ప్రధాన స్రవంతి నుండి నెట్టివేయబడి, వెలివేతకు గురైన ముస్లిములు భారతదేశపు నయా దళితులుగా అవతరిస్తున్నారు.
28 మే 2023న చెన్నైలో విడుతలై చిరుతైగళ్ కట్చి (వి.సి.కె) స్థాపించిన "అంబేద్కర్ సుదర్" అవార్డును స్వీకరించిన సందర్భంగా సి.పి.ఐ (యమ్.యల్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య చేసిన ప్రసంగ పాఠం:–
గౌరవనీయులు అధ్యక్షుడు కామ్రేడ్ తిరుమావళవన్, కామ్రేడ్ సింధానై సెల్వన్, డి. రవి కుమార్, ఇతర నాయకులు, వి.సి.కె సభ్యులు, గౌరవనీయ సహచర అవార్డు గ్రహీతలు కామ్రేడ్ డి.రాజా, కామ్రేడ్ కె.బాలకృష్ణన్, శ్రీ అప్పావు, శ్రీమతి తాయమ్మాళ్ అర్వాణన్, శ్రీ మోహన్ గోపాల్, శ్రీ రాజేంద్ర పాల్ గౌతమ్, సహచరులు మరియు స్నేహితులకు వణక్కం (నమస్కారం)! మీ అందరికీ శుభసాయంత్రం!
భారతదేశాన్ని అమితంగా ప్రేమించే వారిని అణచివేస్తూ భారత రాజ్యాంగంపై నిరవధిక దాడి చేస్తున్న శక్తులు సామాజిక సమానత్వం మరియు అభివృద్ధి కొరకు జరుగుతున్న పోరాటాన్ని కుట్రపూరితంగా వెనక్కి నెట్టడానికి నిరంతర ప్రయత్నం చేస్తున్నాయి. స్వేచ్ఛాయుత, వైవిద్య భరిత భారత దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో సాధికారత పొందిన భారత పౌరులను భయంకరమైన సైనిక రెజిమెంట్లుగా దిగజార్చుతూ, ద్వేషపూరిత విభజనకు గురి చేయబడుతున్న తరుణంలో భారత దేశ అణగారిన వర్గాలకు కుల నిర్మూలన నినాదాన్ని అందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందకరమైన సన్నివేశాన్ని కల్పించిన వి.సి.కె సహచరులకు ధన్యవాదాలు. ఇటీవలి సంవత్సరాలలో సామాజిక పరివర్తన కోసం కొనసాగుతున్న ఉద్యమం యొక్క వివిధ ప్రవాహాల మధ్య ఒక స్వాగతించాల్సిన ధోరణిని మనం చూస్తున్నాము.
డాక్టర్ అంబేద్కర్ మనకు కుల నిర్మూలన పిలుపును అందించడమే కాకుండా ఈ దిశలో మనల్ని ముందుకు తీసుకువెళ్లే మార్గాలను కూడా సూచించారు. శ్రామిక వర్గాన్ని విభజించే పన్నాగమే కులాన్ని చట్టబద్ధం చేయాలనే ఆలోచన అని ఆయన దాన్ని తిరస్కరించారు. కులం ప్రాతిపదికగా శ్రామికుల విభజనకే ఆ విధానం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నాడు. శ్రామికులు మరియు కార్మికులను స్వతంత్ర తరగతిగా ఏకం చేయాలని పట్టుబట్టాడు. సామాజిక పరివర్తన కోసం మన నిరంతర అన్వేషణలో డాక్టర్ అంబేద్కర్ స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ యొక్క అద్భుతమైన వారసత్వం, స్ఫూర్తి మరియు అంతర్దృష్టి మనకు గొప్ప నిధిగా మిగిలిపోయాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబరుగా తాను నిర్వహించిన పాత్ర ద్వారా ఆయన చేసిన సహకారం వలనే అనేక శ్రామిక హక్కులు సాధించబడ్డాయి. అస్పృశ్యులకు ఆలయ ప్రవేశం కంటే కూడ వారికి దేశ వనరులు సమానంగా లభించాలని ఆయన కోరుకున్నాడు. సజాతి వివాహం వల్ల నిరాఘాటంగా కొనసాగుతున్న కుల వ్యవస్థ నిర్మూలనకు కులాల సామూహిక భోజనాలు సరిపోవని, కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు నిజమైన సాధనమని ఆయన ఉద్భోదించారు. మహిళలు స్వేచ్ఛగా తమ జతను ఎన్నుకునే హక్కు కోసం ఆయన నిరంతరం తన పోరాటాన్ని కొనసాగించారు.
లోతుగా పాతుకుపోయిన సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా నిశ్చయాత్మక చర్యగా రిజర్వేషన్ లను ప్రవేశపెట్టాడు. భారతదేశంలోని అణగారిన ప్రజలు అధ్యయనం, పోరాటం మరియు సంఘటితం అనే మూడు మార్గాల ద్వారా జీవితంలో ముందుకు సాగాలని కోరారు. నేడు రిజర్వేషన్లు మరియు అణగారిన ప్రజల విద్యా హక్కు మళ్ళీ దాడిని ఎదుర్కొంటున్నాయి. రిజర్వేషన్ ను ఉపసంహరించుకోవడం, విద్యను ప్రైవేటీకరించడం మరియు కాంట్రాక్ట్ & కాజువల్ ఉద్యోగాలు అనేవి సామాజిక అభివృద్ధి మరియు సమానత్వం కోసం సాగుతున్న పయనాన్ని ఆపడానికి భారతదేశంలోని అణగారిన పేదలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డ త్రిశూలం వంటివి. నేను చెన్నైకి వచ్చే మార్గంలో నాగ్ పూర్ లో ఒకరోజు బస చేసి, దీక్ష భూమిని సందర్శించాను. డాక్టర్ అంబేద్కర్ మరియు అతని అనుచరులు సామూహికంగా బౌద్ధ మతాన్ని స్వీకరించడాన్ని వేద గ్రంధాలను సామూహికంగా తిరస్కరించడాన్ని కుల అణచివేతకు వ్యతిరేకంగా తీవ్ర సామాజిక నిరసనగానూ మరియు ఒకరి మతాన్ని ఎంచుకునే రాజ్యాంగ హక్కును నొక్కి చెప్పడంగానూ మనం అర్థం చేసుకోవాలి.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సమయంలోనే డాక్టర్ అంబేద్కర్ స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశారు. సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశ పెట్టడం పట్ల సంతృప్తి చెందవద్దని, ఆర్థిక, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడాలని, ఆ అసమానతలను సరిదిద్దకపోతే ఓటు సమానత్వానికి అర్థం లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనేవి ఒక సమగ్ర తాత్విక దృక్కోణంగా ఉన్నది. ఇది మాత్రమే కుల వ్యవస్థ యొక్క కళంకాన్ని అంతం చేయగలదు. ఈరోజు దళితులు వివిధ స్థాయిలలో మళ్లీ బహిష్కరణ, అణచివేతకు గురవుతున్నారు. క్రైస్తవులు కూడ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పెరిగిన వివక్షను మరియు హింసాత్మక దాడులను ఎదుర్కొంటున్నప్పటికీ పూర్తిగా అట్టడుగుకు నెట్టి వేయబడి, తీవ్రమైన వెలివేతకు గురవుతున్న ముస్లిములు భారతదేశం యొక్క నయా దళితులుగా అవతరిస్తున్నారు. రాజకీయాలలోకి మతం ప్రవేశించడాన్ని ప్రజాస్వామ్యం క్షీణిండం గానూ, నియంతృత్వంలోనికి జారిపోవడానికి నిశ్చయమైన మార్గంగానూ బాబా సాహెబ్ మనల్ని హెచ్చరించారు. నేడు ఈ మతమౌఢ్యం భారతదేశం యొక్క విజ్ఞాన వ్యవస్థ మరియు సమాచార వ్యాప్తిని కప్పివేస్తోంది. అన్నిటికీ మించి అంబేద్కర్ భారతదేశంలో హిందూ రాజ్యం ఆవిష్కృతమవ్వడానికి వ్యతిరేకంగా మనకు స్పష్టమైన హెచ్చరికనిచ్చారు. హిందూ రాజ్య అవతరణ అనేది భారతదేశం పాలిట అతిపెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన దానిని భారతీయులు సర్వశక్తులతో నిరోధించాలని కోరారు.
భారతదేశ ప్రజలు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో భారత ఖజానాకు భారీ ఖర్చుతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తూ పార్లమెంటరీ ప్రోటోకాల్ ను ధిక్కరిస్తూ తాను సర్వజ్ఞుడననే ఉన్మాదంతో ఉన్న ప్రధాని మోడీ మనం చెన్నైలో సమావేశమైన సమయంలోనే ప్రారంభించాడు. ఆర్.ఎస్.ఎస్ – బిజెపి బ్రిగేడ్ భారతదేశానికి ఒక ఆదివాసీ మహిళను ప్రస్తుత రాష్ట్రపతిగానూ మరియు అంతకుముందు ఒక దళితుడిని రాష్ట్రపతిగానూ చేయడం తమ ఘనత అని చెప్పుకున్నాయి. అయితే కొత్త పార్లమెంటుకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం సమయం వచ్చినప్పుడు ఇద్దరు అధ్యక్షులకు రాజ్యాంగపరమైన హక్కు నిరాకరించబడింది. కొత్త పార్లమెంటు భవనం మరియు దాని ప్రారంభోత్సవం ప్రజాస్వామ్య వ్యతిరేక, రిపబ్లిక్ వ్యతిరేక సంకేతాలతో కూడుకున్నదన్న వాస్తవాన్ని అలక్ష్యం చేయలేము. లౌకిక రిపబ్లిక్ లో ప్రజాస్వామ్య కేంద్రం ప్రారంభోత్సవం రాచరిక వ్యవస్థలో రాజు పట్టాభిషేకాన్ని పోలి ఉన్నప్పుడు దానిలో స్పష్టమైన సంఘ్ పరివార్ రాచరిక వ్యామోహం, హిందూ మత ఉన్మాదం ద్యోతకమవుతున్నాయి. ఇది మన రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న స్ఫూర్తి మరియు దృక్పథానికి స్పష్టమైన తిరస్కారాన్ని సూచిస్తుంది.
ఆ మరసటి రోజే అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క పాలనా అధికారాలను ధ్రువీకరించింది. మరియు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వం యొక్క సమాఖ్య (ఫెడరల్) అధికారాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోరుతూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే కార్యనిర్వాహక వర్గం (కేంద్ర క్యాబినెట్ మరియు కేంద్ర అధికార వ్యవస్థలతో కూడిన ఎగ్జిక్యూటివ్) మరో రాజ్యాంగ విభాగమైన న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించింది. భారతదేశం యొక్క రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలోని సమాఖ్య విధానాన్ని చావుదెబ్బ తీయడానికి తద్వారా రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. డాక్టర్ అంబేద్కర్ మనల్ని హెచ్చరించిన అతిపెద్ద ముప్పు గురించి భారతదేశ ప్రజలమైన మనం మేల్కొనే సమయం ఆసన్నమైంది. తమ సర్వస్వం త్యాగం చేసిన మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు కలలుగన్న దోపిడీ మరియు అణచివేత లేని ఆధునిక భారత్ కు ఎదురైన పెనుముప్పును ఓడించాల్సి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేయాల్సి ఉంది.
సి.పి.ఐ (యమ్.యల్) మరియు విప్లవ కమ్యూనిస్టు శిబిరం తరపున ఈ సంవత్సరం "అంబేద్కర్ సుదర్" అవార్డును నేను వినమ్రంగా స్వీకరిస్తున్నాను. భారతదేశాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశంగా, దృఢమైన లౌకిక రాజ్యంగా, వైవిధ్యభరితమైన నిజమైన సామ్యవాద దేశంగా మార్చే లక్ష్యం కోసం మరియు కుల నిర్మూలన లక్ష్యం దిశగా నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.
అనువాదం:– సి.హెచ్ నాగేశ్వరరావు
No comments:
Post a Comment