Sunday, 16 April 2017

అకారణంగా తలాక్ అంటే బహిష్కరణే -ముస్లిం పర్సనల్ లాబోర్డు హెచ్చరిక

అకారణంగా తలాక్ అంటే బహిష్కరణే -  ముస్లిం పర్సనల్ లా బోర్డు
Mon,April 17, 2017 01:26 AM
Maula
-ముస్లిం పర్సనల్ లాబోర్డు హెచ్చరిక

న్యూఢిల్లీ:షరియా (ఇస్లామిక్) చట్టంలో పేర్కొన్నట్లుగా సరైన కారణాలు లేకుండా మూడుసార్లు తలాక్ చెప్పినవారు సాంఘిక బహిష్కరణకు గురవుతారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆదివారం తెలిపింది. తలాక్ విషయంలో కొందరికి అవగాహన కొరవడిన కారణంగా, దీనిపై త్వరలోనే తాము ప్రవర్తన నియమావళిని రూపొందిస్తామని పేర్కొన్నది. మూడుసార్ల తలాక్‌కు చట్టబద్ధత ఉందా లేదా అనే దానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తమ మతానికి సంబంధించిన ట్రిపుల్ తలాక్ విషయంలో బయటి వ్యక్తులు, సంస్థలు జోక్యం చేసుకోకుండా చూసుకోవాలని శనివారం నిర్వహించిన సమావేశంలో ఏఐఎంపీఎల్‌బీ నిర్ణయించింది. అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే మూడుసార్ల తలాక్‌ను ఉపయోగించుకునేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానావలి రెహ్మానీ తెలిపారు. మూడుసార్ల తలాక్ విషయంలో ప్రవర్తన నియమావళిని రూపొందిస్తున్నాం. శుక్రవారం నమాజ్ సమయంలో ఈ నియమావళిని చదువాల్సిందిగా మసీదు మౌలానాలు, ఇమామ్‌లకు తెలియజేస్తాం అని ఆయన తెలిపారు.

తలాక్ షరియా చట్టానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. మూడుసార్ల తలాక్‌ను రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించడమంటే ఖురాన్‌ను తిరిగిరాసినట్లే అని అభిప్రాయపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి తమకు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉందని మౌలానావలి చెప్పారు. మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మూడుసార్ల తలాక్ ఉల్లంఘిస్తున్నదని గత డిసెంబర్‌లో అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది.

ట్రిపుల్ తలాక్ చట్టబద్ధతపై విచారణను ముగించడానికి మే 11 నుంచి 19 వరకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాన్ని గతేడాది అక్టోబర్ 7న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సవాలుచేసింది. లింగ సమానత్వం, లౌకికవాదాన్ని కాపాడాల్సిందిగా అభ్యర్థించింది. బాబ్రీమసీదు విషయంపై మౌలానావలి రెహ్మానీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలను తాము అంగీకరిస్తామని తెలిపారు. అయోధ్య-బాబ్రీమసీద్ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవలసిందిగా మార్చి 21న సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment