద్ర లేపొచ్చు గాని, నిద్రపోతున్నట్లు నటించే వారిని మాత్రం నిద్ర లేపలేము. ఇక ఎవరి ఇష్టం వారిది. ఎవరు చేసుకున్న ఖర్మకు వారే బాధ్యులు.
సత్యమేవ జయతే. జైహింద్.
From
gaddam ashok wall
No comments:
Post a Comment