Avadhish Rani : అప్పట్లో మా కోడ్... పాల్‌రాప్సన్
ABN , First Publish Date - 2023-09-17T05:34:20+05:30 IST
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొరియర్‌గా సేవలందించారు అవ్‌ధీశ్ రాణి. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్‌కు చెల్లెలు కూడా. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా...
Avadhish Rani : అప్పట్లో మా కోడ్... పాల్‌రాప్సన్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొరియర్‌గా సేవలందించారు అవ్‌ధీశ్ రాణి.
Pause
Unmute
Remaining Time -4:04
Close Player
ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజ్ బహదూర్ గౌర్‌కు చెల్లెలు కూడా. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా... ప్రపంచంలోనే మహత్తరమైన
ఆ పోరాట చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా... ఆనాటి జ్ఞాపకాలను అవధీశ్ రాణి ‘నవ్య’తో చెబుతున్నారిలా.!
‘‘అది 1948 సెప్టెంబరు17. సమయం సాయంత్రం 5 గంటలు. హైదరాబాద్ గౌలీపురాలోని మా గల్లీ అంతా జనంతో కిక్కిరిసింది. అక్కడ అంతమంది గుమిగూడినా... గుండుసూది కిందపడినా వినిపించేంతటి నిశ్శబ్దం. వారందరి దృష్టి మా ఇంటి గుమ్మానికి వేలాడదీసిన రేడియో మీదే ఉంది. అప్పుడు నా వయసు ఎనిమిదేళ్లు. ‘‘ఆసఫ్‌జాహీ వంశానికి చిహ్నమైన కరవాలాన్ని జనరల్ ఛౌధురికి ఏడో నిజాం కుమారుడు ఆజం జా అప్పగించారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది’’ అంటూ ‘దక్కన్ రేడియో’ ప్రయోక్త జఫ్రూల్ హసన్ ఉర్దూలో ప్రకటించారు. ఆ వెంటనే జ్యోతికా రాయ్ పాడిన ‘పగ్ ఘున్‌గ్రూ బంధ్ మీరా’ అనే మీరాబాయి భజన్ ప్రసారం చేసినట్టు నాకు బాగా గుర్తు. ఆ తర్వాత జఫ్రూల్ పాకిస్తాన్‌లో స్థిరపడినా... ప్రముఖ కవి మగ్దూం చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఆయనను కలిశాను కూడా. మా అన్నయ్య రాజ్ బహదూర్‌గౌర్ వల్ల నేనూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నా వంతు సహకారం అందించాను. ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ స్థాపకుడిలో అన్నయ్య కూడా ఒకరు. కాబట్టి జావేద్ రిజ్వీ, మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి కమ్యూనిస్టు నాయకులంతా మా ఇంటికి తరచూ వచ్చేవారు.
పోలీసును అడ్డుకున్నా...
చిన్నవయసులోనే పీసీ జోషీ, డాంగే, అజయ్‌ఘోష్, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి పెద్దనాయకులను ఎన్నో సార్లు కలిశాను. అలాంటి మహనీయులను చూస్తూ, మగ్దూం కవితాలాపన వింటూ పెరిగాను. నా బాల్యజ్ఞాపకం అంటే... 1947, దీపావళి. ఆ రోజు జావేద్ రజ్వీ, మగ్దూంతో పాటు ఇంకొందరు కార్యకర్తలు రహస్యంగా మా ఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్లు ఉన్న గదిలోకి ఇతరులు వెళ్లకుండా నన్ను కాపలా ఉంచారు. సరిగ్గా అదే సమయానికి కిషన్‌లాల్ అనే పోలీసు అధికారి కూడా వచ్చారు. అతను మాకు దగ్గర బంధువు కూడా. ఆ మిషతో అన్నయ్యా వాళ్ల కదలికలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవారు. ఆ పోలీసు నేరుగా జావేద్ వాళ్లు ఉన్నగది వైపు వెళుతుంటే... ‘’అక్కడ ఆడవాళ్లంతా లక్ష్మీపూజలో ఉన్నారు. వెళ్లొద్దు’’ అన్నాను. అంతే... నా చెంప మీద ఛెళ్లుమనిపించాడు. దాంతో నాకు కోపం వచ్చి ఆయన మీద తిరగబడ్డాను. రక్కుతూ... కుర్తా చింపి గొడవ చేయడంతో ఆ పోలీసు వెళ్లిపోయారు. ఒకవేళ గదిలో మా అన్నయ్య కనుక ఉంటే ఏడుస్తూ వెళ్లి చెబుతా కదా! కనుక వాళ్లు లోపల ఉన్నారా? లేరా; అని నిర్ధారించుకోవడం కోసం ఆ రోజు నన్ను కొట్టినట్లు ఇరవై ఏళ్ల తర్వాత కిషన్‌లాల్ అంకులే నాకు స్వయంగా చెప్పారు.
అప్పుడు అదే మా కోడ్...
అజ్ఞాతంలోని పోరాట యోధులకు సమాచారాన్ని బట్వాడా చేయడం భోజనాలు తీసుకెళ్లడం లాంటి బాధ్యతల్లోనూ చాలా చురుగ్గా పాల్గొన్నాను. ‘ఫలానా చోటుకు భోజనం తీసుకురావాలి’ అని కార్యకర్తలు ముందురోజు రాత్రి కాగితం రాసి మా ఇంటి దర్వాజా సందులో విసిరేసేవాళ్లు. అది చూసి, మా అమ్మా వాళ్లూ రొట్టెలు, పరోటాలు, ఆలుసబ్జీ లాంటివన్నీ వండి, సంచుల్లో మూటగట్టి నాకు ఇచ్చేవారు. దాన్ని భుజాన వేసుకొని వాళ్లు చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లేదాన్ని. ‘పాల్‌రాప్సన్’ అనేది మా కోడ్. అక్కడికి వెళ్లాక ‘పాల్‌రాప్సన్’ అంటూ నేను పాటపాడితే, అవతలి వ్యక్తి వచ్చి మెల్లగా ‘పాల్ రాప్సన్’ అంటాడు. అప్పుడు అతనికి భోజనం సంచిని, ఇంకా ఏమైనా కాగితాలు ఇస్తే వాటిని అందజేసేదాన్ని. అలా చాలాసార్లు గౌలీపురా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని లలితాబాగ్ అమ్మవారి దేవాలయం వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని. అలా పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా అజ్ఞాతంలోని స్వాతంత్య్ర సమరయోధులకు కొరియర్‌గా వ్యవహరించాను. తెలంగాణ సాయుధ పోరాటంలో నేనూ భాగమైనందుకు గర్విస్తున్నాను.
మతాంతర వివాహాలు...
గౌర్ అన్నయ్య ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు నేను రెండుసార్లు ములాఖత్‌కు వెళ్లి కలిశాను. అప్పుడు మరో స్వాతంత్య్ర సమరయోధుడు కేఎల్ మహేంద్రకు ఇవ్వమని అన్నయ్య రహస్యంగా నాకు ఒక కాగితం ఇచ్చారు. దాన్ని నేను ఎవరి కంటా పడకుండా షూలో పెట్టుకొని తెచ్చి ఆయనకు ఇచ్చాను. మా వదిన బ్రిజ్‌రాణి గౌర్‌కూడా ఏడాది జైల్లో ఉంది. ఆమె చెల్లెలు రేణుకను ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన జావేద్ రజ్వీ వివాహమాడారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో చాలామంది కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నారు. అలా పాతనగరంలోని కొన్ని హిందూ- ముస్లిం కుటుంబాల మధ్య బంధుత్వాలు కలిశాయి. అదే ఇప్పుడు జరిగితే, దాన్ని ‘లవ్ జీహాదీ’ అని కొందరు గగ్గోలు పెడతారేమో! ఒకసారి ఏమైందంటే... ‘హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లాడాడు’ అని మా బంధువులామె పెదవి విరుస్తూ మా నాయనమ్మతో చెప్పింది. అప్పుడు మా నాయనమ్మ ఏమన్నదో తెలుసా? ‘‘అబ్బాయి, అమ్మాయే కదా షాదీ చేసుకుంది. అబ్బాయిని అబ్బాయి లేదంటే అమ్మాయిని అమ్మాయి పెళ్లాడలేదు కదా! నీకెందుకు బాధ’’ అన్నది. ఇవాళ చదువుకున్న యువత ఈ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నందుకు బాధేస్తుంటుంది.
వాళ్ల సహకారం లేకుంటే...
గౌలీపురా కమాన్ దగ్గర రోజూ ఉదయం కొంతమంది రజాకార్లు మార్చ్ ఫాస్ట్ చేసేవాళ్లు. అది అయిపోయాక, వాళ్ల బృందంలోని ఎల్లయ్య, మల్లన్న అని ఇద్దరు మా ఇంటికొచ్చి మంచినీళ్లు, చాయ్ తీసుకెళ్లేవారు. వాళ్లను చూశాకే తెలిసింది... రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉన్నారని! ఆర్థిక ఇబ్బందులు భరించలేని వాళ్లు చాలామంది ఉపాధి మార్గంగా రజాకార్లలో చేరారు. అంతేకానీ నిజాం మీద ప్రేమతో కాదు. రజాకార్‌గా మారినందుకు సొంత తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు మా పక్కింటి మంజిల్ మియా. ‘సియాసత్’ వ్యవస్థాపకుడు అబిద్ అలీఖాన్‌కు సహాధ్యాయి అయిన మహబూబ్ హుస్సేన్ జిగార్ కూడా రజాకార్ సైన్యంలో చేరిన తన తమ్ముడు ఇబ్రహీంను కుటుంబం నుంచి వెలి వేశాడు. దాంతో కళ్లు తెరిచిన ఇబ్రహీం తర్వాత కాలంలో పాకిస్తాన్‌లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం పనిచేశాడు. అబిద్ హాసన్ సఫ్రానీ మేనల్లుడు హసన్ నాసర్ సైతం పాక్‌లో సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు జీవితాన్ని త్యాగం చేశాడు. మారూఫ్ అనే ఆయుధాల వ్యాపారి, వస్త్ర దుకాణదారుడు మహ్మద్ అలీ, జమీందారీ బిడ్డ ఎంకే మోయినుద్దీన్.... ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఎంతోమంది ముస్లింలు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు సహాయ సహకారాలు అందించారు. చాలామంది నిజాం రాచరికానికి వ్యతిరేకంగా నేరుగా ఉద్యమించారు. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆనాటి పాతనగరంలోని మధ్యతరగతి ముస్లిం కుటుంబాల అండదండలు లేకుంటే అసలు తెలంగాణ సాయుధ పోరాటం ముందుకు సాగేదే కాదు. ముఖ్యంగా జమాలున్నీసా బేగం, రజియా బేగం, మునీర్ ఆపా... ఇలా ముస్లిం మహిళలు ఎంతోమంది నిజాం నియంతృత్వాన్ని నిరసించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీర వనితలుగా నిలిచారు. ఇప్పటికీ వారందరి కుటుంబాలతో నా స్నేహం కొనసాగుతోంది.’’
నిజాం కాలేజీలో...
అఖిల భారత విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు రఫీ అహ్మద్ 1947, ఆగస్టు 15 తెల్లవారు జామున నిజాం కాలేజీలోని తరగతి గది బయట భారత జాతీయ జెండాను ఎగరేశాడు. అతణ్ణి నిజాం పోలీసులు వెంబడించారు. వారినుంచి తప్పించుకొని నేరుగా మా ఇంటికి వచ్చి, ఆ సంగతులు అన్నయ్యతో చెబుతుండగా విన్నాను. అలా నాకు తెలిసి హైదరాబాద్ నగరంలో మొట్టమొదట మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించింది రఫీ అహ్మద్ అని అనుకుంటున్నా!
ఇదీ నా జీవితం...
మాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాయస్థ కుటుంబం. మా తాతయ్య వ్యాపారరీత్యా 150 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలా మేమంతా ఇక్కడే పుట్టి పెరిగాం. మా అన్నయ్య డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ ప్రభావంతో నేనూ చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా మారాను. ఫస్ట్ క్లాస్ నుంచి పీహెచ్‌డీ వరకు నా చదువంతా ఉర్దూలోనే సాగింది. నా ఉద్యోగ జీవితం... డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా మొదలై ఎన్‌సిఈఆర్‌టి ఉర్దూ పాఠ్యపుస్తకాల రూపకల్పన చేసే స్థాయి వరకు కొనసాగింది. చరిత్రకారుడు, సీనియర్ ఐఏఎస్ వసంతకుమార్ బావ ‘లాస్ట్ నిజాం’ పుస్తక రచన సమయంలో... ‘తెలుగు, ఉర్దూ భాషల మీద పట్టున్న వ్యక్తి కావాలి’ అని ఎవరినో అడిగితే, వారు నా పేరు సూచించారట! అలా నేను ఆయనకు పరిచయం అయ్యాను. ‘బండెనక బండి కట్టి...’ లాంటి తెలుగు పాటలను, మరికొంత ఉర్దూ సమాచారాన్ని ఇంగ్లీషులో అనువదించడం లాంటి పనులతో ఆయన పుస్తక రచనలో పరోక్షంగా భాగస్వామినయ్యాను. తర్వాత ఓ రోజు నన్ను ఇష్టపడుతున్నట్టు మా అన్నయ్యతో వసంత్ చెప్పారట. ‘‘ఆ విషయం అవ్‌ధీశ్‌తోనే చెప్పు’’ అని అన్నయ్య అనడంతో... తన మనసులో మాటను వసంత్ నా ముందు ఉంచారు. ‘‘మీరు పంజాబీ క్రిస్టియన్. నేను కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరురాలిని. మరి కుదురుతుందా?’’ అని ఆయనను అడిగాను. తనకేమీ అభ్యంతరం లేదన్నారు. బాగా ఆలోచించి, రెండేళ్ల తర్వాత అంటే, 1991లో ‘ఓకే’ చెప్పాను. మా వివాహ సమయంలో ఆయన వయసు 63, నా వయసు 53. మా ఇద్దరి మతాలు వేరైనా, దృక్పథాలు భిన్నమైనా ఎన్నడూ మా మధ్య కలతలు తలెత్తలేదు. అన్యోన్యంగా కలిసి బతికాం. వసంత్ సహచర్యంతో ఇన్నాళ్లు నా జీవితం చాలా ఆనందంగా సాగింది. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలే మిగిలాయి. హైదరాబాద్ చరిత్రను రికార్డు చేసిన అతికొద్దిమందిలో వసంత్‌కుమార్ బావ ఒకరు. వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ ఉద్యమాలకు అంకితమై పనిచేశారు. ఆయన మరణానంతరం వసంత్ వ్యక్తిగత గ్రంథాలయంలోని పదివేల పుస్తకాలను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీకి ఇచ్చాను.
కె. వెంకటేశ్
ఫొటోలు: ఆర్.రాజ్‌కుమార్
No comments:
Post a Comment