ముస్లిం వ్యతిరేక కథనాలతో వాస్తవాలకు మసి!
ABN , First Publish Date - 2023-09-16T03:44:09+05:30 IST
హైదరాబాద్ ముస్లింలు అందరికీ రజాకార్ హింసాకాండలో ప్రమేయమున్నదనేది ఒక తప్పుడు భావన. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలని ప్రగాఢంగా కోరుకున్న ముస్లింలలో అత్యధికులు హిందువులపై హింసకు పాల్పడలేదు....
ముస్లిం వ్యతిరేక కథనాలతో వాస్తవాలకు మసి!
హైదరాబాద్ ముస్లింలు అందరికీ రజాకార్ హింసాకాండలో ప్రమేయమున్నదనేది ఒక తప్పుడు భావన. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలని ప్రగాఢంగా కోరుకున్న ముస్లింలలో అత్యధికులు హిందువులపై హింసకు పాల్పడలేదు. అటువంటి దాడులకు పాల్పడుతున్నవారికి ఏ విధంగాను సహకరించలేదు. అనేక చోట్ల ముస్లిం నేత కార్మికులను హిందూ నేతన్నలు రక్షించారని సుందర్ లాల్ పేర్కొన్నారు. సార్వత్రక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈ మత సామరస్య గాథలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.
Pause
Unmute
Remaining Time -5:25
Close Player
సామాజిక సమూహాలు తీవ్ర భావోద్వేగాలకు లోనై, వివేచనను విడనాడినప్పుడు సంభవించేదేమిటి? హైదరాబాద్‌లో పోలీసు చర్య సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తే పై ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ సెప్టెంబర్ 17న, ఆ పోలీసు చర్యకు సరిగ్గా 75 ఏళ్లు. ఒక విషాదాన్ని ఓటర్ల మధ్య విభజనలు సృష్టించేందుకు రాజకీయవేత్తలు, ఇతర అవకాశవాదులు ఉపయోగించుకుంటున్న దృష్ట్యా ఆ సంఘటనపై నిష్పాక్షిక పరిశీలనకు మరింత ప్రాధాన్యమున్నది. 1948లో హైదరాబాద్ పరిస్థితి ప్రజలు అర్థం చేసుకున్న దానికంటే మరింత సంక్లిష్టమైనది. ఆనాటి ఘటనలను నిశితంగా చూచినప్పుడు పోలీసు చర్య అనుభవం కులం, సామాజిక వర్గం, ఇతర అస్తిత్వాలతో నిర్ణయింపబడింది.
ఇటీవల ‘రజాకార్’ అనే సినిమా ముస్లింలను దుష్ట స్వభావులుగా చిత్రీకరించింది. ముస్లింల పట్ల ఇటువంటి విషపూరిత ప్రచారానికి 1947–48లో చారిత్రక పూర్వోదాహరణలు ఉన్నాయి. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని ‘భారత్‌ను పీడిస్తున్న కేన్సర్ వ్యాధి’గా, ‘రోగగ్రస్త అవయవం’గా తూష్ణీకరించేవారు. పోలీసు చర్య పూర్వాపర సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఒకప్పుడు అణగదొక్కబడిన పండిట్ సుందర్‌లాల్ కమిటీ నివేదికను చదవవలసిన అవసరమున్నది. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది పండిట్ సుందర్‌లాల్ నేతృత్వంలోని కమిటీ ఘటనల క్రమాన్ని సవివరంగా నమోదు చేయడంతో పాటు వాటిపై నిష్పాక్షిక వ్యాఖ్యలు చేసింది. అత్యంత జాగ్రత్తతో రూపొందించిన ఆ నివేదికను చాలా కాలం పాటు ప్రజల దృష్టికి రాకుండా చేశారు. అయితే సుందర్‌లాల్ బృందంలో సభ్యుడు, రాజకీయ వేత్తగా మారిన న్యాయవాది యూనస్ సలీం ఒక అనామక పత్రికలో దాని గురించి చేసిన ప్రస్తావన పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించింది. పోలీసు చర్య జరిగిన మూడు దశాబ్దాల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకున్నది. సుందర్‌లాల్ కమిటీ తుది నివేదిక ప్రతినొకదాన్ని పది సంవత్సరాల క్రితం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో పరిశోధకులు కనుగొన్నప్పుడు అది ఎట్టకేలకు లోకం దృష్టికి వచ్చింది.
1947లో దేశ విభజన తరుణంలో హైదరాబాద్ సంస్థానంలోని హిందువులు రజాకారుల దాడులకు గురవుతుండేవారు. అతిశయోక్తులకు తావులేకుండా అంగీకరించవలసిన చారిత్రక వాస్తవమిది. సుందర్‌లాల్ కమిటీ నివేదిక ఇలా పేర్కొంది: ‘రజాకార్ దురాగతాలలో ప్రధానమైనది ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామంపై నెలసరి సామూహిక జరిమానాను విధించడం. రజాకారులు విధించిన మొత్తాన్ని చెల్లించడం జరిగితే మరెటువంటి సమస్య ఉండేదికాదు. ఎక్కడైనా చెల్లించడానికి నిరాకరిస్తే లూటీలు జరిగేవి. అప్పటికీ ప్రజలు ఆ సామూహిక జరిమానాను చెల్లించేందుకు తిరస్కరిస్తే రజాకారులు హింసకు పాల్పడేవారు. హత్యలు చేసేవారు. కొన్ని సందర్భాలలో అత్యాచారాలు కూడా జరిగేవి’.
హైదరాబాద్ ముస్లింలు అందరికీ రజాకార్ హింసాకాండలో ప్రమేయమున్నదనేది ఒక తప్పుడు భావన. అది పలు విధాలుగా సత్యదూరమైనది. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలని ప్రగాఢంగా కోరుకున్న ముస్లింలలో అత్యధికులు హిందువులపై హింసకు పాల్పడలేదు. అటువంటి దాడులకు పాల్పడుతున్నవారికి ఏ విధంగాను సహకరించలేదు. నాటి ముస్లిం సంస్థలలో ప్రధానమైనది మజ్లిస్ ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్. దీనికి కాశిమ్ రజ్వీ నాయకుడు. ఆ సంస్థపై అతడికి పూర్తి పట్టు ఉండేది. అయినప్పటికీ ఆనాటి పరిస్థితులకు ముస్లింలు ఎలా ప్రతిస్పందించాలనే విషయమై మజ్లిస్ కనీసం మూడు వర్గాలుగా చీలిపోయింది. హైదరాబాద్ కొన్ని షరతులతో శాంతియుతంగా భారత్‌లో విలీనమవ్వాలని వాటిలో రెండు వర్గాలు కోరుకునేవి.
హైదరాబాద్ సంస్థాన ముస్లింలు అందరికీ ప్రాతినిధ్యం వహించే హక్కు తమకు మాత్రమే ఉన్నదన్న రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్ వాదనను పలువురు సవాల్ చేశారు. కవి, కమ్యూనిస్టు నాయకుడు మఖ్దుం మోహియుద్దీన్ రాసిన ఒక పుస్తకంలో మజ్లిస్ కేవలం రెండువేల భూస్వామ్య కుటుంబాలు, ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులకు మాత్రమే గానీ సంస్థానంలోని సమస్త ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ కానేకాదని స్పష్టం చేశారు. దానికి అలాంటి హక్కు లేనేలేదని ఆయన ఖండితంగా చెప్పారు. హైదరాబాద్‌లోని ఇరవైలక్షల మంది సామాన్య ముస్లింల పరిస్థితి వారి సహచర హిందువుల స్థితిగతులకు భిన్నంగా లేవని గణాంకాలతో మఖ్దూం విశదం చేశారు. రజ్వీ ప్రభావం ముస్లింలు అందరిపైన లేదనడానికి ఇంకా అనేక నిదర్శనాలు ఉన్నాయి.
రజ్వీ సన్నిహిత మిత్రులు, నమ్మకస్తులలో మధ్యతరగతి హిందువులు కూడా ఉండేవారు. వారిలో చాలామంది అతడి సొంత పట్టణమైన లాతూరు, దాని పరిసర ప్రాంతాలకు చెందినవారే. అతడి కుటుంబ డాక్టర్ ఒక హిందూ మహిళ. రజ్వీ కుటుంబం ఏకాకి అయిపోయిన సమయంలో కూడా ఆమె వారికి అండగా నిలబడ్డారు. హిందువులతో రజ్వీ వ్యక్తిగత సంబంధాలపై జడ్జి, స్వామి రామానంద తీర్థ జీవిత చరిత్రకారుడు నరేంద్ర చాపల్ గావోంకర్ తన ‘ది లాస్ట్ నిజాం అండ్ హిజ్ పీపుల్ ’అన్న పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఇలా రాశారు: ‘ప్రజల దృష్టిలో రజ్వీ ఒక విలన్. తన ఉద్రేకపూరిత ప్రసంగాలతో అతడు హింసాకాండను రెచ్చగొట్టాడనడంలో సందేహం లేదు. అయితే అతడెప్పుడూ వ్యక్తిగతంగా ఆయుధాన్ని చేపట్టలేదు. అటువంటి వ్యక్తుల ధోరణి అలానే ఉంటుందనుకోండి. అదలా ఉంచితే రజ్వీ తన ప్రవర్తనలో క్రూరుడు, హింసాత్మక ప్రవృత్తి ఉన్న వ్యక్తి కాదు. సామాన్య వ్యక్తులు అందరూ వ్యవహరించే విధంగానే అతడూ వ్యవహరించేవాడు. రజాకార్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు రజ్వీ తన కార్యాలయానికి వచ్చి టీ తెప్పించమని ఉల్లాసంగా అడిగేవాడని నిజామ్ విజయ్ అనే మరాఠీ వారపత్రిక సంపాదకుడు వాసుదేవరావు ఫతక్ రాశారు’.
పోలీసు చర్య ప్రభావం మతాలకు అతీతంగా కవులు, కళాకారుపై కూడా ఉన్నది. గజల్ గాయకులు రైస్, విఠల్ రావులకు కొత్త వ్యవస్థలో పోషణ, ప్రోత్సాహం కొరవడింది. కవులు, రచయితలు అనువాదకులు తదితరులు అకస్మాత్తుగా ఆదాయాన్ని కోల్పోయారు.
పోలీసు చర్య ప్రభావం సంస్థాన ప్రజలపై భిన్న రీతుల్లో ఉందని సుందర్‌లాల్ కమిటీ నివేదిక, ఆనాటి ఉర్దూ వార్తాపత్రికల కథనాలు, ప్రత్యక్ష సాక్షులు వివరణలు స్పష్టంగా వెల్లడించాయి. ప్రదేశాలను బట్టి, వ్యక్తుల సామాజిక స్థాయిని బట్టి ఆ ప్రభావం వేర్వేరు విధాలుగా ఉండేది. అయితే ముస్లింలు అందరూ ఏదో ఒక విధంగా ప్రభావితులయ్యారనేది ఒక స్థిర సత్యం. పోలీసుచర్య సమయంలోనూ, ఆ తరువాత ముస్లింలపై తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు జరిగాయి. హింసాకాండలో ఎటువంటి ప్రమేయం లేనివారు సైతం ఈ కక్ష పూరిత దాడులకు బాధితులుఅయ్యారు. సుందర్‌లాల్ కమిటీ నివేదిక ఇలా పేర్కొంది: ‘ప్రతీ ఒక్క రజాకార్ చర్యలకు కనీసం వంద మంది ముస్లింలు మూల్యం చెల్లించడం జరిగింది మృతదేహాలతో నిండిపోయిన బావులను మాకు చూపించారు’. సరిహద్దు జిల్లాల్లోను, రజాకార్ కార్యకలాపాలు ముమ్మరంగా జరిగిన పట్టణాలలో ప్రతీకార దాడులు తీవ్రంగా చోటుచేసుకున్నాయి.
తీవ్ర విపత్కర పరిస్థితులలోనూ ముస్లింలు, హిందువుల మధ్య సౌభ్రాతృత్వం వర్ధిల్లిన ఉదంతాలు అనేకమున్నాయి. రజాకార్ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తమ ఇరుగుపొరుగున ఉన్న హిందువులకు ఎటువంటి హాని జరగకుండా ముస్లింలు జాగ్రత్త వహించారు. హిందువులను కాపాడే విషయంలో మషాయిఖ్ అనే సూఫీ ఆధ్యాత్మిక నాయకులు చూపిన చొరవ చాలా ముఖ్యమైనది. అలాగే పోలీసుచర్య సమయంలోనూ, ఆ తరువాత హిందువులు సహచర ముస్లింలను కాపాడేందుకు తమ ప్రాణాలను ఒడ్డారు. అనేక చోట్ల ముస్లిం నేత కార్మికులను హిందూ నేతన్నలు రక్షించారని సుందర్‌లాల్ పేర్కొన్నారు అలాగే హైదరాబాద్ హిందువులు ముస్లిం మహిళలను వారి అపహర్తల నుంచి విడిపించి రక్షించారు. సార్వత్రక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈ మత సామరస్య గాథలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరమున్నది.
l మొహమ్మద్ అయూబ్ ఖాన్
దక్షిణాసియా ముస్లిం రాజకీయాల, చరిత్ర పరిశోధకుడు
(సెప్టెంబర్ 17: పోలీసు చర్యకు 75 ఏళ్లు
No comments:
Post a Comment